Friday, June 4, 2010

హిందూ దేవాలయాలు భారత వెలుపల , Hindu Temples outside India



ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడుతున్న భారతీయులు తమ భక్తి భావనలను ఘనంగా చాటుకుంటున్నారు. తాముండే ప్రాంతాల్లో అత్యద్భుత రీతిలో ఆలయాలను నిర్మించి అబ్బుర పరుస్తున్నారు. ఆధ్యాత్మిక విస్తృతికి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చింది ఎంతో కష్టపడి ఆలయాల నిర్మాణంలో వారు పాలు పంచుకుంటున్నారు. అనేక దేశాల్లో వారు నిర్మించిన ఆలయాలు హిందువుల్లో ఆధ్మాత్మిక భావనలను పెంపొందించడమే కాకుండా ఇతర మతాలవారిని శిల్పకళతో ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రపంచంలో ఇటువంటి కొన్ని ఆలయాల వివరాలివీ...

లండన్‌లో అపూర్వ ఆలయం రూ.109 కోట్లతో నిర్మాణం 14ఏళ్ల శ్రమకు ప్రతిరూపం
బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతూ రూ.109 కోట్లతో భారీ ఎత్తున నిర్మించిన అపురూప ఆలయం ఒకటి సోమవారం ప్రారంభమైంది. హిందువులు అధికంగా నివశించే లండన్‌లోని వెంబ్లీ ప్రాంతంలో ఈ 'సనాతన్‌ హిందూ మందిర్‌'ను 2.4 ఎకరాల్లో నిర్మించారు. ఆలయం ఎత్తు 66 అడుగులు. ఆలయ నిర్మాణంలో పురాతన 'శిల్పశాస్త్ర' కళను అనుసరించారు. ఆలయానికి ఉపయోగించిన లైమ్‌స్టోన్‌ను ప్రత్యేకంగా గుజరాత్‌లోని సోలా పట్టణంలో అద్భుత శిల్పాలుగా మలిచారు. మందిర నిర్మాణంలో స్టీల్‌ను వాడకపోవడం విశేషం. ఈ మందిరంలో మతాలకు అతీతంగా 41 మంది పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో మదర్‌ థెరెసా, గురునానక్‌, మీరాబాయి, స్వామినారాయణ్‌ తదితరుల విగ్రహాలున్నాయి. ఇసుక రంగు గోడలతో అలరారే ఈ ఆలయంలో వేలాదిమంది భక్తుల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
శ్రీ స్వామినారాయణ్‌ మందిర్‌
ఈ మందిర్‌ను లండన్‌ వాయవ్య ప్రాంతంలో 1995లో నిర్మించారు. 2,828 టన్నుల బల్గేరియన్‌ లైమ్‌స్టోన్‌ను, 2వేల టన్నుల ఇటాలియన్‌ మార్బుల్‌ను వినియోగించారు. రూ.82 కోట్లను ఖర్చు చేశారు. నిర్మాణానికి రెండున్నరేళ్లు పట్టింది. దీనిని నీస్‌డెన్‌ ఆలయంగా పిలుస్తారు. ఇది ఐరోపాలో నిర్మించిన మొదటి అధికారిక ఆలయం. ఇది భారత్‌కు వెలుపల నిర్మించిన అతిపెద్ద ఆలయంగా 2000 సంవత్సరంలో గిన్నిస్‌ రికార్డులకెక్కింది. లండన్‌లోని ఏడు అద్భుతాల్లో ఇదీ ఒకటని చెబుతారు.

వెంకటేశ్వర ఆలయం, బర్మింగ్‌హాం
బ్రిటన్‌ వెస్ట్‌ మిడ్‌లాండ్‌లోని డబ్లీకి సమీపంలో ఉన్న టివిడేల్‌లో నిర్మించిన వెంకటేశ్వరాలయం మరో అద్భుత కట్టడం. రూ.40 కోట్ల వ్యయంతో 12.5 ఎకరాల్లో దీనిని నిర్మించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం నమూనాలో దీనిని కట్టారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు సమీపంలో 1981లో శాంటా మోనికా కొండల్లో ఈ మలీబు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీనివాసుడు సేవలందుకుంటారు. ఇందులో రెండు ప్రాంగణాలున్నాయి. పైన ఉన్న ఆలయంలో వెంకటేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. కిందిభాగంలో శివాలయం ఉంది.
స్వామి నారాయణ్‌ మందిర్‌, టొరంటో
కెనడాలోని టొరంటోలో రూ.64 కోట్లతో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరానికి 2వేల మంది కార్మికులు పనిచేశారు. టర్కీ లైమ్‌స్టోన్‌, ఇటలీ మార్బుల్‌తో నిర్మించారు. 2007లో ఇది ప్రారంభమైంది.

భారత్‌ వెలుపల నిర్మించిన హిందూ ఆలయాల్లో అమెరికాలోని అట్లాంటాలో నిర్మించిన ఆలయమే ప్రస్తుతం అతి పెద్దదని చెబుతారు. 30 ఎకరాల్లో 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. గోపురం 75 అడుగుల ఎత్తు ఉంటుంది. 34,450 రాళ్లను నిర్మా ణంలో వినియోగించారు. 1300 మంది శిల్పులు పనిచేశారు. రూ.100కోట్లు వెచ్చించారు.
మరికొన్ని పెద్ద ఆలయాలివే...
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (ఇల్లినాయిస్‌),
వెంకటేశ్వరాలయం (న్యూజెర్సీ),
మురుగన్‌ ఆలయం (సిడ్నీ),
వెంకటేశ్వరాలయం (సిడ్నీ),
మీనాక్షి దేవాలయం (టెక్సాస్‌),
ఏక్తా మందిర్‌ (ఇర్వింగ్‌),
లక్ష్మీ ఆలయం (యాష్‌లాండ్‌),
వెంకటేశ్వరాలయం (పిట్స్‌బర్గ్‌).
  • ===================================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: