Monday, June 28, 2010

మానసిక ఒత్తిడిని తట్టుకొనే మార్గం , Way to face mental Stress




మనలో చాలామంది ఎంతో విజ్ఞానమున్నప్పటికీ, నిజజీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన జ్ఞానంలేక ఒత్తిడి నుంచి విముక్తి పొందలేకపోతున్నారు.
మనకు సంస్కృతం తెలిసి ఉండవచ్చు, భౌతిక శాస్త్రం తెలిసి ఉండవచ్చు. బోటనీ తెలియవచ్చు. కాని మనకు దుఃఖసముద్రాన్ని దాటడం లేదా ఒత్తిడిని తట్టుకొనడం తెలియకపోతే, ఇతర పాండిత్యం ఎందుకూ కొరగాదు.

ఒత్తిడిని తట్టుకుని ఒక పకడ్బందీ యోగిగా ఉండగలగడం ఎలాగో తెలుసుకుందాం.

యోగశాస్త్ర రంగంలో ఒత్తిడిని నిర్వహించడానికి మూడు ముఖ్యమైన వాస్తవికతలు ఉన్నాయి:
బాహ్య వాస్తవికత, అంతర్గత వాస్తవికత, భావాతీత వాస్తవికత.
బాహ్య వాస్తవికత వస్తు ప్రపంచానికి సంబంధించినది.
అంతర్గత వాస్తవికత భావ ప్రపంచానికి సంబంధించినది.
యోగ శాస్త్రంలో చెప్పే భావాతీత వాస్తవికత వస్తువులకు, తలపులకు అతీతమైనది.

మనలో చాలామంది ఈ వస్తుప్రపంచంలో- బాహ్య వాస్తవికతలో, అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే వాస్తవికతలో బతుకుతున్నాం. ఆనందంగా ఉండటానికి మనమింకా ఎక్కువ వస్తువులను, బాహ్య ప్రపంచంలో లౌకికపరమైన విషయాలను ఇంకా ఎక్కువగా చేర్చుకోవాలని భావిస్తాం. ప్రాపంచిక వస్తువులు చేరడంతో మనం ఒత్తిడి నుంచి విముక్తులమవుతామని, మన సుఖసంతోషాలు ఎక్కువవుతాయని తలుస్తాము. అందుకే విజయం సాధించడానికి తీరుబడి లేకుండా ప్రయత్నిస్తాం. మనం ఈ విషయంలో లోతుగా ఆలోచిస్తే, ఒక వ్యక్తి విజయం సాధించవచ్చునేమోగాని సంతృప్తి చెందగలడనలేము. మనం ఎన్నో వస్తువులను సంపాదించుకోగలమేమో గానీ అవి తెలివిగా వినియోగించకపోతే మనకు తృప్తినీయలేవు. అందుకే ఈ బాహ్య వాస్తవికత అన్నది వస్తు ప్రపంచం.
మనుషులకు అందమైన బంగళాలు ఉండవచ్చు. బయటికి ఎంతో సౌఖ్యంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ అంతరంగంలో తలపుల ఉద్వేగంతో, అస్తవ్యస్తంగా ఉంటే వాళ్లు అసౌకర్యంగా ఉన్నట్టే లెక్క. బయట మనం చూసే ప్రపంచం మనలోపల కూడా చూడగలమని యోగశాస్త్రం మనకు తెలుపుతోంది. అందుకే అంతర్గతంగా మనం సరియైన విధంగా శక్తిమంతులం కాకపోతే, వివేకంతో మనం మనల్ని పరిస్థితులకు అనుగుణంగా మలచుకొనకపోతే ఈ వస్తు ప్రపంచం మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. మనకు ఒత్తిడి నుంచి విముక్తిని ఇవ్వదు.
  • ===================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: