జీవితాన్ని, ప్రపంచాన్ని ఒక మాయగా, ఒక అసత్యంగా, ఒక భ్రమగా చిత్రీకరిస్తూ జీవితం విసిరే సవాళ్ల నుంచి పలాయనం చిత్తగించడాన్ని మనకు నేర్పుతూ అదే వేదాంతంగా భ్రమింపజేస్తూ వచ్చారు మన పూర్వీకులు . సమాజం అనుభవిస్తున్న పేదరికానికి, వేదనలకు అసలైన కారణాన్ని అన్వేషించాల్సి ఉంది. సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దీనికి శాస్త్రీయ దృక్పథం అవసరం.
పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాం... అందుకే ఇప్పుడిలా కష్టపడుతున్నాం.... జీవితంలో అనుభవిస్తున్న కష్టాలకు, వేదనకు, బాధలకు కారణం గతజన్మలో మనం చేసిన పాపపుణ్య కర్మలేనంటూ కష్టాలతో సర్దుకుపోతుంటాం. మనుషులు ఇలా తామనుభవిస్తున్న కష్టనష్టాలను 'కర్మ'కు వదిలేస్తూ జీవితం అంటే ఓ మాయ అని వ్యాఖ్యానించడమనేది అర్థం పర్థం లేని వాదనలంటారు రజనీష్. ఈ వాదనలన్నీ మన సమాజంలో వేదాంతంగా చెలామణి అవుతూ ఉండటం దురదృష్టమంటారు.
ఇలా... జీవిత సమస్యల పట్ల మన వైఖరి అసమంజసంగా ఉంటుంది. ఇలా మాట్లాడటమంటే జీవిత సత్యాన్ని నిరాకరించడమేనంటారాయన. జీవితం విసురుతున్న సవాళ్లను స్వీకరించలేనివారు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వీరివద్ద వాటిని పరిష్కరించే శాస్త్రీయ దృక్పథం ఉండదంటారు రజనీష్. వేల సంవత్సరాలుగా మనుషుల వైఖరి ఇలాగే ఉంటోంది. లక్షలాది ప్రజలు పేదరికంలో మగ్గడానికి కారణం వారు గత జన్మలో చేసిన పాపకర్మలేనంటూ చేతులు దులిపేసుకుంటున్నాం.
గత జన్మలోచేసిన కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కదా అనేది అత్యంత సులువైన వాదన. వచ్చే జన్మలో సుఖాలను అనుభవించాలంటే ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం తప్ప మరో మార్గం లేదు అనేది ఇలాంటి వారి వాదనగా ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలే జీవిత సత్యాలుగా సమాజంలో పెంచి పోషించబడ్డాయి. ఇలా మనుషులు వేదనలను స్వీకరించడమే తప్ప మార్పును తీసుకురావడం ఎలాగో ఆలోచించలేదు. ప్రతీదాన్ని 'కర్మ'కు వదిలేయడం సులభం కాబట్టి దీనికి అలవాటు పడిపోయాం.
సవాళ్లను అధిగమిస్తేనే విముక్తి
చరిత్రలో పరిస్థితులను సమూలంగా మార్చాలని ప్రయత్నించినవారు సంఘ విద్రోహులుగా చిత్రీకరించబడటం దురదృష్టకరమంటారు రజనీష్. వేల సంవత్సరాలుగా మనుషుల అర్థం పర్థం లేని కర్మసిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడేవారు. మతం దృష్టిలోను ,సమాజం దృష్టిలోను దుర్మార్గులుగా ముద్రపడిపోతుంటారు. మనుషుల జీవితాలను మార్చాలంటే సమాజంలో పాతుకుపోయిన అసమంజస, అశాస్త్రీయ భావనలను తొలగించాల్సి ఉంటుంది.
ఈ ప్రయత్నంలో కొందరి మనోభావాలు దెబ్బతినవచ్చు. చాలామంది తమ జీవితంలోని దుఃఖాలను, వేదనను ఒక మాయగా చిత్రీకరిస్తుంటారు. కర్మసిద్ధాంతం పేరుతో వారు ఇంకా చేయగలిగేదేముంది? జీవితం వారికి దేవుడు ఆడుతున్న నాటకంలాగానో... ఒక స్వప్నం లాగానో అగుపిస్తుంది తప్ప.. జీవితాన్ని వారు యదార్థంగా స్వీకరించలేరు. జీవితం వారికి అసత్యంలా గోచరిస్తుంది. కష్టాలను భరించలేనివారు మద్యానికి బానిసలవుతుంటారు.
అప్పుడు కష్టాలు వారికి ఒక స్వప్నంలా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితే సమాజంలోను ఉందంటారు రజనీష్. జీవితాన్ని, ప్రపంచాన్ని ఒక మాయగా, ఒక అసత్యంగా, ఒక భ్రమగా చిత్రీకరిస్తూ జీవితం విసిరే సవాళ్ల నుంచి పలాయనం చిత్తగించడాన్ని మనకు నేర్పుతూ అదే వేదాంతంగా భ్రమింపజేస్తూ వచ్చారు. సమాజం అనుభవిస్తున్న పేదరికానికి, వేదనలకు అసలైన కారణాన్ని అన్వేషించాల్సి ఉంది. సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దీనికి శాస్త్రీయ దృక్పథం అవసరం. జీవితాన్ని యదార్థంగా స్వీకరించినప్పుడు మాత్రమే బాధల నుంచి, దుఃఖం నుంచి విముక్తిని పొందగలమంటారు రజనీష్.
- ==========================================
No comments:
Post a Comment