Wednesday, September 15, 2010

హయగ్రీవ జయంతి , Hayagreeva Jayanthi



సృష్టిలోని సమస్త జీవులకూ దైవత్వాన్ని కల్పించి అర్చించిన, ఆరాధించిన గొప్ప సంస్కృతి మనది. మన దృష్టిలో నేల, నింగి, గాలి, నిప్పు, నీరు, చెట్లు, పర్వతాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు- ఒకటేమిటి? అది కాదు, ఇది ఔను అని లేకుండా అన్నీ భగవత్‌ స్వరూపాలే!

ఈ రోజు హయగ్రీవ జయంతి. మహావిష్ణువు హయగ్రీవుడిగా- గుఱ్ఱపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్యదినం. ఈ వృత్తాంతాన్ని దేవీభాగవతంలోని ప్రథమ స్కంధం చక్కగా వివరించింది.

ఒకానొక సమయంలో మహావిష్ణువు రాక్షసవీరులతో పదివేల సంవత్సరాలపాటు భీకరంగా యుద్ధం చేసి అలసిపోయాడు. అల్లెతాడు గట్టిగా బిగించి ఉన్న శార్‌ఞ్గం అనే తన ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద తన గడ్డాన్ని ఆనించి నిలబడే నిద్రపోయాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని వెతుకుతూ అక్కడికి వచ్చిన దేవతలు అతడిని నిద్రలేపటానికి జంకారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వమ్రిని (చెదపురుగును) సృష్టించి ఆ వింటినారిని కొరకవలసిందిగా చెప్పాడు. 'నిద్రపోతున్నవారిని లేపటం బ్రహ్మహత్యతో సమానమైన పాపం కనుక నేను ఆ పనిని చేయను' అన్నది వమ్రి. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు 'అగ్నిహోత్రంలో హవిస్సును వేసే సమయంలో పక్కన పడినదాన్ని నీకు ఆహారంగా ఇస్తాను. ఈ దైవకార్యాన్ని చేయి!' అన్నాడు. ఆ పవిత్రాన్నం తనకు దొరుకుతున్నందుకు వమ్రి ఎంతగానో సంతోషించి ఆ నారిని కొరికింది. దానితో ఆ ధనుస్సు విసురుగా తుళ్లి, ఆ వింటికోపు విష్ణుమూర్తి మెడకు తగిలి అతడి శిరస్సు తెగి, ఎగిరి ఎక్కడో పడ్డది. ఈ తల తెగటానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే కారణం కావటం మరొక విశేషం. అనుకోకుండా జరిగిన ఈ దారుణానికి దేవతలు చాలా బాధపడ్డారు. బ్రహ్మదేవుడు వారినోదార్చి మహాదేవిని ధ్యానించ వలసిందిగా సూచించాడు. వారు అట్లాగే చేశారు. ఆమె ప్రత్యక్షమైంది. దేవతలందరూ కలిసి ఆమె సూచించిన విధంగానే ఒక గుర్రాన్ని వధించి, దాని తల తీసుకు వచ్చారు. దేవశిల్పియైన త్వష్ట దాన్ని విష్ణుమూర్తి మొండానికి అతికించాడు. బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. ఆ విధంగా విష్ణుమూర్తి హయగ్రీవుడైనాడు.

హయగ్రీవుడు అనే రాక్షసుడున్నాడు. అతడు దేవికోసం తపస్సు చేసి, తాను మరణం లేకుండా చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని కోరాడు. ఆమె కుదరదన్నది. అతడు తనవంటి ఆకారం కలవాడి చేతిలోనే మరణించే విధంగా వరాన్ని ఇమ్మని అడిగి దాన్ని పొందాడు. ఆమె 'సరే!' అని అంతర్థానం చెందింది. ఆ వరగర్వంతో అతడు చతుర్దశ భువనాలనూ హింసించసాగాడు. ఇతడిని వధించటానికే విష్ణుమూర్తి ఇంతకు ముందు మనం చెప్పుకొన్న విధంగా హయగ్రీవుడైనాడు.

హయగ్రీవుడు చంద్రమండల నివాసి, మహానంద స్వరూపుడు. ప్రకృష్ట ప్రజ్ఞాశాలి. అతడి నాసిక నుంచే వేదాలు ఆవిర్భవించాయని పురాణగాథ. ఆయన విరాట్‌ స్వరూపాన్ని ధరించినప్పుడు- సత్యలోకం అతడికి శిరస్సు. భూలోకం నాభి. పాతాళం పాదాలు. అంతరిక్షం కన్ను. సూర్యుడు కంటి గుడ్డు. చంద్రుడు గుండె. దిక్పాలకులు భుజాలు. అగ్ని ముఖం. సముద్రాలు ఉదరం. నదులు నాడులు. పర్వతాలు ఎముకలు. మేఘాలు కేశాలు. అంటే హయగ్రీవుడు సమస్త దేవతా స్వరూపుడని తాత్పర్యం.

హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. అతడు లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. అతడి పై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడిచేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్‌ సృష్టికి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన సంహారానికీ చిహ్నాలు. కనుక హయగ్రీవుడిని ఉపాసించినవారికి పైన తెలిపిన ఐశ్వర్యాదులన్నీ కరతలామలకాలని తాత్పర్యం.

'హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ' అంటూ ఎవరైతే హయగ్రీవ నామాన్ని జపిస్తుంటాడో వారికి జహ్నుకన్య అయిన గంగానదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది లభిస్తుందని రుషి వచనం. అందువల్లనే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం ఏర్పడింది.

ఏ దేవతకైనా అతని నామమే అతడి శరీరం. ఆ నామంలోని అక్షరాలే అతడి అవయవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది.

హయగ్రీవనామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించినవాడు శివస్వరూపుడవుతాడంతారు. పలికినవాడు విష్ణుస్వరూపుడవుతాడనీ విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడవుతాడన్నాడట బ్రహ్మదేవుడు స్వయంగా. హయగ్రీవ నామం అంత విశిష్టమైనది.

- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: