Saturday, October 10, 2009

హనుమజ్జయంతి , hanumajjayanti




హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి తో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా కలదు.

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

హిందూమతంలో ప్రాముఖ్యత
పర్వతమును తీసికొని వస్తున్న హనుమంతుడు. టెర్రాకొట్టా శిల్పం.

హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రంలో చెప్పబడిన నామాలు హిందూ విశ్వాసాలలో హనుమంతుని పాత్రను సూచిస్తాయి.

హనుమానంజనాసూనుః వాయుపుత్రోమహాబలః
రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షోః అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.


ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
విశేషాలు:

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.

* తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
* దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
* పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
* ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
* ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.

ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. హనుమంతుని స్మరించినయెడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడినచోట దయ్యములు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థింపవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు.

వివిధ గాధలు

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.

జననం, బాల్యం

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.

విద్యాభ్యాసం

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.

కిష్కింధ కాండ

వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.

రాముని చేత వాలి హతుడవ గా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.

వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.

హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.

సుందర కాండ
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.

హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

యుద్ధకాండ

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.

వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.

రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.


తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.

ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు.

==============================
Visit my web-blog -> http://dr.seshagirirao.tripod.com/

No comments: