ధర్మం అడుగంటుతున్నప్పుడల్లా ఎవరో ఒక మహానుభావుడు భూమ్మీద జన్మించి పడిపోతున్న ధర్మాన్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. మహావిష్ణువు దశావతారాలను ధరించిందీ ఇందుకే. అయితే, జగతి పరిణామక్రమంలో యుగాలు మారుతున్న కొద్దీ భగవం తునికీ మనిషికీ మధ్య అంతరం పెరిగిపోతోందేమో ననిపిస్తుంది.
త్రేతాయుగంలో మనిషనేవాడు ఎలా ప్రవర్తించాలో స్వయంగా తానే ఆచరించి చూపించాడు పరమాత్మ. అదే ద్వాపరంలో దగ్గరుండి నరుని చేత చెప్పి చేయించాడు. మరీ కలియుగంలో అప్పటి మాదిరిగా చేసి చూపించేవాడూ లేడు. చెప్పి చేయించేవాడూ లేడు. దీన్నిబట్టి చూస్తే భగవంతుడు కూడా మానవలోకంపై చిన్న చూపు చూశాడేమోనని పిస్తుంది. చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు. నిజంగా భగవం తునికి మానవుడంటే ఎప్పుడూ చిన్నచూపు లేదు. ఇది కేవలం మనిషి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు మాత్రమే.
అహంభావం తప్ప ఆత్మార్పణం, అనుమానం తప్ప విశ్వాసం, తప్పించుకోవడం తప్ప అంకితభావం లోపించిన మనిషికి పరమాత్మ దర్శనం లభించమంటే ఎలా లభిస్తుంది? నిలువెల్లా స్వార్థాన్ని పులుము కుని నడవడమే తప్ప నిజాయితీగా ఎదుటివాణ్ని చూడడం ఎప్పుడైతే మానేసాడో అప్పుడే దైవంకూడా మనిషికి దూరంగా జరిగిపోయాడు. మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని విస్మరించిన మరుక్షణమే మనిషిలోని మాధవుడు కనుమరుగై వట్టి మనిషి మాత్రమే మిగిలాడు.
అలాంటి ఈ మనిషిని మామూలు మనిషిగానైనా మిగిల్చేందుకు కలియుగంలో ఇప్పటికి ఎందరో మహానుభావులు ప్రయత్నించారు. అలాటి మహిమాన్వితుల్లో అవతార్ మెహర్ బాబా ఒకరు.
ఆయనకుఏ ఆస్తిపాస్తులూ లేవు. బీదలకు, రోగులకు ఇవ్వటానికి తప్ప వేరే ఎప్పుడూ డబ్బు అంటుకోలేదు. మత సంబంధమైన ఎలాంటి కర్మకాండలనూ, ఆచారాలనూ ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. తన సందేశాన్ని విస్తరింప చేయడానికి ఆయన ఏ సంస్థనూ స్థాపించలేదు. ఏవిధమైన కోరిక, అసంతృప్తి లేకుండా నిష్కల్మషమైన హృదయంతో భగవంతుని కీర్తించటం ఒక్కటే నిజమైన ప్రార్థన అని పదే పదే చెప్పేవారు. ఆయనే ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రేమికుల చేత అవతారపురుషునిగా కీర్తింపబడుతున్న మెహెర్‌బాబా.
ఆధ్యాత్మికత అంటే కేవలం సర్వసంగ పరిత్యాగులకే పరిమితమైనదని భావించరాదన్నారు అవతార్ మెహెర్‌బాబా. మనం మన ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, జీవిత లక్ష్యమైన భగవదైక్యం పొందడానికి సాధనచేయాలని మెహెర్‌బాబా తన భక్తులకు అనేక సందేశాలలో ఉద్బోధించారు.
ఆధ్యాత్మికత సాధన మార్గంలో బాహ్యంగా అనేక భోగభాగ్యాలను త్యజించడమే కాదు అంతర్గతంగా కూడా ఐహిక వాంఛలపై మమకారం నశించాలని మెహెర్‌బాబా బోధించారు. మనం నిత్యం చూసే ఆకర్షణలన్నీ ఒక మిథ్య అని బాబా వర్ణించారు. ఆ ఆకర్ణణలు ఎంతటి శక్తివంతవైనా వాటికి లోబడక నిత్యజీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా ప్రాపంచిక విధులన్నిటినీ నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ భగవన్మార్గంలో పయనించాలని బాబా తన భక్తులకు సూచించారు.
మెహెర్‌బాబా మహారాష్టల్రోని పూణే పట్టణంలో 1894 ఫిబ్రవరి 25న జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మెర్వాన్. మొదట ఏర్పడ్డ శిష్యులు ఆయన్ని మెహెర్‌బాబా అని పిలిచారు. ఆ పేరే స్థిరపడింది. మెహెర్ అంటే దయగల, బాబా అంటే తండ్రి.
మెహెర్‌బాబా కాలంలో ఐదుగురు సద్గురువులు ఉండేవారు. వారు పూణేలో హజరత్ బాబాజాన్, నాగపూర్‌లో తాజుద్దీన్ బాబా, ఖేడ్గావ్‌లో నారాయణ్ మహరాజ్, సాకోరిలో ఉపాసినీ మహరాజ్, షిర్డీలో సాయిబాబా... వీరందరూ మెహెర్‌బాబాను భగవదవతార పురుషుడిగా గుర్తించారు. మొదట మెహెర్‌బాబాలో దివ్యత్వాన్ని మేల్కొల్పింది హజరత్ బాబాజాన్.
1921లో బాబా ఆధ్యాత్మిక కృషిని ప్రారంభించారు. శిష్యులు చాలా సులభంగా అతడిపట్ల ఆకర్షితులైనారు. కఠినమైన నియమనిష్ఠలతో, నిస్వార్థమైన సేవాభావంతో వారు జీవించేటట్లుగా అతడు వారికి తర్ఫీదు ఇచ్చాడు. నీతిగా నడుచుకోవడం, దైవం పట్ల ప్రేమ, ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం అబ్బేటట్లు వారిని తీర్చిదిద్దాడు. బాబా గట్టిగా శిష్యులకు శిక్షణ ఇచ్చిన తర్వాత మెహెర్‌బాబా, అహమద్‌నగర్ పొలిమేరల్లో ఒక నివాసాన్ని ఏర్పరచాడు. అదే మెహెరాబాద్ అనే పేరుతో పిలవబడుతోంది.
మెహెరాబాద్‌లో ఆయన చేసిన అనేక పనుల్లో బాలురకు ఉచిత పాఠశాల స్థాపించడం ఒకటి. అన్ని కులాలవారికి, అన్ని మతాలవారికి అందులో ప్రవేశం కల్పించారు. ఆధ్యాత్మిక విలువల్ని నిత్యజీవితంలో ఎలా సమన్వయ పరచాలో అక్కడ ముఖ్యంగా నేర్పేవారు. ఉచిత వైద్యశాల, ఉచిత ఔషధశాలలతోబాటు, వేరేచోట్ల నుండి అక్కడకు వచ్చే బీదాబిక్కి జనం ఉండటానికి నీడ కూడా ఏర్పరిచారు. ‘అత్యంత ఆచరణాత్మకమైన పని ప్రపంచంలో ఏదైనా ఉన్నదీ అంటే అది ఆధ్యాత్మిక భావనతో కూడిన పని మాత్రమే’ అనేది ఆయన భావన. అదే అప్పుడు జరిగిన అన్నింటికీ మూలసూత్రంగా పని చేసింది. వ్యక్తుల మధ్య తేడాలు లేకుండా అక్కడ ఉన్న అందరూ సమానమనే భావనతో మెలిగారు. గురువు కల్గించిన ఉత్తేజం వల్లనే ఇది సాధ్యపడింది.
1925 జులై 10 నుండి బాబా మౌనం పాటించారు. ఆరోజు నుండి దేహత్యాగం వరకు 44 సంవత్సరాలపాటు నిరాఘాటంగా పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. అట్లా ఉన్నా, ఆ 44 సంవత్సరాలూ ఎన్నో కార్యాలు చేస్తూ చురుకుగా ఉంటూ ఎప్పుడూ వ్యక్తులతో, పెద్ద పెద్ద జనసమూహాలతో తన భావాలు వ్యక్తీకరిస్తుండేవారు. మొదట్లో ఆయన తన సందేశాలు ఇంగ్లీషు అక్షరమాల ఉన్న చెక్క పలకల ద్వారానూ, తరువాత విలక్షణమైన చేతి సౌంజ్ఞలద్వారా తెలియబరచేవారు.
మెహెర్‌బాబా ఎలాంటి ప్రచార ఆర్భాటాలకూ తావివ్వలేదు. ‘‘నేను మీ హృదయాల్లో ప్రేమ బీజం నాటేందుకు వచ్చాను. అలా చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లోనూ, మతసిద్ధాంతాల్లోనూ, మతశాఖల్లోనూ, కులాల్లోనూ ఏకత్వభావన కలుగుతుంది. ఆ ఏకత్వ భావన ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది’’ అని వారు చెప్పేవారు. కుష్టురోగులకు స్నానం చేయించటం, వేలమంది బీదలకి తిండి, బట్ట ఇవ్వడంతోబాటు మధ్యమధ్యలో చాలాసార్లు పడమటి దేశాలు అనేకం చుట్టి వచ్చారు.
వారు వీరు అని కాకుండా బాబా అందరితోనూ కలిసి మెలిసి ఉండేవారు. వివాహితులు, అవివాహితులు, ధనికులు, పేదలు, పండితులు, పామరులు, బాబా మీద విశ్వాసం ఉండటం, లేకపోవటం అనేదానితో సంబంధం లేకుండా ఎంతోమంది బాబా నిరాడంబరత్వానికీ, ఉల్లాసానికీ, స్వార్థరాహిత్యానికీ ఆకర్షితులయ్యేవారు. ప్రజలకు వారు అన్నింటికంటే ఎక్కువసార్లు చెప్పే మాటలు ఏవంటే- ‘‘హృదయం నిండుగా భగవంతుని ప్రార్థించండి. ఆందోళన పడకండి. హాయిగా ఉండండి’’.
నిస్వార్థ ప్రేమ అంటే ఏమిటో వారు తమ జీవితం ద్వారా నిరూపించి చూపడమే కాక, ఇతరుల్ని కూడా ఆ విధమైన ప్రేమతో ఉండే విధంగా ప్రోత్సహించేవారు.
తను ఏ మతానికీ చెందిన వాడిని కాననీ, అన్ని మతాలు తనకు చెందినవేననీ, అదేవిధంగా అన్ని మతాల సారం ఒక్కటేననీ, కాబట్టి ఎవరూ తమ తమ మతాలను మార్చుకోనవసరం లేదనీ చెప్పేవారు. ఇంకా ఇలా చెప్పేవారు. ‘‘భగవంతుడు ఒక్కడే. భగవదవతార పురుషులైన జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, ముహమ్మద్ అందరూ ఒక్కటే. సత్యాన్ని వివిధ రీతుల్లో, వివిధ భాషల్లో ఆవిష్కరించటానికి ఆ ఒక్క భగవంతుడే వివిధ కాలాలలో, వివిధ దేశాలలో వివిధ పేర్లతో అవతరిస్తాడు’’.
అవతార పురుషుడుగా మెహెర్‌బాబా తన లక్ష్యాన్ని ఈ విధంగా నిర్దేశించారు. ‘‘ఒక ప్రత్యేక పూజావిధానాన్ని గాని, ఒక సంఘాన్ని గాని, సంస్థను గాని స్థాపించటానికి నేను రాలేదు. ఒక కొత్తమతాన్ని స్థాపించటానికి కూడా నే ను రాలేదు. నేను చెప్పే మతం అనేకంగా కన్పించే వాటి వెనుక ఉన్న ఏకత్వాన్ని తెలియపరుస్తుంది. నేను ప్రజల చేత చదివింప చేసే గ్రంథం హృదయానికి సంబంధించినది. ఆ గ్రంథం జీవన రహస్యాన్ని తెరిచి చూడటానికి తాళం చెవిలాంటిది. నేను మెదడు, హృదయం ఒక దానితో ఒకటి సమపాళ్లలో చక్కగా కలిసిపోయేటట్టు చేస్తాను. అన్ని మతాల్ని, శాఖల్ని మళ్లీ ప్రాణవంతం చే సి ఒకే తీగె మీద ఉన్న పూసల్లా వాటినన్నింటిని దగ్గరకు తెస్తాను.’’
1969 జనవరి 31నాడు మెహెర్‌బాబా తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టారు. నాటినుండి మహారాష్టలోని అహమద్‌నగర్‌కు దగ్గరలో ఉన్న మెహెరాబాద్‌లోని చిన్నకొండమీద గల వారి సమాధి మందిరానికి వేలకు వేల భక్తులు వివిధ దేశాలనుండి వస్తున్నారు. వారిని తమ దివ్య ప్రియతమునిగా, రక్షకుడిగా ఒప్పుకుంటున్నారు. నిత్యజీవితంలో తాము కోరుకునే శాశ్వత సత్యాన్ని వారు మెహెర్‌బాబాలో చూస్తున్నారు.
- - దీవి సుబ్బారావు(సాక్షి దినపత్రిక సౌజన్యముతో)
- ================================
No comments:
Post a Comment