మేరీమాత ఉత్సవాలు
దేవుడు అన్నిచోట్లా ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. అలాంటి తల్లి ఎంత గొప్పది! దేవుడినే కన్నతల్లి మరెంత మహిమాన్వితురాలు! నవమాసాలు మోసి, కని, పెంచిన ఆ తల్లి ఆ బిడ్డను సమస్తజనావళి పాపపరిహారం నిమిత్తం త్యాగం చేయడం ఎంతటి గొప్ప విషయం! ఆమే మేరీమాత. ఆమె పుణ్యచరిత్రను స్మరిస్తే యుగపురుషుడికి జన్మనిచ్చిన ఆమె త్యాగనిరతి, ఔన్నత్యం అవగతమవుతాయి. ఆమెది ఇజ్రాయేలులోని గలిలియొ ప్రాంతం, ఊరుపేరు నజరేతు. ఆమెకు మూడు సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెను మతపెద్దల ఆశీస్సుల నిమిత్తం యెరుషలేము దేవాలయం తీసుకువెళ్లారు. అప్పుడే ఆ మతపెద్ద ఆమె భవిష్యత్తును సూచించాడు. 'ఈమెను జగన్మాతగా ఆరాధించే రోజొస్తుంది, సమస్త జనావాళికి ఆరాధనీయురాలవుతుంది, అంచేత ఈమెను ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉంచండి...' అన్నాడు ఆ మతపెద్ద. అలా బాల్యంలోనే ఆమె భగవంతుని ప్రాంగణంలోనే ఉండటం వెనక గొప్పపరమార్థం ఇమిడి ఉంది. యుక్తవయస్కురాలైన మేరీమాతకు ఒక దేవదూత దర్శనమిచ్చింది. 'సమస్త మానవుల్లో ఎంతో ప్రముఖుడయ్యే కుమారుడికి నువ్వు జన్మనిస్తావ్, ఆ బిడ్డను సర్వోన్నతుని కుమారుడిగా పిలుస్తారు' అని దేవదూత చెప్పింది. మెస్సయ్యాకు తల్లి కాగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడైన యెహోవా తనకు ఇచ్చినందుకు ఆమె ఆయనకు కృతజ్ఞతలు చెల్లించింది. ప్రజలను వారి పాపాలనుంచి కాపాడే ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఇప్పటికి రెండువేల సంవత్సరాలక్రితం జరిగిన ఆ దైవఘటన ఫలితంగా మేరీమాతను, ఆ పుణ్యచరితను, గోదావరిమాత, వేళాంగిణిమాత, లూర్దుమాత వంటి పేర్లతో ఆయా ప్రాంతాలలో భక్తులు కొలుస్తున్నారు. 1925లో విజయవాడ గుణదల కొండపై ప్రకృతి సిద్ధంగా వెలసిన గుహల్లో ఫాదర్ ఆర్లతి అనే బోధకులు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1971లో క్రమేణా ఆ పరిసర ప్రాంతాన్ని మేరీమాత ఆలయంగా తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లోని లూర్ద్‌నగరంలో మేరీమాత భక్తులకు కనిపించి వారి కోర్కెలు తీర్చిన గుర్తుగా ఈ తేదీనాడు గుణదలలో మేరీమాత ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 31న ప్రారంభమయ్యే నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. ఫిబ్రవరి తొమ్మిది నుంచి మూడు రోజుల్లో ముగిసే ఈ ఉత్సవాలకు లక్షల మంది హాజరవుతారు. మేరీమాతను భక్తులు వ్యాకులమాతగా స్మరిస్తారు. దీనికి కారణం ఆమె జీవితంలో సంభవించిన ఏడు వ్యాకులతలు. వీటిలో మొదటిది యేసు ప్రభువును ఆయన జన్మించిన ఎనిమిదోరోజున దేవాలయంలోకానుకగా అర్పించటం- అంటే ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవుని కుమారుడిని పాపుల రక్షణ పరిహారార్థం త్యాగం చెయ్యడంలోని వ్యాకులత. క్రీస్తు ప్రభువు పుట్టిన రెండు సంవత్సరాలకు నాటి పరిపాలకుడైన హేరోదు రాజువల్ల రాబోయే ముప్పుననుసరించి ఆ పసిబాలుడిని సురక్షితంగా ఈజిప్టు తీసుకువెళ్లిన సందర్భంలోనిది రెండో వ్యాకులత. ఇక యేసు 12 సంవత్సరాల వయసులో యేరుషలేము దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆయన తప్పిపోయి మూడో రోజున దొరికినప్పుడు ఆమె పడినది మరో వ్యాకులత. ప్రభువైన క్రీస్తు సిలువపై మరణించేముందు సైనికులు ఆయనను కొరడాలతో హింసించినపుడు రక్తసిక్తమైన ఆయన దేహాన్ని చూసి తల్లడిల్లిన ఆ తల్లి వ్యాకులత ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది. ఇది నాలుగో వ్యాకులత. సిలువపై ఇద్దరు నేరస్తులమధ్య ప్రభువైన క్రీస్తును సిలువ వేయడం ఆమెకు సంభవించిన ఇంకో వ్యాకులత. గాయపడిన ప్రభువు రక్తసిక్తమైన దేహాన్ని ఆమె ఒడిలో పడుకోబెట్టినప్పుడు దైవకుమారుడనే విషయం మరచి ఒకతల్లిగా ఆమె వ్యాకుల పడటం ఆరో వ్యాకులత. ఇక ఆఖరుసారి ఆమె హృదయాన్ని వ్యాకులపరచిన ఘటన ప్రభువు పరిశుద్ధ శరీరాన్ని శిష్యుల సమాధిలో ఉంచిన ఘటన. అలా సమస్త మానవాళి రక్షణ నిమిత్తం సిలువపై బలియాగం అయిన క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లిగా ఆమె ధన్యురాలైంది. |
- ======================================================
Visit My Website - > Dr.Seshagirirao
No comments:
Post a Comment