Thursday, May 5, 2011

గంగా నది పుష్కర వైభవం , Ganga river puskara vaibhavam



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -గంగా నది పుష్కర వైభవం (Ganga river puskara vaibhavam)- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

గంగా నది పుష్కర వైభవం , Ganga river puskara vaibhavam(08/05/11-19/05/11)
పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగకు గంగానది సిద్ధమవుతోంది. ఆ పన్నెండురోజులూ గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి. అసలు పుష్కరాలెందుకు? వాటి ప్రాశస్త్యం ఏమిటి? ... అదంతా ఓ పెద్ద కథ. పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. భక్తవశంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన. అందుకే, 'దేవా... నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు' అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు(బృహస్పతి) తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు వెుదలవుతాయి. ఆ ప్రకారం మే 8 నుంచి 19 దాకా... గంగకు పుష్కర మహత్తు వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.


ప్రతి మనిషి ఒంట్లో ఉండే మూడొంతుల నీరు గంగే. ఉద్వేగం పెల్లుబికినప్పుడు, జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు, బొటబొటా రాలే చమటబిందువు గంగే! పూజారి చేతి పవిత్ర తీర్థం గంగ. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగ. పాతాళంలోంచి పొంగే జలధార గంగ. గంగ... వేదాల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది. రామాయణంలో ఉంది. భారతంలో ఉంది. భాగవతంలో ఉంది. భగవద్గీతలో ఉంది. అనగనగా కథల్లో ఉంది. జానపద గాథల్లో ఉంది. పల్లెపాటల్లో ఉంది. పామరుల నమ్మకాల్లో ఉంది. అయినా, గంగ లేనిదెక్కడ? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది బికారి శివయ్యనే అయినా... గంగ సమస్త భారతీయుల హృదయగంగ. గంగ అంతర్వాహిని. గంగ అనంతవాహిని.

రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు.

'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా'లో నెహ్రూ ఎంతగొప్ప మాటన్నారు... 'గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'.

గంగచుట్టూ అల్లుకున్న కథలూ గాథలూ ఐతిహ్యాలూ పురాణ ప్రాశస్త్యాలూ... నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ, ప్రతి కథా గంగ మీదున్న గంపెడు ప్రేమకు సాక్ష్యమే. ప్రతి ఐతిహ్యం ఆ తల్లికి పట్టే మంగళ హారతే.

పురాణ కథ గంగా నది పుట్టుక :

గలగలా జలజలా... బిరబిరా చకచకా... నవ్వుతూ తుళ్లుతూ... పొంగుతూ పొర్లుతూ... పాల నురగలతో... మురిపాల నడకలతో... భువికి దిగెను గంగ... ఉత్తుంగ తరంగ! ఆ ఘట్టం పురాణ కథైంది. రామాయణంలో భాగమైంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు... కేశిని, సుమతి. భృగుమహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవైవేలమంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి, సగరుడు అశ్వమేధయాగం తలపెడతాడు.
అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడి భయం. దొంగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. చికట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్లి, కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమే లేనప్పుడు, అశ్వమేధ యాగమేమిటి? క్రతువు ఆగిపోతుంది. సగరుడు కుమిలిపోతాడు. అరవైవేలమంది తనయులూ ఆగ్రహంతో ఊగిపోతారు. యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మహర్షి మీద అభాండాలు వేస్తారు. తపస్వికి కోపవెుస్తుంది. అరవైవేలమందినీ కంటిచూపుతో కాల్చేస్తాడు.

అసమంజుని కొడుకు అంశుమానుడు..పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిదకుప్పలు. విషయం అర్థమైపోతుంది. అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరితరమూ కాదు. భగీరథుడి పాలన వెుదలవుతుంది. భగీరథ ప్రయత్నమూ వెుదలవుతుంది. అతని
ఘోరతపస్సుకు మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుడ్ని ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు.

శివుడి జటాఝూటాల్లోంచి... గంగావతరణ వెుదలవుతుంది.

శివుడినెత్తిన ఉన్న సురగంగ...
హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పువైపున... హ్లాదిని, పావని, నళిని. పశ్చిమం దిక్కున... సుచక్షు, సీత, సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దార్లోనే జహ్ను మహర్షి ఆశ్రమం.ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదలచేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ... ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ... అపుడపుడూ ఉద్ధృతంగా... అక్కడక్కడా మందగమనంతో... ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ.

భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని
పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు, అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చినరోజే, మకర సంక్రాంతి!

క్రాంతి అంటే మార్పు. భరతజాతి చరిత్రలో గంగావతరణాన్ని మించిన, గొప్ప మార్పేముంది? వ్యవసాయిక దేశంలో జలవనరులు నిండుగా మెండుగా పొంగిపొర్లిన నాడే నిజమైన పండగ. అందుకే, పచ్చని పంటలిచ్చిన గంగమ్మ ప్రత్యక్ష దైవమైంది. ఆ ఒడ్డునే పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నగరాలు పుట్టాయి. సామ్రాజ్యాలు ప్రాణంపోసుకున్నాయి. నాగరికత పరిఢవిల్లింది. దివిగంగ భువికి దిగివచ్చిన తీరు అద్భుతం. అదో అపురూప ఘట్టం. 'రఘువంశం'లో కాళిదాసు పదప్రవాహం గంగాఝరిని గుర్తుకుతెచ్చింది. ఉత్పలవారి 'గంగావతరణం' మాత్రం తక్కువా?

'హృషీకేశ హరిద్వార రుష్యాశ్రమ ముక్తేశ్వర పుణ్యపదములెల్ల దాటి పొంగులెత్తి వచ్చెగంగ!'

...ఆ పద్యపాదాల్లో గంగమ్మ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. బాపురమణల 'సీతాకల్యాణం'... గంగావతరణను వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించింది. సినారె ఆ క్రతువుకు కలంసాయం అందించారు. రవివర్మ నుంచి వడ్డాదివారి దాకా... ఎంతోమంది చిత్రకారులు ఆ అద్భుత దృశ్యానికి రంగులద్దారు.

మహాబలిపురంలోని గంగావతరణ శిల్పం... రాతితో మలచిన రమణీయ కావ్యం. కెవిన్‌ పెర్ష్‌ అనే ఆస్ట్రేలియా చిత్రకారుడైతే... ఆరేళ్లు శ్రమించి, వెుత్తం 21 చిత్రాలలో గంగాప్రవాహాన్ని కాన్వాస్‌ మీద సృష్టించాడు. 'ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి వేయి బొమ్మలైనా సరిపోవు. వంద రంగులున్నా చాలవు. నా ప్రయత్నం చంద్రుడికో నూలుపోగే' అని వినయంగా చెప్పుకున్నాడు కెవిన్‌.

ఆది గంగ...
గంగ పుట్టుక వెనుకా ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు...ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం... గడపదాకా రావడమంటే, ఎంతదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే... సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా... గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు, సరస్వతి నదులకే ప్రాధాన్యం.

రుగ్వేద రుక్కులు ఆ రెండు నదుల్నే కీర్తించాయి. ఓచోట 'గంగ' ప్రస్తావన ఉన్నా, ఆ మాట నీటికి సంబంధించిందో, ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. రుగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగానదిని 'జాహ్నవి' అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది.

రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు. మిగిలిన భారతమంతా మనకు తెలిసిందే. చరిత్రలో గంగ
ప్రాధాన్యం విస్మరించలేనిది. మహామహా రాజ్యాలన్నీ గంగ ఒడ్డునే వెలిశాయి. సారవంతమైన గంగ-యమున పరీవాహక ప్రాంతంపై ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగాయి.

జల సాక్షి...
నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి. అంతరించాయి. రాజ్యాలు వెలిశాయి. మట్టికొట్టుకుపోయాయి. నదులు వర్తకవాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి. పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి. పాడిపంటలకు మూలమయ్యాయి. మనిషి మనుగడను మలుపుతిప్పిన నదీనదాలు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ గంగానదులు కాలేకపోయాయి. భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం వేరు. పుట్టుక నుంచి కట్టకడదాకా, ఆమాటకొస్తే మరణం తర్వాత కూడా... భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. 'గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ...' అంటూ పెద్ద ముత్తయిదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా... సురగంగ బిరబిరా తరలివస్తుంది.

కార్డు మీద పిన్‌కోడ్‌ నంబరు వేయకపోతే, పోస్టుమాస్టరుగారికి చిర్రెత్తుకొస్తుంది. సరైన చిరునామాలో అందించడానికి ఆ అంకెలు చాలా అవసరం.

సృష్టిమాస్టారుగారి పిన్‌కోడ్‌... గంగ! గంగా పరీవాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు... తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ వెుర దేవరకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగితీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు... శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట
తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని 'గంగ...' పోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం.

మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేవో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.

గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.

జ్ఞానవాహిని..
గంగ... జ్ఞానగంగ! ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో... ఎన్నో జీవితాలు మారాయి. చికట్లు తొలగిపోయాయి. అజ్ఞానం పటాపంచలైంది. అహం మంచులా కరిగిపోయింది. ఓరోజు శంకర భగవత్పాదులవారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు. నాలుగు శునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు. 'స్వామివారొస్తున్నారు. పక్కకు తప్పుకో' అని హెచ్చరించారు శిష్యులు. 'పక్కకు జరగమంది ఈ శరీరాన్నా? శరీరంలోని ఆత్మనా? అప్పుడది ద్వైతమే కానీ, అద్వైతం కాదే' అని వాదిస్తాడు చండాలుడు. కాదుకాదు, చండాలుని రూపంలోని పరమశివుడు. గంగమ్మ సాక్షిగా శంకరుడికి
జ్ఞానబోధ అవుతుంది. కర్తవ్యోపదేశం జరుగుతుంది. గంగ మనసు వెన్న. పిలిస్తే పలుకుతుంది. అర్థిస్తే కరుణిస్తుంది. తెలుగు కవి పండితరాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి. 'గంగాలహరి' రాసిన పరమభక్తుడాయన. చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నాడు. ఒడ్డున నిలబడి 'గంగాలహరి' పాడుతుంటే...ఒక్కో శ్లోకం పూర్తవుతుంటే, ఒక్కో అడుగూ ముందుకొచ్చి... ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగ. ఇప్పటికీ, గంగానదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులిస్తారు. ఇది, తెలుగువారికి గంగమ్మ మీదున్న భక్తికి నిదర్శనం. గంగమ్మకు తెలుగువారి మీదున్న ప్రేమకు తార్కాణం. ముక్తినిచ్చే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా? గంగ, దాని ఉపనదుల పుణ్యమాని పరీవాహక ప్రాంతమంతా పచ్చదనమే. వరి, మిరప, చెరకు, జనపనార... తదితర పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులతో పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీతీరాలు... ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగనీరే దిక్కు. గంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగ నలుగురి కోసం నేలకు దిగింది. పంటలకు నీరిచ్చింది. మనుషులకు పంటలిచ్చింది. జలచరాలకు ప్రాణమిచ్చింది. ఎంత మంచితనం, ఎంత త్యాగగుణం!

పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి. ఉద్ధృత గంగా ప్రవాహం... అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి, నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టువిడుపులుండాలన్న గొప్పపాఠమది. గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది. ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్నీ వంకల్నీ చిన్నాచితకా నదుల్నీ ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది.
సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. ఇక యమునకైతే అర్ధ సింహాసనాన్నిచ్చి గౌరవించింది. రెండు మతాలు, రెండు ప్రాంతాలు, రెండు జాతులు, ఇద్దరు వ్యక్తులు... ఒక్కటిగా ఉండాలని చెప్పిన ప్రతిసారీ గంగాయమునల సంగమాన్నే గుర్తుచేసుకుంటాం. నిజానికి గంగ కంటే, యమున భౌతికంగా శక్తిమంతమైంది. ఉద్ధృతమైంది. కానీ గంగకున్న ఆధ్యాత్మికశక్తి ముందు, త్యాగమయమైన చరిత్రముందు యమున సవినయంగా తలవంచింది. అందుకే అది 'యమునాగంగ' సంగమం కాలేదు. 'గంగాయమున' సంగమమే అయ్యింది.

రామ్‌ తేరీ గంగా మైలీ...
మనిషి భస్మాసుర అంశ. లేకపోతే, వరాలతల్లికే ఉరిబిగిస్తాడా? దిగివచ్చిన దేవతనే అవమానిస్తాడా? వెర్రులెత్తిన స్వార్థంతో గంగనే మింగేస్తాడా? వ్యర్థాల్నీ రసాయనాల్నీ కాష్ఠాల్నీ కాలుష్యాల్నీ భరించలేక జాహ్నవి బేజారెత్తిపోయింది. పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఎప్పటి నుంచో గంగమ్మనే నమ్ముకున్న వేలవేల జలచరజాతులు కనుమరుగు అవుతున్నాయి. పెళ్లీపేరంటాల్లో పట్టుపావడాలతో గెంతులేసే అమ్మాయిల్లా... గంగానదిలో సందడిచేసే డాల్ఫిన్లు...మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. కబ్జాలూ ఆక్రమణలూ ప్రవాహ గతినే మార్చేస్తున్నాయి. హద్దులు దాటిన భక్తి భక్తే కాదు. అది మూఢత్వం. వేలకొద్దీ దహనాలతో అమృతగంగ మృతకళేబరాలకు నిలయమైపోయింది. గంగలో కలుపుతున్న పూలూ అస్తికలూ బూడిదలూ... జీవరాశినిబలిగొంటున్నాయి.

మరింత కాలుష్యాన్ని పోగుచేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు...ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు. ఒకప్పుడు, సకలరోగాల నుంచి విముక్తి కలిగించిన ఔషధ గంగ... ఇప్పుడు, సర్వరోగాలకూ కారణం అవుతోంది. ఈ దుస్థితిని చూడలేక, ఆ దుర్వాసన భరించలేక నదీమతల్లిని దేవతగా ఆరాధించే భక్తుల కళ్లలో గంగ పొంగుకొస్తోంది. ఇంకో పుష్కరం వస్తోందంటే, ఇంకెంత చెత్త పోగవుతుందో అని భయపడాల్సిన పరిస్థితి.

భాగీరథీ సుఖదాయినీ మాతా
తవ జల మహిమా నిగమే ఖ్యాతా
నాహం జానే తవ మహిమా
పాహి కృపామయీ మమాజ్ఞానమ్‌
'గంగమ్మా! వరాలిచ్చే చల్లని తల్లీ!

నీ పవిత్రతను వేదాలు కీర్తించాయి. ప్రపంచమంతా కొనియాడింది. కానీ అవేవీ తెలియని అజ్ఞానులం మేం. నిన్ను కాలుష్యకాసారంగా మార్చినందుకు క్షమించు' అని లెంపలేసుకోడానికి పుష్కరమే సరైన సమయం. పశ్చాత్తాపం మనసులోని మాలిన్యాల్ని కడిగేస్తుంది. గంగాజలాల శుద్ధికి కూడా అదే సత్సంకల్పం.

గంగ...శుభ్రంగా!
వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ప్రకారం...ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన పది నదుల్లో గంగ ఒకటి. దాదాపు 30 నగరాల మురుగు, 25 పట్ణణాల కాలుష్యం, వేలకొద్దీ గ్రామాల వ్యర్థాలు... అంతా కలిసి దాదాపు మూడువేల మిలియన్‌ లీటర్ల చెత్తాచెదారం గంగలో కలుస్తోంది. గంగానదిలోంచి కాలుష్యాన్ని తరిమేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేశాయి. న్యాయస్థానాలు కూడా బాగానే వెుట్టికాయలు వేశాయి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'గంగా యాక్షన్‌ ప్లాన్‌' కింద నదీజలాల శుద్ధికి దాదాపు వేయి కోట్లు ఖర్చుచేశారు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖ 43 ప్రాజెక్టుల కింద రూ.2,400 కోట్లు మంజూరు చేసింది. ఈ వెుత్తంతో గంగానది అధికంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాల్లో ... నీటిశుద్ధి ప్లాంట్లు, మురుగునీటి కాలువలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 2020 నాటికంతా గంగానదిని స్వచ్ఛంగా తయారుచేయాలన్నది జాతీయ గంగా పరీవాహక సంస్థ ఆశయం. దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా భారీవెుత్తంలో సాయం అందబోతోంది. ఎలాగైనా సరే, గంగను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఏడు ఐఐటీలకు చెందిన నిపుణులతో ఓ బృందం ఏర్పాటైంది. ఏ కార్యక్రమ విజయానికైనా నిధులొక్కటే ప్రధానం కాదు... ప్రజా భాగస్వామ్యం ఉండాలి. పాలకుల చిత్తశుద్ధి ముఖ్యం. గంగ విషయంలో ఈ రెండే కరవవుతున్నాయి.

గంగా ప్రవాహం...
గంగోత్రి హిమనీనదంలో పుట్టిన భగీరథి దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి... 'గంగ' అవుతుంది. హరిద్వార్‌ దగ్గరికొచ్చి... జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాద్‌ దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నాపెద్దా నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ వెుదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చిలిక... హుగ్లీనది వెుదలవుతుంది. ప్రధాన గంగను... మాల్దా తర్వాత పద్మానది అంటారు. బంగ్లాదేశ్‌లో ప్రవేశించాక, బ్రహ్మపుత్ర చిలిక అయిన జమునానది ఇందులో కలుస్తుంది. ఆతర్వాత మేఘన జతవుతుంది. ఆతర్వాత ఎన్నో చిలికలుగా ప్రవహించి... బంగాళాఖాతంలో కలుస్తుంది.

  • Source : Eenadu Sunday magazine

  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: