Wednesday, October 7, 2009

శ్రావణ పూర్ణిమ , Shravana Poornima




శ్రావణపూర్ణిమ


ఋతువులను అనుసరించి ప్రతి పనినీ ప్రారంభించే మన పూర్వులు, విద్యను ప్రారంభించేందుకూ, ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు. అదే 'శ్రావణపూర్ణిమ.' ఈ రోజున ద్విజులు అధ్యాయోపకర్మలు చేస్తుండేవారు. అదే నేటికి 'ఉపాకర్మ'గా మారింది. అధ్యాయోపకర్మ అంటే వేదాధ్యయనప్రారంభం. ఇది ద్విజులందరికీ వున్నప్పటికీ, నేటి కాలంలో బ్రాహ్మణులే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనిషత్తుల ఆద్యంతవాక్యాలను పఠించి, ఇంట్లో హోమాలు చేస్తారు. మరునాడు ఉపాకర్మకు అనుబంధంగా 1008 మార్లు గాయత్రీమంత్రజపం చేస్తారు. సామవేదులు విఘ్నేశ్వరచతుర్థి నాడు, ఆయనను విద్యాధిదేవతగా భావించటం వల్ల, ఉపాకర్మ జరుపుకొంటారు. ఇవి నేటికి లాంఛనప్రాయంగా మిగిలిపోయాయి.

పూర్వం వేదకర్మాలను ఆచరించేటప్పుడు తప్ప, మిగతా సమయాల్లో యజ్ఞోపవీతాలను నిరంతరమూ ధరించేవారు కాదు. కనుక వేదాధ్యయనప్రారంభానికి దీక్ష పూనేటప్పుడు, కొత్త యజ్ఞోపవీతాలు ధరించటం ఆచారమైంది. ఆ తరువాత ఇదే కంకణసూత్రధారణంగా మారి, మిగతా కులాలవారిలో రక్షాబంధనకర్మగా ఏర్పడివుంటుంది. రక్షాబంధనాన్ని కూడా ఇదే రోజున చేసుకోవటం వల్ల, ఈ శ్రావణపూర్ణిమకు 'రక్షాపూర్ణిమ, రాఖీపూర్ణిమ' అనే పేర్లూ ఏర్పడ్డాయి. అసలీ రక్షాబంధనం అంటే ఏమిటో తెలుసుకోవాలని, ధర్మరాజు, శ్రీకృష్ణపరమాత్మను అడిగాడట. అప్పుడు కృష్ణుడు, పూర్వం దేవాసురయుద్ధం ఘోరంగా జరిగినప్పుడు, ఇంద్రుడు పరాజితుడై, సహచరులతో అమరావతిలో తల దాచుకొన్నాడు. దానితో దానవరాజు త్రిలోకాలనూ తన అధీనంలోకి తెచ్చుకోగా, దేవపూజలు మూలపడ్డాయి. పూజలు లేకపోవటంతో, సురపతి బలమూ సన్నగిల్లింది. అప్పుడు అమరావతిలోని ఇంద్రుని మీదికి, మళ్లీ రాక్షసులు దండెత్తి వచ్చారు. దేవగురువైన బృహస్పతి వద్దకు శచీపతి సలహా కోసం పోగా, ఆయన యుద్ధం చేయమన్నాడు. ఇంతలో ఇంద్రాణి, తన భర్త అయిన సురేంద్రునికి రక్ష కట్టి, విజేతవు కమ్మని పంపించింది. ఆ విధంగానే శక్రుడు, దానవులను గెలిచి, తిరిగి స్వర్గంలోకి ప్రవేశించాడు. ఆ రక్ష ప్రభావం ఏడాది పాటు వుంటుందనీ, ఆ పైన అతన్ని తాము గెలువవచ్చనీ, శుక్రాచార్యుడు దుఃఖితులైన దానవులను ఓదార్చాడు. ఈ కథ విన్న యుధిష్ఠిరుడు, ఆ రక్షను ఎలా కట్టుకోవాలని అడిగాడు.

దానికి కృష్ణుడు, ''ధర్మరాజా! శ్రావణపూర్ణిమ నాడు ఉదయం ఉపాకర్మ, తర్పణాదులు నిర్వహించి, మధ్యాహ్నం, రక్ష వున్న పొట్లాన్ని పట్టువస్త్రంలో కానీ, ఇతరవస్త్రాలతో కానీ సిద్ధం చేయాలి. ఇంటి మధ్య అలంకరించి పీఠం మీద రక్షను పెట్టి, పూజించి, పురోహితునితో కట్టించుకోవాలి. 'ఓ రక్షాబంధనమా, నీవు మహాబలి అయిన దానవేంద్రుణ్ని కట్టేశావు. కనుక నిన్ను నేను నా రక్ష కోసం కట్టుకొంటున్నాను' అని చెప్పుకుంటూ కట్టించుకోవాలి. దీన్ని అన్ని కులాలవారూ కట్టుకోవచ్చు. ఇట్లా రక్షధను కట్టించుకొనేవారు ఏడాది వరకూ సుఖంగా వుంటారు'' అని చెప్పాడు.

ఈ రాఖీ కట్టే ఆచారం మొఘలు రాజుల కాలంలో స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని కొందరంటారు. చిత్తౌడ్ మహారాణి కర్ణావతి, తన కోటను గుజరాత్ నవాబైన బహదూర్ షా ముట్టడించగా, తనను రక్షించమంటూ, ఢిల్లీ చక్రవర్తి హుమాయూన్ పాదుషాకు రక్షాబంధాన్ని పంపి, తమను రక్షించమని ప్రార్థించింది. అతడా ప్రార్థనను మన్నించి, ఆమెను తన సోదరిగా భావించి, బహదూర్ షాను తరిమేశాడు. ఆ రోజు నుంచీ ఈ ఆచారం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రబలిందట. కాకతి రుద్రమదేవి సమకాలికుడైన యాదవరాజు మహాదేవుని ఆస్థానంలో, సమస్తకరణాధీశుడైన హేమాద్రి పండితుడు, వ్రతఖండంలో దీన్ని పేర్కొనటం వల్ల, హుమాయూన్‌కు ముందు నుంచే ఇది వుందని సుస్పష్టం. అంతే కాకుండా, దీపావళి పండుగ మూడవరోజున సోదరపూజ చేసే అలవాటు, మన దేశంలో అనాదిగా వుంది. ధర్మసింధుకారుడూ, నిర్ణయసింధుకారుడూ కూడా తమ తమ వ్రతగ్రంథాల్లో దీన్ని చెప్పారు. హోలీ పండుగలాగే, దీన్ని కూడా, ఎటువంటి నిషేధాలూ లేకుండా, అందరూ చేసుకోవచ్చు. విజయం కోరి రక్షాబంధనం చేసుకోవటం, క్రమంగా ఇతరులు, అందులోనూ భార్య మొదలైన స్త్రీలు పురుషులకు కట్టే ఆచారంగా మారి, ఆ తరువాత భ్రాతృద్వితీయలాగే సోదరపూజనంగా మారివుంటుంది. ఆ పైన రాజపుత్రస్త్రీల ద్వారా ఈ రక్షాబంధనానికి బహుళప్రచారం కలిగింది.

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో, సముద్రతీరవాసులు, శ్రావణపూర్ణిమను విశేషంగా జరుపుకొంటారు. సముద్రాన్ని పూజించి, కొబ్బరి కాయలను సమర్పిస్తారు. ఈ ప్రాంతాల్లో వారు ఈ పండుగను 'నారికేళపూర్ణిమ, నార్లీపూర్ణిమ' అని వ్యవహరిస్తారు.

పాల్కురికి సోమనాథుడు, ఈ పండుగను గురించి తన పండితారాధ్యచరిత్రలో పేర్కొంటూ, 'నూలిపున్నమ' అన్నాడు. అంటే జంధ్యాల పున్నమ. అంటే యజ్ఞోపవీతం (పూనూల్ అంటే తమిళభాషలో జన్నిదమని అర్థం. ఇది ఇప్పుడు 'పూణల్'గా మారింది). ఈ పదాన్ని మలహణుని కథలో ప్రయోగించాడు సోమన.

No comments: