Monday, July 5, 2010

తొలి ఏకాదశి ,ఆషాఢ శుద్ధ ఏకాదశి,శయన ఏకాదశి,ప్రధమ ఏకాదశి





మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొక సార అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే "ఏకాదశి" అనీ, ఆమె మూడు వరాలు...

1. సదా మీకు ప్రియముగా ఉండాలి.


2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.


3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి.

అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి.

మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఐతే, అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం.

ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు...

* దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.


* ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.


* అసత్య మాడరాదు.


* స్త్రీ సాంగత్యం పనికి రాదు.


* కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.


* ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.


* మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.


* అన్నదానం చేయడం చాలా మంచిది.

ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే "విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక" మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.

సైన్సు పరంగా మరికొన్ని సూచనలు తెలుసుకుందాం. అందుకే వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారములు తీసుకొనవచ్చును (అన్నం తప్ప). అంతే గాక అనేక ఆరోగ్య రహస్యములు ఇమిడి ఉన్నాయట. "లంఖణం పరమౌషధం" అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు పరిశుద్ధ మౌతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. ఈ విధంగా సైన్సు పరంగానూ, పౌరాణికంగానూ అనేక ఫలితాలనిస్తుందని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి.

ఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములలో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి .




  • =============================================
Visit My Website - > Dr.Seshagirirao

2 comments:

Lalitha devi said...

thank you very nice information

spk said...

thank you sir. Sir i have a doubt about ekadashi . why ekadashi is special for Sri Rama Chandra Murithi. Could you inform to me?
My email id kumar.pavan284@gmail.com. please send to my email id.