Friday, January 14, 2011

మాఘమాసం మహిమ , Importance of Maagham month in hidhus


స్నానం

సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.

వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. ఇంద్రునికి 'మఘవుడు' అనే పేరు కూడా ఉంది. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్తృతంగా కాచేవేళ. శూన్యమాసమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణకారకమాసం.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానవిధులను మాఘపురాణం పేర్కొంటోంది. మాఘస్నాన మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మృకండముని, మనస్విని మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

-- డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు


మాఘమాసం
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు. శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

మాఘస్నాన ఫలం
మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ వరుసలోనే మాఘ పురాణంలో తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది. రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.

అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.

ఇది మాఘ పురాణంలో తొలి అధ్యాయంలోని కథ. ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఓ మాట చెప్పాడు. మాఘ స్నానం చెయ్యటం, తెలియని వారికి దాని విశేషం తెలియచెప్పి చేయించటం, ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందటం కూడా శ్రేయస్కరాలు అంటాడు సూతుడు. దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే. ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల, నియమ ప్రకారం ఉదయం కాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


మాఘమాస మహత్యమును తెలుసుకొనుట ఎవరితరంకాదు . ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకమైనది. ఈ మాఘమాస నదీ స్నానం చేయుట వల్లలభించు పుణ్యఫలము మరేయితర యజ్ఞయాగాదులు, క్రతువులు చేసినా లభించదు. ఈ మాఘమాస నదీ స్నానం చేయుట వలన మనుష్యులు అత్యంత పుణ్యాత్ములగుదురు. ఈ మాఘమాసం ఒక ప్రత్యేకమును సంతరించుకొన్నది. ఒక నదీ స్నానము వలనే మనుజులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందెదరు. ఈ మాఘమాస స్నానము శాశ్వతపుణ్యలోక ప్రాప్తినిచ్చును. అంతియే గాని ఇతర యజ్ఞ యాగాదుల వలే తాత్కాలిక ఫలితమును ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్నా మాఘమాస నదీ స్నానమొక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్య కార్యమువలన ఇది సాధ్యంకాదు.
ఫలశృతి

సూతమహర్షి శౌనకాదిమునులతో "మహర్షులారా ! వశిష్టులవారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తికావచ్చినది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీస్నానములను నియమ నిష్టలతో చేసి ఆశ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానంచేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి, శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసమును ముప్పదిరోజులు క్రమం తప్పకుండా మిక్కిలి శ్రద్దతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తసుద్దితోనూ, శ్రీమహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు, పుత్రపౌత్రాభివృద్దియు, వైకుంఠప్రాప్తి నొందగలరు

మాఘస్నాన పుణ్యఫలం వివరించు కథ :

పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.

ఇక్కడ ఇంద్రుడికి గాడిద ముఖం రావటం, పోవటం, మాఘస్నాన ఫలితం ఇలాంటివన్నీ ఆస్తిక వాదం కోసమేననుకున్నా, పరస్త్రీ వ్యామోహం పనికి రాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చి పెడుతుందని తెలియ చెప్పే హెచ్చరిక గమనార్హంగా ఉంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం

మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.

పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

ఇలా మాఘ పురాణంలోని మూడో అధ్యాయంలో ఉన్న ఈ కథ గౌరీ కథ మహాత్మ్యంతోపాటు మాఘస్నాన పుణ్య ఫలితాలను వివరిస్తోంది. ఈ వివరణ వెనుక ఒక జన్మలో చేసిన తప్పుల పాప ఫలితాన్ని మరుసటి జన్మకు కూడా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని కనుక పాపాలు చేయవద్దనే సున్నితమైన హెచ్చరిక ఒదిగి ఉంది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే మరోకథ :

పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది. తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది. సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.

ఈ కథా సందర్భంలో మాఘస్నాన పుణ్య ఫలితంతో పాటు సుమంతుడు సజ్జనురాలైన కుముదతో తగవులాడిన సంఘటన కనిపిస్తుంది. ఆ సంఘటన ఒక్కటే అతడికి పుణ్యాన్ని ప్రసాదించింది. సజ్జన సాంగత్యం వల్ల ఇలా మేలు జరుగుతుందని ఈ కథ వివరిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు





  • ----------------------------------------------------
Visit My Website - > Dr.Seshagirirao

No comments: