Monday, November 1, 2010

భాద్రపదమాస విశిస్టత , Bhadrapada maasam Importent



భాద్రపదమాస విశిస్టత / - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

వర్షరుతువులో వచ్చే భాద్రపదం శుభప్రద మాసం. విష్ణుప్రీతికరమైన ఈ మాసం స్త్రీల వ్రతాలకూ పర్వాలకూ నెలవు. భాద్రపద శుక్ల తృతీయ హరితాళికావ్రతం. కన్యలు అనుకూల భర్తల కోసం పార్వతీపరమేశ్వరుల పూజ, ఉపవాసం ఆచరిస్తారు. శుక్లచతుర్థి గణేశచతుర్థి. ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుని పూజించడం సంప్రదాయం. శుక్లచతుర్థిలో చంద్రుని చూస్తే మిథ్యాపవాదం కలుగుతుందని నమ్మకం.

ఈ మాసంలో శుక్లపంచమి సప్తర్షులను ఉద్దేశించి చేసే వ్రతం. రుషులతో బాటు వసిష్ఠుని భార్య అరుంధతినీ అర్చిస్తారు. సర్వపాప విముక్తికోసం ఈ వ్రతం చేయాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఆ మరునాడు సూర్యషష్ఠి. సప్తమితో కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. ఆ రోజున పంచామృత సేవనం చేస్తే అశ్వమేధంకన్నా ఎక్కువ ఫలం కలుగుతుందని పండితులు చెబుతారు. ఆ రోజున కుమారస్వామి దర్శనం బ్రహ్మహత్యాపాపాన్నీ నశింపజేస్తుందని నమ్మకం.

శుక్ల అష్టమినాడు కేదారేశ్వరవ్రతం ఆచరిస్తారు. గౌతమ మహర్షి ఉపదేశాన్ని అనుసరించి పార్వతి ఈ వ్రతం ఆచరించి శివుని అర్ధాంగి అయిందంటారు.

భాద్రపద శుక్ల ఏకాదశి పరివర్తన్యేకాదశి. చాతుర్మాస్యంలో ఇది ఒక మలుపు. ఆషాఢంలో నిద్రకు ఉపక్రమించిన విష్ణువు ఈ ఏకాదశినాడు ఎడమనుంచి కుడికి తిరగడమే పరివర్తనం. ఈ ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే కరవు కాటకాలుండవని విశ్వాసం. కృతయుగంలో ఆంగీరసముని సూచనపై మాంధాత అనే రాజు ఈ ఏకాదశిని ఆచరించాడని పురాణ కథనం.

భాద్రపద మాసంలోనే వామన జయంతి. శ్రవణానక్షత్రయుక్తమైన ద్వాదశి వామన ద్వాదశి. వామనుడు త్రివిక్రముడు. విష్ణురూప, తైజరూప, ప్రాజ్ఞరూపాలు వామనుడి మూడు పాదాలు. వామనుడు భూమ్యాకాశాలను తన రెండు పాదాలతో ఆవరించి మూడో పాదంతో రాక్షసరాజు బలిని రసాతలానికి అణగదొక్కినట్లు భాగవత పురాణం.

భాద్రపద శుక్ల చతుర్దశి అనంతపద్మనాభ వ్రతం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతవిధానాన్ని వివరించినట్లు భవిష్యోత్తరం చెబుతోంది. ఇరవై నాలుగు ముడులుగల తోరం ధరించి ఈ వ్రతం చేస్తారు. దర్భలనే అనంతుడిగా పూజిస్తారు.

ఈ మాసంలో శుక్లపక్షం దేవతాపూజలు, వ్రతాలకు సంబంధించినదైతే- కృష్ణపక్షం పితృదేవతలకు ప్రాధాన్యంగలది. దీన్ని మహాలయ పక్షమంటారు. ఇవి పితృదేవతలకు తర్పణాలు విడవడానికి ముఖ్యమైన దినాలు. మహాలయమనగా గొప్ప వినాశనం. ఈ దినాల్లో పితృకర్మల గురించి మనుస్మృతి, ఆపస్తంబ సూత్రాల్లో వివరించారు.


  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: