చంచలమైన మనస్సును నిగ్రహించి ఒకే వస్తువు మీద కేంద్రీకరించడం ఆధ్యాత్మికత లక్ష్యం. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు తమలోని ఆత్మనే భగవంతునిగా భావిస్తారు. ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టు విగ్రహారాధన. శ్రీ రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యులతో- ఆవు పాలు రక్తం రూపంలో దాని శరీరం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ పాలను దాని చెవులు పిండి లేదా కొమ్ములనుంచి పొందలేమని, పాలు దాని పొదుగు నుంచి మాత్రమే లభిస్తాయని ప్రస్తావించారు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నా, దేవాలయాల్లో ప్రత్యేకంగా విరాజిల్లుతున్నాడని వివరించారు.
ఒకసారి అళ్వార్ మహారాజు వివేకానందులవారితో విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ మాట్లాడితే, ఆయన మహారాజుకు విగ్రహ విశిష్టతను వివరించిన ఉదంతం ప్రసిద్ధం. స్వామీజీ రాజు చిత్ర పటం తెప్పించి మంత్రిని చిత్రంపై ఉమ్మి వేయమని కోరగా మంత్రి నిరాకరిస్తాడు. రాజు విస్మితుడవుతాడు. అప్పుడు వివేకానందుడు 'ఏ విధంగా రాజు చిత్రపటం ఆయన ఉనికిని మనకు గుర్తు తెస్తోందో అలాగే విగ్రహం కూడా భగవంతుని ఉనికిని మనకు గుర్తు చేస్తుంది' అని వివరిస్తారు.
ఒకసారి రమణ మహర్షిని 'భగవాన్! మీరు అచలంగా ఉన్న ఈ అరుణాచలాన్ని ఎందుకు ఈశ్వరుడిగా భావిస్తున్నారు? మీతో మాట్లాడనిది, ఉలకనిది, పలకనిది గురువెలా అయింది?'' అని ఎవరో ప్రశ్నించారు. దానికి వారు 'ఏది ఉలకదో, పలకదో, నీతో వాద ప్రతివాదాలు చేయదో అదే ఈశ్వరతత్వం'' అని బదులిచ్చారు. ఆ సత్యం గ్రహించడానికి విగ్రహం తొలి సోపానం.
అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మూలం స్వకర్మకృత్ యావత్ నవేద స్వహృది సర్వ భూతేష్యవస్థితమ్ అని భగవద్గీత. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను సాక్షాత్కరించుకునే వరకూ, సర్వ భూతాల్లో లీనమై ఉన్న నన్ను విగ్రహ రూపంలో పూజింతురుగాక అని భావం.
జ్ఞానులు నిరాకార దైవాన్ని సాకారాన్ని కూడా అంగీకరిస్తారు. సామాన్య భక్తులు భగవంతుని ఖండ స్వరూపం మీద ఏకాగ్రత సాధించగలిగితే క్రమంగా అఖండ స్వరూపాన్ని దర్శించగలుగుతారు.
శీతల సముద్రంలోని అనంత జలరాశిలో అమిత శీతలం వల్ల మంచుగడ్డలు కానవస్తాయి. అదేవిధంగా ఆరాధకుని ప్రేమ అనే చల్లదనంవల్ల అపరిమితుడు పరిమితుడవుతాడు. అంటే సాకారుడవుతాడు. సూర్యోదయంలో మంచు కరిగిపోయినట్లు దైవం కరిగి నిరాకారుడవుతాడు.
- ========================================
2 comments:
Dr garu,
This is a beautiful concept explained. Can you write a in details article for our web-magazine
you can see our magazine at:
http://www.samputi.com/launch.php?m=magazine&l=te&si=mag8
Thank You Lalitha gaaru . . . for you good complement on my posting.
I am a doctor , busy with patients ... I can not spare time in extra . Thanks for your invitation!.
Post a Comment