Friday, September 10, 2010

హేరంబ గణపతి , Heramba ganapathi




మానవాళికి పాపాల వల్ల దుఃఖం కలుగుతుంది. తెలిసో తెలియకో పాపం చేసి భరించరాని ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక ఆ పాపాలను చెయ్యబోము, మరి మాకు తరుణోపాయమేది అని చాలా మంది ఆర్తితో ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి దుఃఖాన్ని పోగొట్టుకొనేందుకు తగిన సాధనంగా హేరంబోపనిషత్‌ కనిపిస్తుంది. గణపతి రూపాలలో హేరంబ గణపతి అనే ఓ రూపం ఉంటుంది. ఈ రూపంలోని స్వామిని ఆరాధిస్తే కలిగే మేలు అంతా ఇంతా కాదు. హేరంబ గణపతికి పది చేతులుంటాయి. అభయముద్ర, వరదముద్ర, పాశం, దంతం, రుద్రాక్షమాల, పాశం, గొడ్డలి, ముద్గరం, దండం, పద్మాలను ఆ చేతులతో ధరించి ఉంటాడు. తొండంతో మోదకాన్ని ధరించి సింహ వాహనాన్ని ఎక్కి ఉంటాడు. ఈ స్వామికి ఐదు గజ ముఖాలుంటాయి. ఈ స్వామిని ధ్యానిస్తే సర్వ శుభాలు, విజయాలు చేజిక్కుతాయి.

ఈ విషయాన్ని హేరంబోపనిషత్‌ ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు. ప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందగలవు? దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి అడిగినప్పుడు శివుడు తన అనుభవంలోకి వచ్చిన విషయాన్నే ఆమెకు వివరించి చెప్పాడు. పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు. తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు. అప్పుడు హేరంబ గణపతిని ధ్యానించి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు. ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది. బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు కూడా హేరంబ గణపతి రక్ష వల్లనే తమ తమ స్థానాలలో సుఖంగా ఉండగలుగుతున్నారు. ఈ కారణం వల్లే తొలివేల్పుగా, సర్వదేవతా పూజనీయుడిగా గణేశుడు వెలుగొందుతున్నాడు. ఈ విఘ్నరాజు ప్రభువులకే ప్రభువు. ఆయనను ఉపాసించి సంసార సాగరం నుంచి, కష్టాల కడలి నుంచి సుఖంగా బయటపడవచ్చని శివుడు పార్వతికి తెలియచెప్పాడు. గణపతి సిందూర వర్ణంతో అలరారుతుంటాడు. ఆయన అతి పురాతనుడు. ఆ స్వామి పక్కన లక్ష్మి ఉంటుంది. ఆయనను పూజించినా, ధ్యానించినా సర్వ శుభాలూ సమకూరుతాయి. ఆయన వల్లనే మునులు కూడా సంసార సాగరాన్ని దాటగలుగుతున్నారు. ఆయనే బ్రహ్మ. ఆయనే హరి. ఇంద్రుడు, చంద్రుడు, పరమాత్మ, సమస్త జగత్తుకూ సాక్షి కూడా ఆయనే. మానవాళి దుఃఖాలను పోగొట్టుకోవటం కోసం ఆ స్వామిని పూజించటం కంటే సులభమైన మార్గం మరొకటి లేదు. అపమృత్యువు లాంటి భయాలు తొలగిపోతాయి. మాయమైన శరీరాన్ని ధరించి ఆ హేరంబుడు అందరినీ సమ్మోహనపరుస్తుంటాడు. ఆ గణేశుడొక్కడే అనేక రూపాలను ధరిస్తూ అనేకానేక కార్యాలను ఆచరిస్తుంటాడు. ఆ దంతి ముఖుడు అనంత శక్తిమయుడు. ఆ స్వామి 'నేను లంబోదరుడిని, నేను పురుషోత్తముడిని, నేను విఘ్ననాశకుడిని, నేను విజయాత్మకుడను, నేను గజాననుడిని, నాకు నమస్కరించే వారికి నేను సిద్ధిని కలుగచేస్తాను. కుమారస్వామికి అన్నను, ఈ సమస్తమూ కూడా నేనే' అని తనను దరిచేరిన వారికి అభయమిస్తుంటాడు. కనుక హేరంబుడిని పూజించటం ఎంతో మేలు. హేరంబ ఉపనిషత్తును పఠించిన వారికి దుఃఖాలు తొలగి, పాపాలు నశించి కోరికలన్నీ ఈడేరతాయి. అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు. గణేశుడి నామాలను పఠించేటప్పుడు హేరంబాయనమః అని కనిపిస్తుంది. ఆ హేరంబ గణపతి విశిష్టత ఇక్కడ ఇలా ప్రస్తావితమై ఉంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు





  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: