Tuesday, June 29, 2010

విజయానికి ఆత్యాద్మిక సూత్రాలు , Devotional ways to success




ప్రతివారికీ ఒక సమున్నత లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన సాధన సంపత్తిని బలపరచుకోవాలి. అయితే ఆ లక్ష్యం స్వార్థపూరితమైనది కాకుండా, వ్యక్తిని నియంత్రించి విశ్వహితం కలిగించేదిగా ఉండడం సముచితం.
జీవితంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా కావలసినవి ఏమిటి? ఈ విషయమై అనుభవజ్ఞులు, మేధావులు చాలా సూచనలు చేయడం, చిట్కాలు చెప్పడం మామూలే.
మన సనాతన గ్రంథాలలో - కార్యదక్షత, కర్మశీలతపై ఎంతో అధ్యయనంతో ఆచరణయోగ్యమైన సూత్రాలను సాధన రూపంలో అందించారు.
ఒక్కసారి రామాయణాన్ని పరిశీలిస్తే నిలువెత్తు ఆదర్శాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. బుద్ధిమంతుడు, మహావాగ్మి, కార్యదక్షుడు, బలశాలి - అయిన హనుమంతుడు మనముందుంటే చాలు... కార్యసాఫల్యానికి కావలసిన లక్షణాలు అవగతమవుతాయి.

బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం అరోగతా |
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమాన్‌ స్మరణాద్ధవేత్‌|| -

అన్నారు పెద్దలు. దీనిని మంత్రంలా, భజనలా దర్శించడంతో సరిపుచ్చకూడదు. హనుమంతుని ప్రవర్తన ద్వారా మనం గమనించి, అలవరచుకోవలసిన లక్షణాలివి... అని అసలైన అంతరార్థం.
(1) మొదట - సముద్ర లంఘనానికి సిద్ధపడినప్పుడు, ''ఈ సముద్రాన్ని నేను అవలీలగా దాటుతాను. పనిని సఫలం చేసుకువస్తాను'' అని వానరులకు అభయమిచ్చాడు. దీనిద్వారా, ఒక పనికి మొదట కావలసినది 'ఆత్మ విశ్వాసం' అని చాటి చెప్పాడు.
(2) సముద్ర లంఘన సమయంలో మొదట ఎదురైనది మైనాక పర్వతం. తన శిఖరాలపై కాసేపు విశ్రమించి ఆతిథ్యం స్వీకరించమన్నది. ఏనాడో హనుమంతుని తండ్రి వాయుదేవుని సహాయం వల్ల క్షేమంగా సముద్రంలో ఉన్నాడు మైనాకుడు. అందుకు కృతజ్ఞతగా సహకరించే అవకాశం ఇప్పుడు వచ్చిందని, వాయు తనయునికి ఆతిథ్యమిచ్చి తన ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. (ఇది గమనిస్తే - ఒక వ్యక్తికి కృతజ్ఞత ఎంత అవసరమో తెలుస్తుంది. సహకరించినవాని పట్ల మాత్రమే కాక, వారి తరువాతి తరం వారికి కూడా కృతజ్ఞత ప్రకటించాలని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ సంస్కారం ఎంత గొప్పది!)
కానీ 'అనుకున్న పని నెరవేరే వరకు విశ్రమించను'- అని ఆదరంగా చెప్పి, హనుమంతుడు ముందుకు సాగాడు. దీని ద్వారా తెలుసుకోవలసినది - విజయానికి రెండవ సూత్రం 'అవిశ్రాంత ప్రయత్నం'.
(3) అటు తరవాత, సురస అనే శక్తి అడ్డుకొని తన నోటిలోనికి ప్రవేశించమని, అది దేవతల ఆజ్ఞ అని చెప్పగా - యుక్తితో అల్పాకారం దాల్చి ప్రవేశించి వెలికి వచ్చాడు. ఇక్కడ ప్రకటించింది- వినయాన్నీ, యుక్తిని. ఎదురైన అడ్డంకిని 'యుక్తి'తో ఎదుర్కొనే లక్షణం ఇందులో గోచరిస్తుంది.
(4) ఆ పిమ్మట - 'సింహక' అనే రాక్షసి పట్టు నుండి బలిమితో బయటపడి లంకను చేరాడు. అక్కడి లంకిణికి బుద్ధి చెప్పాడు. ఇక్కడ 'శక్తి'ని ప్రదర్శించి అవాంతరాలను అధిగమించాలి- అనే పాఠం ఉంది.
ఇలా ఆత్మవిశ్వాసాన్నీ, శ్రద్ధనీ, యుక్తినీ, శక్తినీ విజయసోపానాలుగా మనకు నేర్పించిన ఆచార్యుడు హనుమ.
ఈ సందర్భంలో హనుమను కీర్తిస్తూ దేవతలు చెప్పిన మాటలు-
ధృతిఃదృష్టిః మతిః దాక్ష్యం స్వకర్మసు నసీదతి.
-ఇది వాల్మీకి చెప్పిన అద్భుతమైన విజయసూత్రం.
1. ధృతి, 2. దృష్టి, 3. మతి, 4. దాక్ష్యం - ఈ నాలుగు ఉన్నవారు తమ పనిలో విజయాన్ని సాధించి తీరతారు.

1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్‌) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
- ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.
లంకలో రాక్షసుల కంటపడకుండా తనని తాను తగ్గించుకొని తిరిగి అన్వేషణ కార్యంలో లీనమయ్యాడు హనుమ. 'అనువుగాని చోట అధికులమనరాదు' అన్న వేమన సూక్తికి ఇది ఉదాహరణ. తనని తాను ఎక్కడ పూర్తిగా బైటపెట్టుకోవాలో, ఎక్కడ ఎంత మరుగుపరచుకోవాలో తెలియాలి. అహంకారంతో అన్నిటా తన పూర్తి బలాన్ని ప్రకటించుకుని గుర్తింపు పొందాలనే తాపత్రయం పనికిరాదని ఇందులో పాఠం.
అన్వేషణలో భాగంగా అంతఃపురంలో స్త్రీలలో సీతకోసం చూస్తూ సాగుతున్న మారుతి - ''పరస్త్రీలను నిద్రాస్థితిలో మైమరచి ఉండగా చూడడం తగునా?''- అని ప్రశ్నించుకున్నాడు. తిరిగి, తనను తాను విశ్లేషించుకొని ''స్త్రీని స్త్రీలలోనే వెతకాలిగనుక, అంతఃపురంలో అన్వేషిస్తున్నాను. పైగా నా దృష్టి అన్వేషణాత్మకమే కానీ, వికారంతో కూడినది కాదు'' అని తన హృదయాన్ని తాను దర్శించుకున్నాడు. కార్యసాధకుడు ఏ వికారాలకు లోనుకాని ధీరత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడి పాఠం. అంతేకాదు- ''ఆత్మ పరిశీలన'' ముఖ్యం అనే అంశం... ఏ విజయంలోనైనా 'సచ్ఛీలత' (క్యారెక్టర్‌) చాలా ముఖ్యం. మన మనస్సుని మనం విశ్లేషించుకొని నిష్పాక్షికంగా మనల్ని మనం గమనించుకుంటే చాలు.
పై గుణాలతోపాటు, ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఉద్యమం (ప్రయత్నం) విజయానికి అవసరం- అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
(అతి) నిద్ర, కునుకుపాటు, బద్ధకం, ఉద్రేకం, వాయిదాలు వేసే మనస్తత్వం (నిద్రా, తంద్రా, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతా) ఉన్నచోట విజయం లభించదు- అని కూడా ఋషుల మాట.
పవిత్రతతో కూడిన కార్యదక్షత మాత్రమే విజయానికి మూలభూమిక.


  • ================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: