Friday, April 16, 2010

గాయత్రీమాత , Gayatri Mata





గాయత్రీదేవి -ఆమె వేదమాత , సర్వ ధర్మ సారము , శైవ , వైష్ణవ , సనాతన , ఆర్య సమాజాది భేదములు లేకుండా అందరికీ ఆరాధ్య దేవత ..మాత .
తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.

వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.

దసరా నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధచవితి నాడు, అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకూ మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి, ముక్తావిద్రుమహేమ నీలధవళ కాంతులతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. గాయత్రీదేవి మంత్రప్రభావం ఎంతో గొప్పది. గాయత్రీమంత్రం రెండు విధాలు. ఒకటి లఘు గాయత్రీమంత్రం, రెండవది బృహద్గాయత్రీ మంత్రం. ప్రతి రోజూ త్రికాలసంధ్యావందనం చేసి, ఆ గాయత్రీదేవి మంత్రాన్ని వేయి సార్లు ధ్యానిస్తే, ఆ తల్లి అనుగ్రహంతో పాటు, వాక్శుద్ధి కలగతుంది. అంతటి మహత్తరశక్తి కలిగిన గాయత్రీదేవి శరన్నవరాత్రులలో ఐదు ముఖాలతో, వరదాభయ హస్తాలతో, కమలాసనగా దర్శమిస్తుంది.
శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకుంటూ షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి, పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగె్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే గాయత్రీమాత .

గాయత్రీ మంత్రం కోసము - > గాయత్రీ
  • ======================================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: