జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి, ఎక్కడ? మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలోకి ఏడుస్తూ వస్తాం. కొన్నాళ్ల తరవాత కొందరిని ఏడ్పిస్తూ పోతాం. బాల్య, కౌమార, యౌవన వార్ధక్యాలే మన బతుకులోని దశలా? ఎక్కడినుంచి వచ్చాం... ఎక్కడికి పోతున్నాం అన్న ప్రశ్నలకు, సమాధానమేమిటో ఇప్పటికీ గొప్ప తాత్వికులకు, పెద్ద శాస్త్రజ్ఞులకు అంతుపట్టడం లేదు. ఏం సాధించాలని జీవించాలి అని కొందరు నిరాశావాదులు ప్రశ్నిస్తుంటారు. జీవితం అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలా? అసలు ఎందుకు సాధించాలి? దేనికోసం? ఆత్మసంతృప్తి కోసమా లేక సమాజ శ్రేయం కోసమా?
ఏదో ఒక ఘనకార్యం చేయాలని కొందరు భావించి ఆ పని తలపెట్టినప్పుడు, దేనికి అని ప్రశ్నిస్తే- 'నేను మరణించిన తరవాతా జీవించడానికి' అనే సమాధానం చెబుతుంటారు. తాజ్‌మహల్ నిర్మించిన షాజహాన్ సైతం ఇలాంటి కీర్తికండూతితోనే ఈ అద్భుత కట్టడానికి రూపకల్పన చేసి ఉండవచ్చు. ఎందరో శాస్త్రజ్ఞులు సైతం కీర్తి కాముకులు కావచ్చు. అయితే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా గతం, భవిష్యత్ అన్న ఆలోచనే మనసులోకి రానీయకుండా తనపని మౌనంగా తాను చేసుకుని పోయే సామాన్యుడికి ఈ చరిత్రలో స్థానం లేదా?
పూర్వం ఒక సామాన్య పేదకూలీ అడవిలో ప్రతిరోజూ కట్టెలు కొట్టుకుంటూ, వాటిని అక్కడికి దగ్గరలోని ఓ పల్లెలో అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అదే అడవిలో ఓ ముని చిన్న ఆశ్రమాన్ని కట్టుకుని కఠోర తపస్సు ప్రారంభించాడు. ఆ పేదకూలీ కట్టెలు కొట్టినప్పుడు వచ్చే శబ్దాలు ముని ఏకాగ్రతకు భంగం కలిగించేవి. కొద్దిరోజులు పోయాక ఆ ముని కోపం పట్టలేక 'నా తపస్సు భగ్నం చేస్తున్నవాడి తల వేయి వ్రక్కలగుగాక' అని శపించాడు. కాని ఆ పేదవానికి ఏమీ కాలేదు! మామూలుగా అతడు తనపని చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ మునికి ఇదేమీ అర్థంకాక తన గురువు దగ్గరికెళ్లి ఎందుకిలా జరిగిందని అడిగాడు. గురువు నవ్వుతూ ఇలా బదులిచ్చాడు- 'నీవు నీ స్వార్థం కోసం తపస్సు చేస్తున్నావు. ఆ కూలీ నిస్వార్థంగా కుటుంబ పోషణకోసం కష్టపడుతున్నాడు. స్వర్గం, నరకం, విష్ణు సాయుజ్యం, జన్మరాహిత్యం వంటి పదాలే అతనికి తెలియవు. తన విధి నిర్వహణ విధ్యుక్త ధర్మంగా భావించి విజ్ఞతతో పనిలో నిమగ్నమయ్యాడు. నిస్వార్థం, నిర్మలతత్వం, నిబద్ధత, నిజాయతీలే మన జీవితాల్ని 'రక్షణ కవచాలు'గా కాపాడుతుంటాయి. అందుకే హోమాగ్ని వంటి అతని పవిత్రత ముందు నీ కోపాగ్ని పటాపంచలయింది...'
- =======================================================
No comments:
Post a Comment