Wednesday, January 20, 2010

సరస్వతి , Saraswathi


దేవుడు లేదా దైవం ని ఆస్తికులు("పరమేశ్వరుడున్నాడు" అనే ప్రగాఢ విశ్వాసం) విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు. ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులు, ధార్మిక వేత్తలు,(Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు. భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు. ఈ పేర్లన్నీ హిందూమతము, యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్, అల్-ఘజాలి, మరియు మైమోనిడ్స్, ఆపాదించారు. మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు. మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు. దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రక్కపెడితే .... అంతా నమ్మకమే... ఆ నమ్మకము మూఢ నమ్మకం కాకూడదు . నమ్మకము మనిషికి మనోధైర్యాన్ని ఇస్తుంది . ధైర్యే... సాహసే ... కార్యసిద్ధి . తనను మంచి మార్గములో విజవంతం గా నడిపించే వాడొకడు తనవెంట ఉన్నాడనే నమ్మకము మనిషికి కొండంత ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది . దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు
.

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి (Saraswati) చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి" భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర (ఆంద్రప్రదేశ్ ) లో ఉన్నది .

ఈ ఆధునిక యుగంలో చదువే సమస్తానికి మూలమని అందరికీ తెలుసు. విద్యతోనే పిల్లలు సభ్య మానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. కవి, లేఖనుడు, సమీక్షక్షుడు, ఆలోచనాపరుడు, పాఠకుడు, గాయకుడు, సంగీతజ్ఞుడు, తార్కికుడు, అధ్యాపకుడు, ప్రవక్త, ఉపదేశకుడు, జ్యోతిష్కుడు, వక్త మొదలైన వారందరికీ కావలసింది వాక్పటుత్వం. వాక్చాతుర్యం ద్వారానే వ్యక్తులు ఇతరులపై ప్రభావం చూపగలుగుతారు. సంగీత ఇతర లలిత కళలకు కూడా సరస్వతి అధిష్టాన దేవత. పవిత్రంగా, మనపూర్వకంగా, నిర్మలమైన మనస్సుతో ఆరాధిస్తే చాలు ఆ చదువులమ్మ ప్రసన్నమై కోరిన విద్యలు ప్రసాదిస్తుంది.

సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. సకల సవాజ్మయానికీ మూలం. మనం నోటితో ఏదైన మధురంగా మాట్లాడుతున్నామంటే అది ఆ తల్లి చలవే. ఆమె అంతర్వాహినిగా ఉండటం వల్లే మనలో మేధాశక్తి పెంపొందుతుంది. ఆమె అనుగ్రహం లేకపోతే అజ్ఞానాంధకారం లో కొట్టుమిట్టాడవలసిందే. అందుకే ఆ చల్లని తల్లి అనుగ్రహం ప్రతీ ఒక్కరికీ అవసరం.

యా కుందేదు తుషార హర ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ

పుట్టుక :
బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. రుధ్రుని భృకుటి నుండి అనగా కనుబొమలనుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి . తారిణి , తరళ , తార , త్రిరూపా , ధరణీరూపా , స్తవరూపా , మహాసాధ్వీ, సర్వసజ్జనపాలికా , రమణీయా , మహామాయ , తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్దలక్ష్మి , బ్రహ్మాణి , భద్రకాళి , ఆనందా ... అనేవి తంత్రశాస్త్రాల ఆధారం గా ఇవి ఈ దేవతా దివ్యనామాలు .
బర్మాలో హంసవాహినియైన సరస్వతి "తూయతాడి" అన్న పేరుతో. త్రిపిటకాలను చేత ధరించినది.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.

"శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార
సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు" ...............నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.

పేర్లు

అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు

1. భారతి
2. సరస్వతి
3. శారద
4. హంస వాహిని
5. జగతీ ఖ్యాత
6. వాగీశ్వర
7. కౌమారి
8. బ్రహ్మ చారిణి
9. బుద్ధి ధాత్రి
10. వరదాయిని
11. క్షుద్ర ఘంట
12. భువనేశ్వరి

సరస్వతీ వ్రతం

ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి వరలక్ష్మీ వ్రతం చేసినట్లుగానే విద్యాధిదేవత సరస్వతీదేవి వ్రతం కూడా ఉంది. ఈ వ్రతం చేయడం వల్ల అజ్ఞానంతో చేసిన పాపాలన్నీ తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పాండిత్యం సిద్ధిస్తుంది. ఆ వ్రతవిధానమిది. ఈ వ్రతానికి మాఘశుద్ధ పంచమి లేదా ఏ మాసమైనా శుక్లపక్ష పంచమి, పూర్ణిమ తిధులు శ్రేష్ఠం. సంకల్పం చెప్పుకున్న శుభముహూర్తాన ఉదయం పూట శుచిగా సరస్వతిని పూజిస్తామని సంకల్పించుకోవాలి. స్నానాదికాలు, నిత్యకృత్యాలు అయిన పిదప కలశ స్దాపన చేయాలి. గణపతిని పూజించి, కలశంలో దేవిని అవాహాన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవికి ధవళ వస్త్రాలను సమర్పించి, తెల్లని నగలు అలంకరించాలి. తెల్లని పూలు, అక్షరాలతో, మంచిగంధంతో, ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించిన అనంతరం పాయసం నివేదించాలి. పూజానంతరం కధ చెప్పుకుని అక్షంతలు శిరస్సున ధరించి పాయస ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. ఈ విధంగా 5 వారాలు చేసిన తదుపరి ఉద్యాపన చేయాలి.

ఉద్యాపన విధానం

ఐదుగురు పిల్లలను గణపతి ప్రతిరూపాలుగా భావించి, పూజించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారిని చదివించాలి. లేదా వారి చదువుకయ్యే ఖర్చు భరించాలి. ఎవరైనా తమకిగానీ, తమవారికిగానీ అసాధారణ విద్య అబ్బాలనుకున్నా, ఉన్నత విద్యాప్రాప్తి, లేదా పదోన్నతి కావాలనుకుంటే ఈ వ్రతం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు. శ్రావణమాసం లేదా ఫాల్గుణ మాసాలు ఈ వ్రతమాచరించడానికి శుభప్రదం.

మరిన్ని వివరాలకోసం : తెలుగు వికీపిడియా చూడంది .
  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao


No comments: