Saturday, February 13, 2010

వెంకటేశ్వరస్వామి తిరుమల ,Venkateswarasawmy-Tirumala





తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

స్థల పురాణం

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధనం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

మరికొన్ని వివరాలకోసం - > తెలుగు లో చదవడానికి -> శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి

  • ========================================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: