Tuesday, May 4, 2010

Vasavi Kanyakaparameswari , వాసవి కన్యకాపరమేస్వరి





కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా కోమటి లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివశిస్తున్నారు.

ఇంద్రుడు శచీదేవుల గారాబు పుత్రుడు జయంతుడు. మంచి అందగాడని ప్రసిద్ధి.

ఒకప్పుడు శతజిహ్వుడనే రాక్షసుడు యాగములను పాడుచేస్తూ వుంటే జయంతుని వెళ్ళి ఆ రాక్షసునితో యుద్ధం చేయమని బ్రహ్మ అడుగుతాడు. కానీ శచీదేవి తన కుమారుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి భయపడి, వద్దని వారించింది. బ్రహ్మకు కోపం వచ్చి నీవింత భయస్తురాలవైతివి కనుక భూలోకంలో వైశ్యుని ఇంట పుట్టమని శపించాడు. ఇంద్రుడు బ్రహ్మ కాళ్ళమీద పడి ప్రార్థించగా, ఆమె భూలోకంలో పుట్టినా ఎవ్వరినీ పెళ్ళాడకుండానే తిరిగి స్వర్గానికి వస్తుందని అభయమిచ్చాడు.

శచీదేవి భూలోకంలో పుట్టడానికి మరొక కారణం కూడా వుంది.

సోమకాంతుడనే యక్షుడు, అతని భార్య శచీదేవిని తమకు కుమార్తెగా పుట్టమని ప్రార్థించారు. ఆమె వారికి పుత్రికగా జన్మించింది. ఆమెకు వయస్సు వచ్చాక, చిత్రకంకుడనే యక్షుడు ప్రేమించి తనను పెళ్ళాడమని అడిగాడు. అందుకు ఈమె నిరాకరించడంతో కోపించి ఆమెను భూలోకలో పుట్టమని శపించాడు.

భూలోకంలో కుసుమశ్రేష్ఠి అనే వైశ్యుడు భారత దేశంలో పెనుగొండ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అతని భార్య కుసుమాంబ. ఈ కుసుమశ్రేష్ఠి అప్పటి వేంగీదేశ ప్రభువైన చాళుక్య వంశస్థుడు విష్ణువర్ధనుని సామంతుడు. కుసుమశ్రేష్ఠి పాలనలో జనులు సుఖశాంతులతో జీవించేవారు. కానీ ఎంత సంతోషంగా వున్నా కుసుమశ్రేష్ఠికి పిల్లలులేకపోవడం తీరని లోటుగావుండేది. అందుకని పుత్రకామేష్టి యాగం చేసాడు. తత్ఫలితంగా అతనికి వైశాఖమాసంలో విరూపాక్షుడను కుమారుడు, శాపగ్రస్తురాలైన శచీదేవి వాసమాంబ అను కుమార్తెగా జన్మించారు. చిన్నతనంనుంచే విరూపాక్షునిలో గొప్ప నాయకుని లక్షణాలు కనిపించసాగాయి. వాసమాంబ సంగీత సాహిత్యాలపై ఉత్సాహం చూపేది. అంతేగాక ఎక్కువకాలం దైవచింతనలో గడిపేది. ఆమె పెరిగి పద్దదవుతున్నకొద్దీ ఆమెలో వైరాగ్య లక్షణాలు ఆమె తల్లి తండ్రులు గమనించసాగరు.

ఆ రోజుల్లో వారికి భాస్కరాచార్యులు కులగురువుగా వీరికి అన్నిట సలహాదారుడుగా వుండేవారు. ఆయన శిక్షణలో విరూపాక్షుడు వీరోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. కానీ వాసమాంబ మాత్రం వేదాంతపరమైన విద్యలే నేర్చుకుంది.

ఇలా వుండగా వేంగీదేశ ప్రభువైన విష్ణువర్ధనుడు సామ్రాజ్య విస్తీరణకై దండయాత్రకు బయల్దేరి వెళ్ళుతూ, పెనుగొండకు వచ్చాడు. అతనికి కుసుమశ్రేష్ఠి, వైశ్యప్రముఖులు కూడా ఘనస్వాగతం ఇచ్చారు.
వారి సత్కారాలకు సంతోషించి రాజు పురప్రముఖులను పిలిచి ఒక్కొక్కరికే తాంబూల సత్కారం చేసాడు. అలా తాంబూలం ఇచ్చేసమయంలో వాసమాంబను చూసి, ఆమె సౌందర్యానికి అబ్బురపడ్డాడు.

రాజధానికి తిరిగి వచ్చాక, ఆమెను వివాహమాడాలని నిశ్చయించి తన మంత్రిని పెనుగొండ కుసుమశ్రేష్ఠి దగ్గరకు తనకు వాసమాంబతో వివాహం చెయ్యమని రాయబారం పంపాడు. వాసమాంబ మనస్తత్వం తెలిసిన తండ్రి అందుకు నిరాకరించాడు. రాజుకు కోపం వచ్చి యుద్ధంలో వారిని జయించైనా తాను వాసమాంబను తీసుకు వచ్చి వివాహమాడుతానని తిరిగి వర్తమానం పంపాడు.

చేసేదిలేక కుసుమశ్రేష్ఠి అందుకు అంగీకరించి, రెండునెలలు గడువు పెట్టాడు తన తోటి వైశ్య ప్రముఖలను సమావేసపరచి, కర్తవ్యం చెప్పమని ప్రార్థించాడు. వారంతా కూడా వాసమాంబ వైరాగ్య పద్ధతి తెలిసినవారు కనుక, ఆమె అభిమతానికి విరుద్ధంగా ఈ వివాహం జరగడానికి వీలులేదని, కరాఖండీగా తీర్మానించారు.

యుద్ధమే జరిగితే, ఎందరో తనవల్ల ప్రాణాలు పోగొట్టుకుంటారని వాసమాంబ హోమగుండంలో దూకి ప్రాణత్యాగం చెయ్యడానికి నిశ్చయించుకొంది. ఆమె నిశ్చయాన్ని విన్న వైశ్యులందరూ వ్యాకులత చెంది ఆమెను వారించబోయారు. అప్పుడు వాసమాంబ తాను ఇంద్రుని పట్టమహిషి శచీదేవినని, శాపవశాన భూలోకంలో జన్మించానని, తాను కన్యగానే మరణించి స్వర్గానికి చేరాలని వారికి నచ్చ చెప్తుంది. అప్పుడు ఆవైశ్యులు తాము కూడా అమెతో బాటు అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేస్తామని పలికారు.

గోదావరి తీరాన గంధపు చెక్కలతో నూటమూడు అగ్నికుండాలు ఏర్పాటుచేసారు. ఈ ఆత్మత్యాగానికి వైశ్యులు భార్యలతో సహా సిద్ధమయ్యారు. వాసమాంబ మానవరూపంలో పుట్టిన దేవత అని వారివిశ్వాసం. వాసమాంబ మొదటగా హోమకుండంలో ప్రవేశించింది. వెంటనే అగ్ని చల్లబడిపోయి వాసమాంబతో "తల్లీ నీలో నేను కూడా భరించలేని వేడి వుంది. నిన్ను దహించేశక్తి నాకు లేదు" అని ప్రార్థించాడు.

వాసమాంబ అగ్నిదేవునితో తాను హోమగుండంద్వారా స్వర్గానికి చేరాలని అందుకు తనకు సాయపడమని అగ్నిని వేడుకొని అగ్ని ప్రవేశం చేసింది. వెంటనే ఆమెను అనుసరించి మిగిలిన వారు కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసారు.

వాసమాంబ కన్యగా మరిణించుటచేత కన్యకాంబ, కన్యకా పరమేశ్వరి అని పిలువబడుతూ, అప్పటినుంచి వైశ్యకులస్థుల కులదేవతగా వారి సేవలు అందుకుంటూ వుంది.----------- (సేకరణ: వివిధ గ్రంథాలనుండి)

పూర్తి వివరాలకోసం -ఇక్కడ క్లిక్ చేయండి -> వాసవి కన్యకాపరమేస్వరి

  • =====================================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: