భారతదేశములో హిందూమతము ఒక ప్రత్యేకమైనది. నమ్మకాలు, ఆచారారు , భక్తి , ఆరాధన , అత్యాద్మిక ప్రవర్తన ఎంతో పవిత్రమైనవి. ముక్కోటి దేవతలు , కోట్లకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. వీటి చరిత్ర వెనక ఎన్నో రహస్యాలు , అర్ధాలు , పరమార్ధాలు దాగిఉన్నాయి. మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కాని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో మనకు అంతా తెలియవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తీర్థ స్నానం: ఉదయానే్న చన్నీటి స్నానం: ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న చన్నీటి స్నానం శుచితోబాటు ఏకాగ్రతను కల్గిస్తుంది. అందులో ఖనిజ సంబంధమైన చన్నీటి స్నానం, అందులో చేసే సూర్యనమస్కారం శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కుంభమేళా మొదలైన పవిత్ర సమయాల్లో పరమయోగులు తీర్థాల్లో, నదుల్లో స్నానం
చేస్తారు. కాబట్టి ఆ తీర్థస్నానం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పుష్కర సమయాల్లో తీర్థస్నానం కూడా ఎంతో పవిత్రమైనది.
ప్రదక్షిణం: ఆలయం ప్రాకారం లోపల, గర్భగుడికి వెలుపల మూడు ప్రదక్షిణలు చేస్తాం. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం చుట్టూ పరచబడిన రాళ్ళపై వట్టి కాళ్ళతో నడుస్తాం. అలా రాళ్ళపైనున్న సన్నని రంధ్రాలపై అది కాళ్ళ బరువు ఆనుతుంది. ఆ ఒత్తిడికి కాళ్ళలోనున్న నరాల కూడళ్ళు కదిలి, ఇతరావయవాలు చక్కగా పనిచేస్తాయి. దీనినే ఆక్యుపంచర్ అంటారు.
ఆలయంలో కూర్చోవటం: దర్శనం తర్వాత ఆలయంలో కూర్చొని వెళ్ళటం ఒక ఆచారం. ఇందుకు కారణం ఆలయంలో అనేక వృక్షాలుంటాయి. వాటికి ఔషధశక్తి ఉంటుంది. కావున ఆ చెట్టుక్రింద గాని, చెట్టుముందుగాని, ఆలయంలో ఎక్కడైన కూర్చొని ధ్యానం చేస్తే ఊపిరితిత్తులను శుభ్రపరిచి, శరీరం పైనున్న విషక్రిములను నాశనం చేసి, శరీరారోగ్యాన్ని
కాపాడుతుంది, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుంది.
జపం: ఆలయంలోని వృక్షం క్రింద ఉన్న విగ్రహం ముందు గాని, ఆలయంలో విగ్రహం ముందు గాని కూర్చొని జపం చేస్తుంటాం. అనగా ఉత్తరాభిముఖంగా నుండి ధ్యానం చేసేటప్పుడు, ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది.
ఆలయ నిర్మాణం: ఆలయం నిర్మాణానికి, చక్కటి ప్రకృతి రమణీయ స్థలాన్ని నిర్దేశించి, లోపాలేవి లేని సుక్షేత్రమును ఎన్నుకొని నిర్మిస్తారు. ఆలయంలో వాస్తు, జ్యోతిష్యం, ఆరోగ్యం,
సంగీతం, నృత్యం వంటి సర్వశాస్త్ర సమ్మిళితం.
దేవతా విగ్రహాలు: ప్రత్యేక ముహూర్తంలో పవిత్రతో, పద్ధతితో మంత్రతో సేకరించబడిన రాళ్ళను విగ్రహాలుగా చెక్కి ఒక సుముహూర్తాన దేవాలయంనందు ప్రతిష్ఠింపబడతాయి. ప్రాణప్రతిష్ఠ జరుపబడిన ఈ దివ్యశిలలు సూర్య, చంద్రుల, వరుణ, వాయువుల ప్రభావాలకులోనై ఖనిజాలుగా మారి విద్యుత్‌శక్తి కలిగి ఇతర దివ్యశక్తులను పొంది, అపూర్వ గుణగణ సంపూర్ణమైనవిగా వెలుస్తాయి. ఈ దివ్య విగ్రహాలనుండి వెలువడే బ్రహ్మపదార్థము, దివ్య పరిమళము, భక్తులు శిరస్సు వంచి చేయబడు ప్రార్థన మూలకంగా మెదడు ద్వారా శరీర ప్రవేశం చేస్తాయి. దేవతా విగ్రహాల నుండి వెలువడే కిరణాలు, ప్రకంపనాలు భక్తుని మనస్సును నిర్మలంగా ఉంచడానికి దోహదపడతాయి. కాని విగ్రహాల క్రింద స్థాపించబడిన యంత్రాలనుండి వెలువడే తరంగాలు మానవుణ్ణి మహోన్నత స్థితికి చేరుస్తాయ.
నమస్కారం: భక్తులు ఆలయంలో చేసే నమస్కారాల పద్ధతిలో వ్యాయామం దాగుంది. దీనివలన మెడ, తుంటి, మోచేయి, కాలు, చీలమండలం మొదలైన శరీర భాగాలన్నీ తేలికగా
కదిలి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. సాష్టాంగ నమస్కారం సర్వశ్రేయస్కరం, అలాగే వినాయకునికి చేసే గుంజీలు కూడా ఇందులో భాగాలే.
మంత్రం: ఆలయంలో అర్చకులు చేసే మంత్ర ఉచ్ఛారణ మనలో చైతన్యాన్ని ప్రకృతిలో శక్తిని పెంపొందిస్తుంది. కొన్ని మంత్రాలు మానవునికి ఆరోగ్యాన్ని, శక్తిని కోరికలను తీరుస్తాయి.
తీర్థం: ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం, మానసిక, శారీర ప్రశాంతతనిస్తుంది.
ప్రసాదం: దైవదర్శనం అనంతరం ఆలయంలో స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణకు క్రమబద్ధంచేసి, జీర్ణశక్తిని కలిగిస్తాయి. ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే అక్కడ ఇచ్చే పసుపు నీరు, నిమ్మరసం, విభూతి, కుంకుమ, అభిషేక జలం, మన్ను మొదలైనవి సేవించడం వలన మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి.
ఏకాగ్రత: దేవాలయంలో చెక్కబడిన మూర్తులు, శిల్పాలు, పురాణగాథలు, ఇతర కథలు ప్రాపంచిక ధోరణినుండి మనసును మరల్చి, మన సంస్కృతీ సాంప్రదాయాల విధులు, విలువలు, విధానాలు మనకు తెలియజేస్తూ, పరిశుభ్రతను, స్వచ్ఛతను, సామాజిక సంబంధ, బాంధవ్యాలను పెంచుతూ మానవతా, ఆధ్యాత్మిక, ఆరోగ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి ఆలయాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
- ( పి.వి.బాలాజీ దీక్షితులు * 26/02/2012)
- ===========================
No comments:
Post a Comment