Monday, June 28, 2010

మనసె దేవుడు , Mind is the God

మనసు అనేది భగవంతుడు మానవుడికి ప్రసాదించిన మహావరం. మనసును మంచిమార్గంలో పెట్టుకుంటే జీవితం పూలబాటే. లేకుంటే నరకప్రాయమే. మనస్సు నిర్మలంగా ఉంటే ఆలోచనలూ బాగుంటాయి. ఎదుటివారిలో సద్గుణాలు చూడటం అలవాటు చేసుకుంటే మన మనస్సులోనూ సద్గుణాలే స్థిరంగా ఉంటాయి. ఎదుటివారి దుర్గుణాలను పర్వతమంతటివైనా ఆవగింజంతటివిగాను, మనలోని దోషాలను ఆవగింజంతటివైనా పర్వతమంతటివిగా భావించి పశ్చాత్తాపపడి, జాగరూకత వహించే సంస్కారాన్ని అలవరచుకోవాలి. మానవ హృదయం మహాసాగరం. స్పందనలు, అనుభూతులు, భావాలకు నెలవు. చీకట్లను పారద్రోలే వెలుగులకు కొలువు. బుద్ధిననుసరించి మనస్సు నడచుకోవాలి. లేకపోతే అనాలోచితమైన, ఆవేశపూరితమైన ఆలోచనలతో మనసు సంక్షుభితమైపోతుంది. అందుచేత మంచినే ఆలోచించాలి. మంచినే మాట్లాడాలి. మంచినే చేయాలి.

'ప్రమాదో ధీమతామపి' అన్నారు కదా! తప్పనేది ఎంత పెద్దవాళ్లయినా జరిగిపోవడం సహజం. సంస్కారవంతుడు దాన్ని క్షమిస్తాడు. ఆ క్షమాగుణం మనసులో ఆవిర్భవించాలి. ప్రేమ, కరుణ, క్షమ, సహనం, సంయమనం మనసులో నెలకొన్ననాడు వ్యక్తిత్వం వికాసోన్ముఖం అవుతుంది. ఆంతరిక జీవనం సుఖమయం కావడం ఆరంభమవుతుంది. భగవత్కధా శ్రవణం మనస్సుకా పరిణతినందిస్తుంది.

సకల యజ్ఞాలు చెయ్యడం వల్ల, సకల దానాల వల్ల ఏ ఫలం లభిస్తుందో, ఆ ఫలం భక్తి పూర్వకంగా భగవంతుని కథను విన్నంతమాత్రానే లభిస్తుందంటారు. మనస్సులో బద్ధకానికి తావీయకూడదు. దాన్ని మించిన శత్రువు లేదు. 'సోమరితనం వల్ల విద్య, బలం, బుద్ధి నశించిపోతాయి. అందువల్ల దాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి' అంటాడు కబీర్‌దాసు. అలక్ష్యమే ప్రత్యక్ష మృత్యువు. కనుక దాన్ని మనసులోనికి రానీయకూడదు. కోరికలు తీరుతున్నకొద్దీ భౌతిక అవసరాలమీద ఆకలీ పెరుగుతుంటుంది. సంతృప్తి కలగదు. ఫలితంగా దుఃఖానికి అంతు లేకుండాపోతుంటుంది. శాశ్వతమైన కోరిక ఒక్కదానికే మన మనసులలో పెద్దపీట వేయాలి. అదే భగవచ్ఛింతన. తెలివితేటలకంటే మంచి మనసుతోనే సమాజానికి చేరువ కాగలమంటాడు 'బ్రయిరే' అనే శాస్త్రవేత్త. ఉన్న సంపదతో సంతృప్తి చెందటం ఎంత మంచిదో ఉన్న జ్ఞానంతో తృప్తి పడటం అంత అవివేకమని మన మనస్సు గ్రహించిననాడు జిజ్ఞాస పెరగడమూ, సాఫల్య సిద్ధి చేకూరడమూ సాధ్యమవుతుంది. 'మనకు పెట్టనికోట మనసే. అది దెబ్బతింటే జీవిత సమరంలో ఓడిపోతాం' అంటారు రాజాజీ. చంచల మనస్కులు వాళ్లు బాధపడటమే కాక తోటివారినీ ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. తలనీలాలిస్తే భగవంతుడు దొరుకుతాడంటే నేను వందలసార్లు జుట్టిస్తాను. తలను కాదు శుభ్రం చేయవలసింది. మనస్సును శుద్ధిచేస్తేనే కాని అందులోని మనోవికారాలన్నీ 'దూరంకావు' అంటాడు కబీరు. 'తలలు బోడులైన తలపులు బోడులా' అంటూ వేమన కూడా ఇదే చెప్పాడు. 'అహం' అంకురిస్తే ఆ వ్యాధికి చికిత్సే లేదు. అందుకే దాన్ని మనస్సు దరిదాపులకి రానీయకూడదు. మనసే మనుషుల బంధనానికి, మోక్షానికి కారణమని గీతాకారుడు చెప్పాడు. అన్ని ప్రాణుల శ్రేయస్సును కోరుకునేవాడి హృదయం నిర్మల దర్పణమై శోభిల్లుతుంది. ఎవడు ముఖం చూసుకున్నా అందులో ప్రేమే కనబడుతుంది, జాలే కనబడుతుంది. భూషణదూషణలను సమంగా భావించే పండితుల సమవర్తిత్వం, ఉదాత్తచిత్తం సాధించలేనివంటూ ఉండదు. మహానుభావులైన మహర్షులు, యోగులు, పండితులు ఎందరో మనస్సును నియంత్రించి, మనోవికారాలను, అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, ప్రగాఢమైన సంకల్పబలంతో జాతికి ఆదర్శవంతులై యశోశిఖరాలకు చేరుకుని భరతభూమి ప్రఖ్యాతిని ఇనుమడింపజేశారు.

ఎవరి మనస్సు చల్లగా, పవిత్రంగా ఉంటుందో వాళ్లకు లోకంలో శత్రువులే ఉండరు. అటువంటి వాళ్లకు మనస్సు ముక్తిద్వారాన్నే చూపుతుంది. ధ్యానయోగాభ్యాసాలు మనస్సుకు అపారమైన శాంతి చేకూరుస్తాయి.

'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ అన్నివిధాలైన బాధల నుంచి విముక్తి పొందాలి' అన్న పావన భావన మనస్సులో సుప్రతిష్ఠతమైనప్పుడు అటువంటి హృదయం ప్రతి మానవుడికీ శుభోదయాన్నే ప్రసాదిస్తుంది. అందుకే మనస్సును మహాకల్పవృక్షం అన్నారు.

  • =====================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: