-
ప్రేమాభిమానాలతో మానవ సంబంధాలు మెరుగుపడతాయి. 'ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును... ద్వేషించిన, వడ్డీతో సహా ద్వేషం తిరిగి వచ్చును' అన్న సూక్తి మనం మరచిపోకూడదు. ప్రేమ ఒక్కటే నిత్యం, సత్యమని మతగురువులెందరో బోధించారు. ఇతిహాసాలు, పురాణాలు ఈ అంశాన్నే పలుమార్లు స్పృశించాయి.
శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో బంతాట ఆడిన తరవాత తల్లి కౌసల్య ఒడిలో కూర్చొని ఆనందంతో కేరింతలు కొడుతుంటాడు. 'రామా... ఎందుకింత సంతోషంగా ఉన్నా'వని ఆమె ప్రశ్నిస్తుంది. 'అమ్మా! ఈ రోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా. అందుకే ఇంత ఆనందం' అని బదులిస్తాడు. ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికొస్తాడు. తన దుఃఖానికి కారణమేమిటని కౌసల్య అడుగుతుంది. 'చూడమ్మా... అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు. అందుకే బాధపడుతున్నా'నని చెబుతాడు. సహోదరులెలా ఉండాలో ఈ సంఘటనే సందేశం.
విశ్వామిత్రుడు యాగరక్షణకు శ్రీరాముణ్ని మాత్రమే పంపమని కోరితే లక్ష్మణుడు స్వచ్ఛందంగా అగ్రజుని సేవకోసం అడవులకు వెళ్తాడు. కైకేయి ఆదేశం మేరకు శ్రీరాముడు అరణ్యాలకు బయలుదేరితే సొంత సుఖాలను వదులుకొని లక్ష్మణుడు పదునాలుగేళ్లు అన్న వెన్నంటే ఉంటాడు. అన్నదమ్ముల అన్యోన్యతకు అద్దంపట్టే ఈ సన్నివేశం అందుకే ఆదర్శవంతమైంది.
మహాభారతంలో యక్షమాయ వల్ల ఒక చెరువులో నీళ్లు తాగిన వెంటనే భీమార్జున నకుల సహదేవులు మరణిస్తారు. ధర్మరాజు యక్షప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతాడు. అయితే సోదరుల్లో ఒక్కరినే బతికిస్తానని యక్షుడు చెప్పగా ధర్మరాజు నకులుణ్ని కోరుకుంటాడు. ఇలా ఎందుకు కోరావని అతడు అడగ్గా- 'కౌంతేయుల్లో తాను బతికే ఉన్నానని సవతి తల్లి మాద్రి కొడుకుని కూడా బతికించడం తన బాధ్యత కదా అని యుధిష్ఠిరుడు జవాబిస్తాడు. 'మళ్లీ కుంతీపుత్రుణ్నే కోరడం స్వార్థం కాదా? లోకం నన్ను క్షమిస్తుందా' అని తిరిగి ప్రశ్నిస్తాడు. అన్నదమ్ముల అనుబంధాన్ని మెచ్చి యక్షుడు అందరినీ బతికిస్తాడు.
గతంలో బహుభార్యత్వం కొన్ని కుటుంబాల్లో ఉండేది. వారి పిల్లలకు తమ సొంత తల్లి ఎవరో తెలియకుండా సవతులు అందరి పిల్లలనూ సమానంగా పెంచేవారని నేటి వృద్ధులు చెబుతుంటారు. కేవలం కుటుంబ సభ్యులనే కాకుండా మొత్తం మానవాళిని ప్రేమించడం నేర్చుకుంటే రాగద్వేషాలకు, విభేదాలకు తావే ఉండదు. మృదుభాషణం, చిరునగవుతో అపరిచితుల్నీ పలకరించడం, వీలైనంత వరకూ ఇతరులకు సాయపడటం, సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడం వంటి లక్షణాలు పిల్లలకు అలవాటయ్యేలా పెద్దలు ప్రయత్నిస్తే- వసుధైక కుటుంబం ఇక్కడే అవతరిస్తుంది.
-- కిల్లాన మోహన్‌బాబు
- ====================================
No comments:
Post a Comment