Thursday, January 6, 2011

రెడ్డి గుంట వెంగమాంబ , Reddygunta Vengamamba

జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి సమీంపంలోని, రెడ్డి గుంటవద్ద వున్న సమాధి, శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు, కవయిత్రి తరిగొండ వెంగమాంబది కాదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు కొట్టి పారేశారు. బుధవారం ఉదయం చిత్తూరు పట్టణం సమీపంలోని, రెడ్డి గుంట వద్ద వెంగమాంబ సమాధి, మఠంగా ప్రచారమవుతున్న స్థలాన్ని ఆయన మైసూరులోని ఆర్మియాలజీ నిపుణులు, తరిగొండ వెంగమాంబ రచనల పరిష్కార కర్త కె.జె.కృష్ణ మూర్తి, రచయిత, పరిశోధకులు సొరకాయల కృష్ణారెడ్డి తదితరులతో కలిసి సందర్శించారు. అనంతరం డి.కె.ఆదికేశవులు విలేఖరులతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా రెడ్డిగుంట వద్ద తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అయినటు వంటి, అసలు సమాధి వున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని వెల్లడించారు.

రెడ్డిగుంటలోని సమాధి క్రీస్తుశకం 1922 ఫిబ్రవరి 15వ తేదిన శివైక్యం చెందిన రెడ్డిగుంట మఠాధిపతియైన వెంగమాంబ సమాధి అని పేర్కొన్నారు. రెడ్డిగుంట మఠాధిపతిగా వున్న వెంగమాంబ తల్లిదండ్రులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబకు శిష్యులో, భక్తులో అయివుంటారని, అందుకే 1799లో జన్మించిన తమ కూతురుకు వారు వెంగమాంబ అని పేరుపెట్టివుంటారని పేర్కొన్నారు. వెంగమాంబ శిష్య సంప్రదాయమునకు చెందినదై వున్నందువల్ల కాబోలు ఆ వెంగమాంబ అన్నదానాలు, సాధు పుంగవులను ఆదరించడం వంటి కార్యక్రమాలు ఆచరించారని పేర్కొన్నారు. శిలాఫలకం మీదవున్న శివలింగం, నంది చిహ్నాలు, చివరి ‘శివ జీవైఖ్య పదవిని’చెందెను అనే వాక్యాన్ని బట్టి రెడ్డిగుంట మండలాధిపతియైన వెంగమాంబ వీరశైవ సాంప్రదాయమునకు చెందిన భక్తురాలిగా నిరూపణ అవుతుందని పేర్కొన్నారు. తరిగొండ వేంగమాంబ నందవరీక బ్రాహ్మణ వంశమున జన్మించినదని అయితే రెడ్డిగుంట వెంగమాంబ బ్రాహ్మణవంశమున జన్మించినచో సమాధిపై శివలింగము, నంది చిహ్నములు వుండవని పేర్కొన్నారు. ఈ అంశాలను బట్టి రెడ్డిగంట శైవ మఠాధిపతియగు వెంగమాంబ పరమ శివ సంప్రదాయమునకు చెందిన భక్తురాలిగా తెలుస్తున్నదని, శిలాఫలకం నందలి లిపి, అంకెలు రెడ్డిగుంట వెంగమాంబ తరిగొండ వేంగమాంబ ఒకరు కాదని నిరూపితమవుతున్నదని అన్నారు. ఈ విషయాలను వివరించిన తరువాత స్థానికులు ఈ సత్యాలను పునరాలోచించి తమ అంగీకారాన్ని సూచించారని ప్రకటనలో పేర్కొన్నారు.

  • =====================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: