Friday, September 3, 2010

మంగళ గౌరీవ్రతము , Mangala gowri vratamu



శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి. అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను! ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు.

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .

మొదట శౌనకాది మహర్షులకు మంగళగౌరీ మహాత్యాన్ని సూతులవారు వివరించారు .
నారదమహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ప్పదేశించారు ,
శ్రీకృష్ణుడు వ్రత విధాన్ని , వ్రత మహాత్యాన్ని ద్రౌపది కి వివరించాడు .

ఇక్కడ శ్రీ్కృ ష్ణులు వారు ద్రౌపది కి భోదించిం కదావిధానము ఈ విధం గా ఉన్నది .->
ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు . అందువల్లనే విజయాన్ని అందుకోగలిగేరు .
మంగళ గౌరీని పూజించడము వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు .
మనువంశానికి చెందిన " మండు " డనే మహారాజు గౌరీదేవి వ్రతప్రభావము తో చాలాకాలము భూలోకం లో సర్వసంపదలతో రాజ్యము ఏలసాగేడు .
"ఓ ! ద్రపదీ ! గౌరీదేవిని పూజించి , వైధవ్యాన్ని తొలగించుకున్న ఓ అద్రుస్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను " అంటూ శ్రీ కృష్ణులు వారు ఇలా చెప్పసాగేరు .
వ్రత కథ :

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు .. ఎన్ని నోకులు నోచినా , ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము .. చివరికి పరమేస్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది ... పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు . జయపాలుి భార్య పెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది . జరిగినదంతా భర్తకు వివరించింది . రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు .

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భ్క్ష వేయబోవడం జరిగింది . ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక ... సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి ... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశైంచండి " అని వేడుకోగా .. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి . నీల వస్త్రాలను ధరించి , నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి , ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను . అక్కడ అరణ్యం లో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను . ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు . ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు . స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు . జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు . నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు .. అప్పుడు అమ్మవారు " వైధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు , సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు " . అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు . అప్పుడాదేవి ఆ రాజుని ' తన పార్శమున ఉన్న గణపతినాభియందడుగు వైచి , చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను . జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .
ఈ విందంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది . ఆ కుర్రవాడికి వయసొచ్చింది . వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామ తో కాశీకి పంపించారు . త్రోవలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వరిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను " ముండ , రండ " అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు , రండలు - ఉండరు అంది కోపం తో . జయపాలుడు కుమారుడు -శివుడు అంతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు . తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు . " మా ఇంట్లో ముండలు , రండలు ఎవరు ఉండరు . మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది ." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది . సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు . మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ..ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురు కి తగిన భర్త అని దేవుని వాక్యము గా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడు ల వివాహము జరిగిఫోతుంది .

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలఓ కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రి తో ఆతని ఆయువు చెల్లింది . ఈ దోషము నకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను . " కొద్ది సేపట్లో ఒక కృష్న సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది . వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు ... అప్పుడ పాము ఆ ఘటం లోకి పవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

పూజావిధానం : ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం

పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు .

రచయిత : పిడపర్తి భాస్కర సుబ్రమణ్య శాస్త్రి . స్వాతి వారపత్రిక 20-8-2010 పేజి 9-10 .
  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: