Friday, January 25, 2013

Speciality of birth-mole(Birth marks),విశేషమైన పుట్టుమచ్చ ప్రత్యేకం

  •  
  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -Speciality of birth-mole(Birth marks),విశేషమైన పుట్టుమచ్చ ప్రత్యేకం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. పుట్టుమచ్చేకదా అని తేలిగ్గా తీసిపారేయకండి. శరీరంలోని ఏ భాగంలో పుట్టమచ్చ స్పష్టంగా కనబడుతుందో ఆ వివరాలను బట్టి మీ మనస్తత్వాన్నీ, మీ పనితీరుని అంచనా వేయవచ్చని ఈ మధ్యనే ప్రాశ్చాత్య దేశాల వారు సైతం ఓ శాస్త్రాన్ని తయారుచేశారు.

మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ''మేలిగ్నెంట్‌ మెలనోమా'' అంటారు.

మహాభారతంలో అన్ని శాస్త్రాల విషయాలూ ఉన్నాయి. అటువంటి శాస్త్రాలలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఇమిడి ఉంది. మనిషి పుట్టుకతో ఏర్పడే పుట్టుమచ్చలు అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి జీవితంలో జరిగే మంచి చెడులను నిర్ణయిస్తుంటారు. ఈ శాస్త్రానికి సంబంధించిన ఆనవాళ్లు నలదమయంతుల కథలో స్పష్టంగా ఉన్నట్టు మహాభారతం వనపర్వం అరవై తొమ్మిదో అధ్యాయం వివరిస్తోంది. అరణ్యంలో దమయంతిని నలుడు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లాక ఆమె పడరాని కష్టాలన్నీపడి చివరకు ఛేది రాజ్యాన్ని చేరుకొంది. అక్కడ మేడ పైనుంచి రాజమాత దమయంతిని చూసింది. దుమ్ముకొట్టుకొని సగం చీరలో పిచ్చిదానిలా ఉన్నా దేవతా స్త్రీలా కనిపిస్తున్న ఆమెను పిల్లలు హేళన చేస్తూ వీధుల్లో వెంబడిస్తున్నారు. దీన్ని చూసిన రాజమాత పరిచారికను పంపి ఆమెను అంతఃపురానికి రప్పించింది. మంచిమాటలు చెప్పి ధైర్యాన్ని కలిగించి అక్కడే సైరంధ్రిలాగా ఉండమని కోరింది. పురుషులతో మాట్లాడబోనన్న దమయంతి అప్పుడు దమయంతి అక్కడ తానుండటానికి అభ్యంతరం ఏమీ లేదని కానీ ఎవరికీ పాదసేవ చేయనని, ఇతర పురుషులతో ఎన్నడూ మాట్లాడనని, ఏ పురుషుడైనా తనను కోరినట్త్లెతే అతడిని కఠినంగా శిక్షించాలని, వీలైతే మరణ దండన కూడా విధించాలని ఈ ఒప్పందానికి ఇష్టమైతే తాను ఉండటానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని దమయంతి చెప్పింది. రాజమాత ఆ మాటలకు మరీ మరీ సంతోషించి తన కుమార్తె సునందను పిలిచి ఆనాటి నుంచి దమయంతితో కలిసిమెలసి ఉండమని అంది. దమయంతికి కొద్దిగా అటూ ఇటూగా సమవయస్కురాలుగా ఉన్న సునంద దమయంతిని సోదరిగానే భావించసాగింది. భీమ మహారాజు తన అల్లుడు నలుడు, కుమార్తె దమయంతి ఎక్కడున్నారో తెలుసుకొని

రమ్మనమని నాలుగు దిక్కులకు ఎంతో మంది పండితులను పంపించాడు. అలా ఆ పండితులు భూమండలమంతా తిరుగుతున్నారు. ఆ సమయంలో ఛేది రాజైన సుబాహుడి రాజ్యానికి సుదేవుడు అనే ఓ పండితుడు చేరాడు. సుదేవుడు రాజగృహంలో దమయంతిని చూసి పోల్చుకున్నాడు. మేఘాలతో కప్పి ఉన్న సూర్యకాంతిలా ఉన్న దమయంతిని చూసి ఒకటికి రెండుసార్లు పరిశీలనగా గమనించాడు. సుదేవుడు దమయంతి దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. దమయంతి పిల్లలు, తల్లితండ్రులు, సోదరులు అంతా క్షేమమని వివరించి చెప్పాడు. తన అన్నకు మంచి మిత్రుడైన సుదేవుడిని దమయంతి గుర్తించింది. భావోద్వేగంతో ఏడ్చింది. ఈ విషయాన్ని రాకుమారి సునంద రాజమాతకు చెప్పింది. రాజమాత పరుగు పరుగున అక్కడకు వచ్చింది.
పుట్టుమచ్చతో గుర్తించానన్న సుదేవుడురాజమాత సుదేవుడిని చూస,ి 'ఈమె ఎవరు? ఇంతకు ముందు నీకెలా తెలుసు? దానికి రుజువేమిట'ని అడిగింది. అప్పుడు సుదేవుడు ఆమె విదర్భ రాజు కుమార్తె దమయంతి అని, నలుడికి భార్య అని, తాను గుర్తుపట్టటానికి కారణం దమయంతి కనుబొమల మధ్యన ఉన్న పుట్టుమచ్చేనని చెప్పాడు. అలాంటి పుట్టుమచ్చ ఉత్తమ స్త్రీకి ఉండే సహజసిద్ధమైన లక్షణమని వివరించాడు. రాజమాత దమయంతి కనుబొమల మధ్యన చూసింది. కానీ ఆమెకు సుదేవుడు చెప్పిన పుట్టుమచ్చ కనిపించలేదు. రాజమాత సందేహాన్ని గమనించిన సుదేవుడు భర్తకు దూరంగా ఉండి దుమ్మూధూళితో మాలిన్యం కప్పి ఉన్న దమయంతి ముఖం కడిగి చూస్తే ఆ పుట్టుమచ్చ కనిపిస్తుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రాజమాత స్వయంగా దమయంతి ముఖం మీది మాలిన్యాన్ని శుభ్రపరచింది. మబ్బులు తొలిగిన చంద్రుడిలా సుస్పష్టంగా పుట్టుమచ్చ కనిపించింది. రాజమాతకు భావోద్వేగం పెల్లుబికింది. ఎందుకంటే దమయంతి తల్లి ఆ రాజమాతకు చెల్లెలవుతుంది. దశార్ణ దేశాధిపతి అయిన సుధాముడు తమకు తండ్రి అని దమయంతికి తాత అని అన్ని విషయాలు వివరించి ఎంతో ఆనందపడుతూ దమయంతిని విదర్భ దేశానికి పంపించే ఏర్పాట్లను చేసింది రాజమాత. ఈ కథా సందర్భంలో పుట్టుమచ్చల విశేషాలలో ఓ విశేషం వర్ణితమై మహాభారతంలో పుట్టుమచ్చల శాస్త్రం ఉందని చెప్పటానికి ఆధారంగా నిలుస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

శరీరము పైన ఉన్న మచ్చలు మూలంగా మన జీవితాలు ఉంటాయనడమో , మారుతాయనడమో ... ఒక నమ్మకము మాత్రమే . మనిషి నడవడిక , చేసే పని , కష్టపడే విధానము వలన , ఉన్న

ప్రదేశము బట్టి , అందుబాటులో ఉన్న అవకాశాలు బట్టి జీ్వితము సాగుతూ ఉంటుంది. ప్రతి మనిషి (జీవి) పుట్టినప్పటినుండి చనిపోయే వరకూ కష్ట - సుఖాలు , లాభ - నష్టాలు అనుభవిస్తూనే ఉంటాడు . అంతేగాని తెల్ల మచ్చలు ... నల్ల మచ్చలూ ఏ విధముగాను ప్రభావితము చేయవు ... అలా చేయలేవు . వైద్య శాస్త్రము లో చనిపోయిన తరువాత మెడికో-లీగల్ కేసులలో శవపరీక్షలలో శరీరాలను గుర్తించడానికి ఈ పుట్టుమచ్చలు వాడుతూ ఉంటారు.  బ్రతికిఉన్న మనుషుల్లో కూడా  Identification కోసము పుట్టుమచ్చలు విధిగా వ్రాస్తూ ఉంటారు. మనుషుల్లో పుట్టినప్పటినుండీ ఉన్న మచ్చలు పోవుగాని ... వయసు పెరిగిన కొద్దీ కొత్తమచ్చలు కనిపెస్తూ ఉంటాయి. కనబడని పరిమాణములో ఉన్నవి పెద్దవి అవడము వల్ల అలా జరుగుతుంటుంది.

డా. వండాన శేషగిరిరావు .. శ్రీకాకుళం .
  • ------------------================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: