Tuesday, April 3, 2012

తిథి, వార, నక్షత్రాలు కష్టాలను తొలగిస్తాయా..?


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiiRkFyM5DKYTMZBkyoBcbwSkTZ4vhOPbyu1R6rZbGA2J6j8NXckRyp27Vq2P4EKd5Qx-XsTcJcBGL65HVYVqG_uGnNU7db0FEJhmOoHuhqt1eO3cYpr-FUumyWPADaAm_shDpCa4pNSqHD/s1600/formation+of+New+moon+%26+full+moom.jpg
  • image : courtesy with prajashakti news paper.


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము - తిథి, వార, నక్షత్రాలు - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--




ఉగాది వేడుకల్లో అత్యంతముఖ్యమైనది పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఐదు అంగములు కలదని అర్ధం. తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే ఐదు అంగములు గలిగినదే పంచాంగం. ఈ ఐదు అంగాలలో సంవత్సరంలేదు. కనుక పంచాంగానికి సంవత్సరంతో సంబంధంలేదు. కానీ ప్రతి సంవత్సరంలో తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలుంటాయి. అంటే ప్రతి సంవత్సరంలో పంచాంగముంటుంది. అంటే సంవత్సరానికొక పంచాంగం ఉంటుంది. కనుక పంచాంగం కాల పరిమితి ఒక సంవత్సరకాలం మాత్రమే.

పంచాంగం ముఖ్యంగా రెండు విషయాలను తెలియజేస్తుంది. మొదటిది ఖగోళ సంబంధమైన విషయాలు. ఇవి కాలాన్ని తెలుసుకోవటానికి ఉపకరిస్తాయి. రెండోది జ్యోతీష్య సంబంధమైన విషయాలు. ఇది మానవ జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. కనుక పంచాంగంలో ఉండే ఐదు అంగాలు ఈ రెండు అంశాలకు లోబడి ఉంటాయి. అందువల్ల పంచాంగంలోని అంశాలైన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ రెండు అంశాలనే తెలియజేస్తాయి. కనుక వీటి గురించి తెలుసుకుందాం.

తిధి అంటే రోజు. చంద్ర గమనం ప్రకారం తిధులను (రోజులను) లెక్కిస్తారు. చంద్రోదయం నాటినుండి చంద్రబింబం కొంచెం కొంచెం వృధ్ధి చెందుతూ 15వ రోజుకు పూర్ణబింబంగా మారుతుంది. ఆ మరుసటి రోజు నుండి క్రమేణా క్షీణిస్తూ 30వ రోజుకు పూర్తిగా కనిపించకుండా పోతుంది. చంద్రబింబం వృధ్ధి చెందే మొదటి 15 రోజులను శుక్ల పక్షమని, చంద్రబింబం క్షీణించే తదుపరి 15 రోజులను కృష్ణ (అంటే చీకటి) పక్షమని అంటారు. ఈ 15 రోజులకు 15 పేర్లు పెట్టారు. వీటిలో మొదటిది పాడ్యమి. పాడ్యమి అనగా మొదటి రోజు అని అర్ధం. ఇది ప్రధమ అన్న పదానికి వ్యావహారిక నామం. దాని తర్వాతది విదియ. విదియ అనగా రెండో రోజు అని అర్ధం. ద్వితీయ అన్న పదానికి వ్యావహారిక నామం విదియ. తదియ (తృతీయ అన్న పదానికి వ్యావహారిక నామం) అనగా మూడో రోజు. చవితి (చతుర్ధ అన్న పదానికి వ్యావహారిక నామం) 4వ రోజు. పంచమి 5వ రోజు, షష్టి 6వ రోజు, సప్తమి 7వ రోజు, అష్టమి 8వ రోజు, నవమి 9వ రోజు, దశమి 10వ రోజు, ఏకాదశి 11వ రోజు, ద్వాదశి 12వ రోజు, త్రయోదశి 13వ రోజు, చతుర్దశి 14వ రోజు, 15వ రోజున పూర్ణ చంద్ర బింబం కనిపిస్తుంది. కనుక పూర్ణిమ లేదా పౌర్ణమి అన్నారు. తదుపరి 14 రోజులు ఇవే పేర్లు ఉంటాయి. చివరి రోజు చంద్రుడు కనిపించడు. గనుక అమావాస్య అన్నారు. అమావాస్య అంటే కూడియున్న సూర్యచంద్రులు కలది అని అర్ధం. సూర్యచంద్రులు కలిసి ఉంటే చంద్రుడు కనిపించడు. కనుక అమావాస్య అన్నారు. అంటే రోజులను ఒకటో రోజు, రెండో రోజు అని అలా లెక్కించారే తప్ప, వాటికి ప్రత్యేకమైన పేర్లేమీ పెట్టలేదు. కాకుంటే ఒకటి, రెండు అన్న అంకెలకు బదులు, సంస్కృతంలో అంకెలను సూచించే ప్రధమ (పాడ్యమి), ద్వితీయ (విదియ) అన్న పదాలను వాడారంతే.

దీనిని బట్టి రోజులను లెక్కించడానికి చంద్ర గమనాన్ని వినియోగించుకున్నారని మనకు స్పష్టమవుతున్నది. అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహమనీ, సూర్యుని కాంతి చంద్రునిపై పడటం వల్ల మాత్రమే చంద్రుడు ప్రకాశిస్తాడనీ పూర్వీకులకు తెలియదు. అందుకే భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడిని కూడా మన పంచాంగకర్తలు నేటికీ గ్రహంగానే భావిస్తున్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో అనేక సార్లు చంద్రునిపై సూర్యకిరణాలు పడకుండా భూమి అడ్డు వస్తుంది, భూమి అడ్డు వచ్చిన భాగం మీద సూర్య కిరణాలు పడవు. సూర్య కిరణాలు పడని భాగం ప్రకాశించదు. సూర్య కిరణాలు పడిన భాగం మాత్రమే ప్రకాశించి మనకు కనుపిస్తుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇవి రెండూ వేర్వేరు వేగాలతో, వేర్వేరు చుట్టుకొలతలు కలిగిన కక్ష్యల్లో తిరుగుతుంటాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగటానికి ఒక సంవత్సరకాలం పడితే, భూమి చుట్టూ చంద్రుడు తిరడటానికి కేవలం నెల రోజులే పడుతుంది. ఈ నెల రోజుల్లో సూర్యుని నుండి చూసినప్పుడు, చంద్రుడు 15 రోజుల పాటు భూమికి అవతలవైపు నుండి కొంచెం కొంచెంగా సూర్యుడు ఉన్న వైపుకు వస్తాడు. ఆ 15 రోజులు సూర్య కాంతి చంద్రునిపై పడే భాగం రోజురోజుకూ పెరుగుతుంది. ఫలితంగా ఆ 15 రోజులు చంద్రబింబం సన్నని రేఖ స్థాయి నుండి పెరిగి పెరిగి పూర్ణబింబం స్థాయికి కనుపిస్తుంది. దీనినే శుక్ల పక్షం అంటాము. అత్యంత సన్నని రేఖగా ఉన్న రోజును పాడ్యమి అని, పూర్ణ బింబంగా ఉన్న రోజును పూర్ణిమ అని అన్నారు. అలా తిరిగే క్రమంలోనే చంద్రుడు ఆ తర్వాత 15 రోజుల్లో క్రమేణా భూమికి ఆవలివైపుకు వెళతాడు. అలా వెళ్లే కొలది భూమి అడ్డు రావడం వల్ల చంద్రునిపై సూర్యకిరణాలు పడే భాగం తగ్గుతుంది. అందువల్లనే ఆ 15 రోజులు చంద్రుడు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ 15వ రోజున కనిపించకుండా పోతాడు. దీనినే కృష్ణపక్షం అని, చంద్రుడు అసలు కనిపించకుండా పోయిన రోజును అమావాస్య అని అంటాము. ఇది పూర్వీకులకు తెలియదు. ఆ మాటకొస్తే నేటికీ ఈ విషయం చాలామందికి తెలియదు. కేవలం భూమిమీద నిలబడి భూమి స్థిరంగా ఉందని, చంద్రుడు కదులుతున్నాడని భావించి, చంద్రకళల ఆధారంగా రోజులను లెక్కించారు. అమావాస్య వెళ్లిన మరుసటి రోజు నుండి అంటే శుక్ల పాడ్యమి నుండి మళ్లీ అమావాస్యకు గల 30 రోజులను ఒక నెల లేదా మాసము అన్నారు. అలాంటి 12 నెలలను కలిపి ఒక సంవత్సరంగా రూపొందించారు. కాలాన్ని లెక్కించుకోవడానికి ఏదో ఒక ప్రమాణం కావాలి కనుక కంటికి కనిపించే చంద్రకళలను తీసుకొని కాలాన్ని లెక్కించారు. కనుక ఇది కాలాన్ని లెక్కించుకోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. పైగా చంద్ర కళలు ప్రపంచవ్యాప్తంగా ఒకేరకంగా ఉండవు. ధృవ ప్రాంతాల నుండి భూమధ్య రేఖ వరకు వచ్చేకొలది ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. కనుకనే కాలాన్ని కొలవడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్ర కళలు ఉపయోగపడలేదు. ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని కొలవడానికి భూమిపై ఉన్న రేఖాంశాలను వాడుకోవాల్సి వచ్చింది. అందువల్ల మన పంచాంగం ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కాలాన్ని కొలవడానికి ఉపయోగపడదు.

పంచాంగంలో రెండో అంశం వారం. ఏడు రోజులను వారం అంటాము. ఈ వారాలకు గల పేర్లు కూడా సంస్కృతజన్యాలే. భానువారము, ఇందువారము, సౌమ్యవారము, భృగువారము, బృహస్పతి వారము, శుక్రవారము, మందవారము. వాటి తెలుగు అనువాదమే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. పంచాంగంలో తిధి, నక్షత్రాలతో పోల్చినప్పుడు వారానికున్న ప్రాధాన్యత తక్కువ.

పంచాంగంలో మూడో అంశం నక్షత్రం. చంద్రుడు ఏరోజు ఏనక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ రోజు ఆనక్షత్రంగా చెప్తారు. అశ్వని మొదలు రేవతి వరకూ అలాంటివి 27 నక్షత్రాలున్నాయి. నిజానికి నక్షత్రానికీ, చంద్రునికీ ఎలాంటి సంబంధంలేదు. చంద్రుడు, నక్షత్రం కలిసి ఉండటం లేదా దగ్గరగా ఉండటం జరగదు. కారణమేమంటే చంద్రునికీ నక్షత్రాలకు మధ్య, నక్షత్రానికీ నక్షత్రానికీ మధ్య వేల నుండి కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరకాలంలో కాంతి ప్రయాణం చేసే దూరం. కాంతి ఒక సెకండులో 2 లక్షల 99 వేల 792.5 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుంది. అంటే కాంతి ఒక సంవత్సరానికి 2,99,792.5×60×60×24×365=9,45,425.628 కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఈ దూరాన్నే కాంతి సంవత్సరం అంటాము. మన భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం పేరు ఆల్ఫాసెంటారి. ఇది భూమినుండి 4.36 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే 4.36×9,45,425.628 కోట్లు=41,22,056 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. కానీ భూమికీ చంద్రునికీ మధ్యదూరం 3,84,400 కిలో మీటర్లు మాత్రమే. అంతేకాకుండా చంద్రుని నుండి కాంతి భూమికి చేరటానికి కేవలం 1.29 సెకనులు అయితే ఆల్ఫాసెంటారి నుండి కాంతి భూమిని చేరటానికి 4.36 సంవత్సరాలు పడుతుంది. అంటే మనకు ఈ రోజు కనుపించే చంద్రుడు ఈ రోజు వాడైతే, ఈ రోజు కనుపించే ఆల్ఫాసెంటారీ 4.36 సంవత్సరాల క్రితంనాటిది అన్నమాట. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమే 4.36 సంవత్సరాల క్రితం నాటిది అయితే, భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితంనాటివోగదా! దీని బట్టి చూస్తే చంద్రుడు నక్షత్రం కలిసి ఉండటం అనేది అవాస్తవమని స్పష్టంగా రుజువవుతున్నది.

దీనిని బట్టి మనకు ఏం తెలుస్తుంది? ఈనాడు మనకు కనిపించే చంద్రుడు ఈనాటివాడే. కానీ ఈనాడు మనకు చంద్రునితో కలిసి ఉన్నట్లుగా కనిపించే నక్షత్రం ఈనాటిది కాదు. కోట్ల సంవత్సరాల నాటిది. ఈనాడుందో లేదో తెలియదు. కోట్ల సంవత్సరాల నాటి నక్షత్రాన్ని చూసి ఈనాడు కాలాన్ని నిర్ణయించడంలో అర్ధంలేదు. కనుక భూమి మీద ఉన్న మన కాల నిర్ణయంలో నక్షత్రం పాత్ర సరైంది కాదని స్పష్టమవుతున్నది.

పంచాంగంలో రాశులను గురించి కూడా చెబుతుంటారు. కొన్ని నక్షత్ర సమూహాలను రాశులు అంటారు. ఆ సమూహాల ఆకృతులను బట్టి రాశులకు పేర్లు పెట్టారు. ఉదాహరణకు మేక ఆకారంలో ఉంటే మేషరాశి అని, ఎద్దు ఆకారంలో ఉంటే వృషభ రాశి అని, మనుషుల జంట కలిసి ఉన్నట్లుగా ఉంటే మిధున రాశియని అలా ఆకారాలను బట్టి పేర్లు పెట్టారు. ఇలాంటి 12 రాశులను మాత్రమే మన పూర్వీకులు గుర్తించారు. కానీ ఇలాంటి రాశులు ఖగోళంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. నిజానికి సమూహంగా ఉన్నట్లు కనిపించే నక్షత్రాలన్నీ గుంపుగా ఒకచోట ఉన్నవికావు. నక్షత్రానికీ నక్షత్రానికీ మధ్య కోట్లాది కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఒక దానికొకటి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా భూమి మీద నుండి చూసినప్పుడు ఒకే వరుసలో లేదా కొంచెం అటూఇటుగా ఉండటం వల్ల గుంపులుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, సమూహంగా ఈనాడు కనిపించే ఆ నక్షత్రాలు అసలు ఈరోజు ఉన్నాయో లేక నశించి పోయాయో తెలియదు.

ఇక యోగము అనగా దశ. సమాజంలో మనిషి స్థితిగతులను తెలుపుతుంది. ఇది పూర్తిగా జ్యోతీష్య సంబంధమైన విషయం. సమాజంలో మనిషి స్థితిగతులు ఆ సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది తప్ప, నేడు ఉన్నాయో లేదో తెలియని నక్షత్రాలు, నక్షత్రాల గుంపులు (రాశులు) మీద ఆధారపడి ఉండదు. కరణము అనగా గణిత సంబంధమైన విషయం. ఈ గణితం నేటి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి పనికిరాదు.

పంచాంగంలో ఉన్న కాలనిర్ణయ అంశాలు ప్రాథమిక ఖగోళ పరిశీలనకు సంబంధించినవి. భూమిమీద నిలబడి, భూమి స్థిరంగా ఉందనుకొని, భూమిచుట్టూ ఈ విశ్వమంతా పరిభ్రమిస్తున్నదని భ్రమించి తయారు చేసింది. కానీ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. భూమి ఒక గ్రహమనీ, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందనీ ఆనాటివారికి తెలియదు. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని వారు భావించేవారు. అందుకే సూర్యుడిని కూడా గ్రహం అన్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. కనుక చంద్రుడు భూమికి ఉపగ్రహం. సూర్యుని చుట్టూ తిరుగడు గనుక చంద్రుడు గ్రహంకాదు. అయినా మన పంచాంగ కర్తలు చంద్రుడిని కూడా గ్రహాలలో కలిపేశారు. అందుకే పంచాంగంలోని అంశాలు ప్రాధమిక ఖగోళ పరిశీలనకు సంబంధించినవి మాత్రమేగాని అభివృద్ధి చెందిన విజ్ఞానం కాదని స్పష్టంగా చెప్పవచ్చు.

పంచాంగంలో ఉన్న రెండో అంశం జ్యోతీష్య సంబంధమైన విషయాలు. నిజానికి భారతదేశంలో అభివృధ్ధి చెందుతున్న ఖగోళ విజ్ఞానాన్ని కుంటుపరచింది ఇదే. చంద్ర కళలను బట్టి తిధులను (రోజులను) ఏర్పాటు చేసుకోవటం, నక్షత్రాలను, నక్షత్ర గమనాలను, గ్రహాలను, గ్రహ గమనాలను గమనించడం, రాశులను గమనించడం ఇవన్నీ ఆనాడు పెరుగుతున్న ఖగోళ పరిశీలనకు నిదర్శనాలు. అయితే వీటికి, మనిషి భవిష్యత్తుకు ముడిపెట్టి నిరాధారమైన ఊహాజనిత అంశాలను చెప్పటం ద్వారా ఖగోళ పరిశీలనను నీరుగార్చారు. మానవ జీవితంలోవచ్చే కష్టనష్టాలకూ, గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, తిధులకూ ముడిపెట్టారు. తిధుల్లో పలాన తిధి మంచిదనీ, పలాన తిధి మంచిదికాదనీ, పలాన వారం మంచిదనీ, పలాన వారం మంచిది కాదనీ, పలాన నక్షత్రం మంచిదనీ, పలాన నక్షత్రం మంచిదికాదని, పలాన రాశిలో జన్మించిన వారి భవిఫ్యత్తు బాగుంటుందని లేక బాగుండదని చెప్పటం వాస్తవం కాదు. ఖగోళంలో సంచరించే గ్రహాలు, ఈనాడు ఉనికిలో ఉన్నాయో లేవో తెలియని నక్షత్రాలు, అలాంటి నక్షత్ర సమూహాలైన రాశులు మానవుని భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పటం అశాస్త్రీయం.

గ్రహ దోషాలను గురించి చెప్పే పంచాంగ కర్తలు తాము నివసిస్తున్న భూమి ఒక గ్రహమన్న విషయాన్ని గుర్తించరు. భూ వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయో, ఆ మార్పులు మానవజాతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో వివరించలేరు. రోజు ప్రజలందరికీ ఒకేవిధంగా ఉంటుంది. రోజు చెడ్డదైనా మంచిదైనా ప్రజలందరికీ ఒకేవిధంగా ఉండాలి. కానీ అలా ఉండటంలేదు. ఒకే రోజులో కొంతమంది ప్రజలు సుఖసంతోషాలను పొందుతుంటే, మరి కొంతమంది కష్టనష్టాలకు గురవుతూ ఉంటారు. కొంతమంది జీవితంలో అత్యధిక కాలం సుఖసంతోషాలను అనుభవిస్తుంటే, మరికొంతమంది జీవితంలో అత్యధిక కాలం కష్టాలకు లోనవుతూనే ఉంటారు. పంచాంగంలో కందాయ ఫలాలను (ఆదాయ వ్యయాలను) గురించి చెప్పటం మనం చూస్తుంటాము. ఇది కూడా వాస్తవంకాదు. అమృత ఘడియలలో పని చేసే వారందరికీ సమానమైన ఆదాయం రావటంలేదు. వర్జ్య కాలంలో పనిచేసే బహుళజాతి కంపెనీలకు నష్టాలు రావటంలేదు. నిజానికి బహుళజాతి కంపెనీలకు, వాటి అధిపతులకు ప్రతియేటా లాభాలు పెరుగుతూ ఉంటాయి. వారికి కందాయ ఫలం ''సున్న'' అనేది ఉండదు. ధరలు పెరిగితే కంపెనీలవారు లాభపడతారు. ప్రజలు నష్టపోతారు. ధరలు పెరగడమనే ఒకే చర్యకు కంపెనీలు, వాటి అధిపతుల కందాయ ఫలం లాభకరంగా ఉంటే, ప్రజల కందాయఫలం ''సున్న'' ఉంటుంది. అలాగే రాజపూజిత అవమానాలను గురించి చెప్తారు. అగ్రకులాల వారు పుట్టిన తిధి, వార, నక్షత్రాలలో, రాశులలోనే దళితులు కూడా పుట్టారు. గ్రహాల ఫలితాలు, రాశి ఫలాలు వారికి కూడా ఒకేరకంగా ఉండాలి. కానీ శతాబ్దాల తరబడి దళితులు అవమానాలకు గురవుతూనే ఉన్నారు. వారి జీవితాలలో అవమానాలే తప్ప రాజపూజితమంటూలేదు.

మానవ జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. వాటిలో ప్రకృతి పరమైనవి కొన్నైతే, సమాజంలోఉండే ఆర్థిక సంబంధాల ద్వారా వచ్చేవి మరికొన్ని. ప్రకృతి పరమైన కష్టనష్టాల నుండి బయట పడాలంటే శాస్త్ర విజ్ఞానం పెరగటం, పెరిగిన శాస్త్రవిజ్ఞానం ప్రజలందరికీ అందటం పరిష్కారమార్గం. అలాగే ఆర్థిక సంబంధాల ద్వారా వచ్చే కష్టనష్టాల నుండి బయట పడాలంటే ఆర్థిక సమానత్వాన్ని సాధించుకోవటమే పరిష్కారమార్గం. అంతేతప్ప తిధి, వార, నక్షత్రాలు కష్టాలను తొలగించలేవు, కలిగించనూలేవు.

మనుషుల సుఖసంతోషాలనూ కష్టనష్టాలనూ నిర్ణయించేది తిథి (రోజు), వారం, నక్షత్రాలు, రాశులు కావు. వాటి మంచిచెడులు కాదు. ప్రకృతిపరంగా చూసినప్పుడు మంచి తిథి మంచి నక్షత్రం, మంచి రాశి, మంచి కాలం అనేవి ఏమీ ఉండవు. అసలు మంచి చెడులతో వాటికి సంబంధంలేదు. మంచి చెడులు మానవ జాతికి సంబంధించిన విషయాలు. మానవ జాతికోసం గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఏర్పడలేదు. మానవ జాతి ఆవిర్భావానికి వేలాది కోట్ల సంవత్సరాలకు పూర్వమే విశ్వ విస్పోటనంలో భాగంగా అవి ఏర్పడ్డాయి. అందువల్ల వాటికి మంచి చెడులతో సంబంధంలేదు. మానవుల మంచిచెడులను నిర్ణయించేది ప్రకృతిలో జరుగుతున్న మార్పులు, మానవుల మధ్యనున్న ఆర్థిక సంబంధాలు మాత్రమే. వీటిని అధ్యయనంచేసి మానవ జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నంచేస్తే సమస్త మానవులకు మేలు కలుగుతుంది. ''సర్వేజనా సుఖినో భవంతు'' అన్న పెద్దల ఆకాంక్ష నెరవేరుతుంది.

- ఎం.వి.ఆంజనేయులు, సాహితీ స్రవంతి సభ్యులు.
  • ==========================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: