Wednesday, September 1, 2010

వరాహ జయంతి , Varaha Jayanthi



మన హిందూ పురాణాలు వ్రాసినది వ్యాదవ్యాసుడే అయినా అనువాదము చేసినవారు పరిస్థితులకు అనుకూలముగా ప్రజలకు అర్ధమయ్యేటట్లు మార్పులు ... చేర్పులు చేసి వ్రాసారు . ఒక్కోక్కరు ఒక్కోవిధంగా వ్రాయడానికి కారణము ఇదే . ఎవరు ఏవిధం గా వ్రాసినా అర్ధము ... పరమార్ధము చివరికి చేరే గమ్యము ఒక్కటే .
వరహావతారము ... సముద్రము నీటిలో పంది (వరహం) రూపములో విష్ణు దేవుడు గాలిని ఎలా పీల్చుకోగలిగేడో ఆ వ్యాసుడికే ఎరుక . పందులు జంతు జాతికి చెందినవి ... అవి నీటిలో ఊపిరి పీల్చడానికి ప్రత్యేక అవయవాలు సైన్‌సు (science) ప్రకారము లేవు ... ఊపిరి పీల్చుకోవడం వీలుకాదు . నేటి నవీన శాస్త్ర పరిజ్ఞానము ప్రకారము భూమి సూర్య మండళములో ఒక గోళము . మనికు తెలిసిన జీవమున్న ఒకేఒక గోళము . కాని వేదవ్యాసుని నాటి విజ్ఞానము పరిమితులను బట్టి భూమి ఒక స్త్రీ మూర్తి . . . ఒక దేవత , విష్ణు దేవుని భార్యలలో ఒక భార్య . అప్పటికి మానవునకు ఉన్న ఆలోచనా పరిది (extent), పరిస్థితి , అవకాశము , అవదులు(restictions) అంతవరకే అభివృద్ధి చెందినాయి అని అనుకోవాలి . జీవ పరిణామ క్రమములో ఇలా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి ... జరుగుతునే ఉన్నాయి . వేదవ్యాసుని " ఆధ్యాత్మిక జీవ పరిణామ సిద్ధాంతము (Mythalogical theory of evolution) అలోచనకే మనమంతా ఆయనకి ఋణపడి ఉండాలి .

పరిచయము :
శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి (Varaha incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్ధనలలో ఒకటి:

ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా కలవు. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.

రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

కథ : కొన్ని పురాణాలు ప్రకారము ;
అనంత భగవానుడు ప్రళయకాలంమందు జలమున మునిగిపోయిన పృధ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించెను. ఒక దినము స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మ దేవునితో ఇట్లనెను. "తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు. జీవము నొసగువారు. మీకు నా నమస్కారములు. నేను మిమ్ములను ఏవిధముగ సేవింపవలెనో ఆజ్ఞ ఇండు.

మనువు మాటలు వినిన బ్రహ్మ, "పుత్రా! నీకు శుభమగుగాక. నిన్నుగాంచి నేను ప్రసన్నుడనైతిని, నీవు నా ఆజ్ఞను కోరితివి. ఆత్మ సమర్పణము గావించితివి.పుత్రులు తమ తండ్రిని ఈ విధముగనే పూజింపవలెను. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించవలెను. నీవు ధర్మ పూర్వకముగ పృధ్విని పాలించుము. యజ్ఞములతో శ్రీ హరిని ఆరాధింపుము. ప్రజలను పాలించుటయే నన్ను సేవించి నట్లగును" అని చెప్పగా మనువు ఇట్లనెను.

"పూజ్యపాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాలించెదను. ఐననూ సర్వజీవులకు నివాసస్ధానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను" అని అడుగగా!

బ్రహ్మ, పృధ్విని గురించి చింతించుచూ, దానిని ఉద్ధరించుటకు గాను ఆలోచింప సాగెను. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు అకారమంత ఒక వరాహ శిశువు వెలువడెని. చూచుచుండగనే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరహ భగవానుడు ప్రసన్నుడయ్యెను.
వరాహ భగవానుడు జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించెను. జలమందు మునిగియున్న పృధ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానునితో తలపడెను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను.

జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మది దేవతలుగాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డ్గగించి దానిపై పృధ్విని స్ధాపించెను.

మూలం : నిత్యజీవితములో పండగలు-పర్వదినాలు పేజీ నెంబరు 134.

పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తెరుమలకొండ. తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది .

అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే . వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు .
ఆదివరాహస్వామి గా ,
ప్రళయవరాహ స్వామి గా ,
యజ్ఞ వరాహస్వామి గా ,
ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము .

వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపం తో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు . శ్రీనివాసుడే .. శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి . వరాహస్వామిరూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు . మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ,, ముక్కోటి దేవతలు మురిసిపోయారట .

నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది . ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా .. అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు . అప్పుడు శ్రీనివాసుడు " నా దగ్గర ధనం లేదు , అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము , ప్రధమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని " చెబుతాడు . అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు . శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి . శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి , . శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తు్లు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు . రెండు అవతాలతో , రెందు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతా రహస్యాలలో ఈ రెండు అవతాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది .

  • ===========================
Visit My Website - >http://dr.seshagirirao.tripod.com

No comments: