చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు. ఏదైనా వరం కోరుకోమ్మన్నాడు. ఆరోజు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ని కోరింది. ప్రతిఏటా కార్తీక శుద్ధ విదియను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ, ప్రతిఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతివంట తిని, వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు. లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోకభయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో- ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు.
పురాణగాథలను అనుసరించి యముడికి, యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీకమాసం రెండోరోజు విదియనాడు జరిగింది కాబట్టి, దాన్ని 'యమద్వితీయ'గా పాటించటం ఆనవాయితీ అయింది. స్మృతికౌస్తుభం దీన్ని యమద్వితీయగానే ప్రకటించింది. సోదరుడిపట్ల సోదరి ప్రేమకు ప్రతీకగా- దీన్ని 'భ్రాతృవిదియ'గా పరిగణించడమూ పరిపాటి అయింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది. ఆమె చేతివంటకు ప్రత్యేకతను, పవిత్రతను ఆపాదిస్తూ 'భగినీ హస్తాన్న భోజనం' అని పిలవడం లోకంలో సంప్రదాయంగా స్థిరపడింది.
అక్కచెల్లెళ్ళ ఇళ్ళల్లో సంతోషానందాలు పంచిన కారణంగా- అన్నాతమ్ముళ్ల ఇళ్ళల్లో సుఖశాంతులు లంగరు ఎలా వేస్తాయన్నది- తర్కానికి అందే విషయం కాదు, అనుభవానికి చెందిన విషయమిది. భ్రాతృద్వితీయను శ్రద్ధగా పాటిస్తున్నవారి విషయం పరిశీలిస్తే- ఆ సౌభాగ్యపు ఛాయలు గోచరిస్తాయి తప్ప, వితర్కాలతో కాలక్షేపం చేస్తే- ఇవ్వడంలో ఉండే ఆనందం అనుభవానికి రాదు. పంచదారను చూస్తే తీపి తెలుస్తుందా... చప్పరిస్తే తెలుస్తుంది గాని!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
- ===============================================
No comments:
Post a Comment