Thursday, August 19, 2010

Muslim women-Burakha , ముస్లిం మహిళల్లో బురఖా ధారణ


బురఖా ధారణ

ముస్లిం మహిళగా నేను బురఖాను లేదా హిజబ్‌ (ముఖం వరకు కప్పుకునే ప్రత్యేకమైన వస్త్రం)ను వినియోగించను. అది నా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. వస్త్రధారణకు సంబంధించి మతంలో ఎలాంటి నిర్బంధాలు లేవు. స్త్రీ పురుషుల వస్త్రధారణ గౌరవప్రదమైన రీతిలో ఉండాలని మాత్రమే మతం చెపుతున్నది. అంతేకాక ఈ విషయంలో ఎవరూ తలదూర్చరాదన్నదే నా అభిప్రాయం. ఎవరైనా ఒక ముస్లిం మహిళ బురఖాను ధరించాలనుకున్నా, వద్దనుకున్నా అది ఆమె ఇష్టానికే వదిలేయాలి.

బురఖాను పరిత్యజించాలని 1947లోనే నా తల్లితోపాటు మా కుటుంబంలోని ఇతర స్త్రీలు నిశ్చయించుకున్నారు. పూర్వం మా కుటుంబం పానిపట్టులో నివసించేది. అప్పట్లో పంజాబులోని సుసంపన్నమైన జిల్లాల్లో పానిపట్టు ఒకటి. ఇక్కడ ముస్లింలు అత్యధికంగా నివసించే వారు. విజ్ఞాన వాహినులు ప్రవహించే పానిపట్టులో సూఫీ సంప్రదాయులు ఎక్కువగా ఉండేవారు. స్త్రీలకు ఇక్కడ ఎంతో గౌరవం లభించేది. మా ఇళ్ళను స్త్రీల పేరుతోనే పిలిచేవారు. ఉదాహరణకు, బి మైమునా కి హవేలి అనేవారు (మరాకేష్‌లో కూడా ఇలాంటి వాడుకే ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను రియాద్‌ దర్‌ మైమున అని చెప్తుండేవారు). బురఖాను పరిత్యజించాలన్న పానిపట్టు మహిళల నిర్ణయాన్ని మా కుటుంబానికి చెందిన పురుషులు గౌరవించి, ఆమోదించారు. వారి విధికి వారే కర్తలు. దేశ విభజన సమయంలో ఆనాటి పరిస్థితుల రీత్యా ఈ మహిళల్లో ఎక్కువమంది పాకిస్థాన్‌కు చేరుకున్నారు. అక్కడకు వెళ్ళిన తరువాత కూడా వారు బురఖాను ధరించలేదు. బురఖాను ధరించవలసిందిగా అటు ప్రభుత్వాధికారులుగానీ ఇటు కుటుంబీకులుగానీ చెప్పలేదు.

ఇదంతా జరిగిన 63 ఏళ్ళ తరువాత, అంటే, ఈ ఏడాది జూలై 13న బహిరంగ స్థలాల్లో ముఖాన్ని మూసివేసే ముసుగులను ధరించటాన్ని నిషేధించాలన్న నిర్ణయాన్ని ఫ్రాన్స్‌ దిగువ సభ ఆమోదించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 336 మంది, వ్యతిరేకంగా ఒక్కరు ఓటు చేశారు. స్త్రీలు తమ ముఖాన్ని కప్పుకోవలసి రావటం లౌకికత్వం, సమానత్వం అన్న ఫ్రెంచి రిపబ్లిక్‌ ఆదర్శాలకు వ్యతిరేకమని, ఈ తరహా ఆచారం, ''స్త్రీల అణచివేతకూ, కరుడుకట్టిన ఛాందసత్వానికీ'' చిహ్నమని ఫ్రెంచ్‌ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.

బురఖా వ్యవహారంలో పానిపట్టుకూ, పారిస్‌కూ ఏమిటి సంబంధం అన్న అనుమానం సహజంగానే వస్తుంది. మానవ హక్కుల రక్షణకు ఫ్రాన్స్‌ చాలా ప్రాధాన్యతను ఇస్తున్నది. నాతోపాటు, నాతరానికి చెందిన పలువురు ఫ్రెంచి విప్లవ గాథలు వింటూ పెరిగాము. బాస్టిలీ చెరసాలను బద్దలు కొట్టటం, గిలెటిన్‌ వగైరాల గురించీ, 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం' అన్న నినాదాల గురించీ తెలుసుకునే వారము. విప్లవ నాయకుల గురించి కూడా వింటూ ఉండేవారము. పానిపట్టు నుంచి అనేకమంది సూఫీ పండితులు ఆప్ఘనిస్థాన్‌కూ అక్కడ నుండి ఇరాన్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళారు. తాము అడుగు పెట్టిన ప్రతిచోట తమ మత బోధలు విన్పించేవారు. ఇస్లాంకు చెందిన అనేక శాఖలు ఈ ప్రాంతంలో వర్ధిల్లాయి. మతం గురించి ఎలాంటి అరమరికలు లేకుండా ఇక్కడ చర్చలు సాగుతుండేవి. వారు తమ అవగాహన మేరకు నడుచుకునేవారు. ఈనాటికీ పానిపట్టు నగరం అభివృద్ధికి ఆవాసంగానే ఉన్నది. ఈనాడదంతా పూర్వగాథగా మిగిలిపోయింది.

ఇకపోతే ఫ్రాన్స్‌ విషయానికి వద్దాము. ముసుగు ధరించి బహిరంగ స్ధలంలోకి వచ్చిన వారికి 190 డాలర్ల జరిమాన పడుతుంది. బురఖా ధరించవలసిందిగా స్త్రీలపై కుటుంబంలోని పురుషులెవరైనా ఒత్తిడి తెచ్చినట్లయితే అలాంటి వారికి 37,754 డాలర్ల జరిమానాతోపాటు, ఏడాది జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు ప్రవేశ పెట్టిన బిల్లును సెనెట్‌ కూడా ఆమోదించినట్లయితే అప్పుడది చట్టంగా మారుతుంది. 1960లలో ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ మంచి జోరుమీద ఉన్నది. అప్పటిలో ఫ్రాన్స్‌ పూర్వ వలసల నుంచి రావాలనుకున్న వారికి దేశంలోకి ప్రవేశం సులభంగా ఉండేది. ఇలా వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది రాజధాని నగర పరిసరాలలో నివాసాలేర్పరచుకుని పరిశ్రమలను అభివృద్ధి చేశారు. వారికి అతి తక్కువ వేతనాలు ముట్టేవి. సాపేక్షకంగా చూస్తే వలస వచ్చిన వారు స్ధానికులతో సామాజికంగా, ఆర్థికంగా మిళితమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వలసదారుల్లో అత్యధికులు ముస్లింలు. బురఖాపై నిషేధం వస్తే దాని ప్రభావం ప్రధానంగా పేద ముస్లిం స్త్రీలపై పడుతుంది. ఫ్రాన్స్‌లోని ముస్లిం మహిళలకు రెండు రకాలైన ఇబ్బందులు ఎదురు కానున్నాయి. మొదటిది ఇంటివద్ద ఎదురవుతుంది. పలు కారణాల రీత్యా ఇంటిలో 'సంప్రదాయ' దుస్తులను ధరించాల్సి వస్తుంది. బహిరంగ ప్రదేశాలలో ఈ దుస్తులనే తీసివేయవలసిందిగా ప్రభుత్వం శాసనం ద్వారా ఒత్తిడి తెస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, ముస్లిం మహిళలకు సాధికారికతనూ, గౌరవాన్ని కల్పించాలన్న ఫ్రెంచి ప్రభుత్వ ప్రకటిత లక్ష్యం నెరవేరటం అసాధ్యంగా మారుతుంది.

నిర్బంధం కారణంగానే ముస్లిం మహిళలు బురఖాను ధరించవలసి వస్తున్నదని చాలామంది భావిస్తుంటారు. బురఖా ధారణ కేవలం మతాచారమేకాక మరింత పవిత్రతను సమకూర్చుతుందన్న భావన చాలామంది స్త్రీలలో ఉన్నది. బురఖా ధారణే ముస్లిం మహిళ అభీష్టమమైతే దానిని అంగీకరించడమే సబబుగా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా అమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఒక ముస్లిం డాక్టరు అనుభవాన్ని తెలుసు కోవాలి. ఐరోపాలో బురఖా ధరించే అనేకమంది మహిళల్లో ఆమె ఒకరు. బురఖా ధరించి బయటకు వెళ్ళినపుడు ప్రతిచోటా ఏదో ఒకరకమైన ప్రత్యేకత ఎదురవుతుంది. ఏదైనా షాపుకు వెళ్ళితే అక్కడి వారు ఆమెకు చిన్నపిల్లకు చెప్పినట్లుగా వస్తువుల వివరాలు చెప్పేవారు. కొన్ని సందర్భాలలో చెడిపోయిన వస్తువులను వాపసు ఇవ్వటానికి తీసుకు వెళ్ళినపుడు ఆధునిక వస్తువులు వినియోగించటం చేతకాని వ్యక్తిగా ఆమెను చూసేవారు. నిషేధం కారణంగా చాలామంది ముస్లిం మహిళలు ఇళ్ళవద్దనే ఉండిపోయే ప్రమాదమున్నట్లుసెనెటర్‌ బారిజా ఖైరి వ్యాఖ్యానించారు.

ముస్లిం మహిళగా నేను బురఖాను లేదా హిజబ్‌ (ముఖం వరకు కప్పుకునే ప్రత్యేకమైన వస్త్రం)ను వినియోగించను. అది నా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. వస్త్రధారణకు సంబంధించి మతంలో ఎలాంటి నిర్బంధాలు లేవు. స్త్రీ పురుషుల వస్త్రధారణ గౌరవప్రదమైన రీతిలో ఉండాలని మాత్రమే మతం చెపుతున్నది. అంతేకాక ఈ విషయంలో ఎవరూ తలదూర్చరాదన్నదే నా అభిప్రాయం. ఎవరైనా ఒక ముస్లిం మహిళ బురఖాను ధరించాలనుకున్నా, వద్దనుకున్నా అది ఆమె ఇష్టానికే వదిలేయాలి. పేదల గురించి జాగ్రత్తగా ఉండమని ఇస్లామ్‌కు చెందిన నాల్గవ ఖలీఫా హజరత్‌ ఆలీ చెప్పారు. కనుక పేద స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బురఖా ధరించినా, ధరించక పోయినా వారిపట్ల ప్రభుత్వం సమదృష్టితో వ్యవహరించాలి. మతాన్ని గురించి స్వేచ్ఛగా చర్చించే పానిపట్‌ సంప్రదాయం మన ముందున్నది.

సైదా ఎస్‌. హమీద్‌ (వ్యాసకర్త ప్రణాళికా సంఘ సభ్యులు)

  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: