Friday, January 25, 2013

Mind,Heartstrings,మనసు

  •  
  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము - Mind,Heartstrings,మనసు-గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


మనసుకు రూపమంటూ లేదు. కాని, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేలమీద పరుగులు తీస్తుంది' అన్నాడో మహాకవి. నిజమే... రంగు, రుచి, వాసన ఏమి లేకపోయినా మనిషిని జీవించినంతకాలం నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది. లేదా అధఃపాతాళానికైనా తొక్కేస్తుంది. 'నేరం నాది కాదు, నా మనసుది' అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు.

మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు. లేకుంటే మహాపతితుడు. ప్రతి దినమూ మనసును సాధనతో ఆరాధనతో శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండక పోవడానికి ప్రధాన కారణాలు- మన తిళ్లు, ఒత్తిళ్ళు. ఈ రెంటిమీద శ్రద్ధవహించడం అత్యవసరం. సాత్వికాహారం మనసును క్రమపద్ధతిలో నియంత్రించ గలుగుతుంది. ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి- ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి.

మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణంవల్ల, పరిస్థితుల ప్రభావంవల్ల ఎదురైనా వివేచనతో, విజ్ఞతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.

మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్నికన్న వేడైనది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణకన్న కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఃఖాది భావాలు, అనుభూతులు మనసునుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది.

మనసే జగత్కర్త. మనసే పురుషుడు. మనోనిశ్చయంవల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో, కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం- ఇవన్నీ పుట్టినట్లు మనసునుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా, సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే! మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు, సత్వ-రజ-స్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచిమనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలూ మనోదోషాలు. అంటే మనసును పదిమందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

మనోవేగాన్ని మించిందిలేదు. అయితే మనసుకంటె శక్తిమంతమైంది బుద్ధి. దానికన్న శక్తిమంతమైంది ఆత్మ. ఆత్మ, బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తూంటుంది. ధర్మాధర్మాలకు, బంధమోక్షాలకు మనసే కేంద్రం. 'ఈ మనసు ప్రమధనశీలమైంది. అంటే, క్షోభ కలిగిస్తుంది. ఎంత మొండిదో, అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు' అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో.

మనసనేది ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషినీ ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషిచేత తప్పుచేయించిందీ- అంటే, వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడమూ ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పథనిర్దేశిక, దిక్సూచిక అనిపించుకుంటుంది.

జితేంద్రియుడైనవాణ్ని, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ని మనసు ఏ విధంగాను ప్రలోభపెట్టలేదు. నీరు పల్లంవైపు ప్రవహించినట్లే, మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరివిధాల చరించకుండా నిరోధించాలి. నియంత్రించాలి. మనసు రెండు విధాలు- శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసనా రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తీలేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే, మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే!

ఆదిశంకరులన్నారు- 'నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్లకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!'... ఈ ఆవేదన సకల మానవజాతి ఆవేదన. కాముడి బారినుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవజాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే- మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తిమార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు.- 'భజగోవిందం' అని అంతకుమించిన ధన్యోపాయం లేదు. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి @ ఈనాడు దినపత్రిక
  • ======================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: