జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాధలున్నాయి. సప్తశతి రెండవ అధ్యాయంలో ఆమె అవతార గాధ అనేక సంకేతార్ధాలలో కానవస్తుంది. దేవదానవుల యుద్ధం నూరేళ్ళపాటు సాగింది.ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు. నిలువ నీడలేని వారు త్రిమూర్తుల నాశ్రయించారు.
జగన్మాత ఆవిర్భావాన్నే దసరా పండుగగా హిందువులు జరుపుకుంటారు . దసరా పండుగ ఎప్పటినుండి ప్రారంభవయినదో ఖచ్చితముగా చెప్పలేము . ఋషులు , మునులు వారి వారి ఊహాగానకు అందుబాటులో ఉన్న రీతిలో ఒక్కక్కరు ఒక్కోరీతిలో చెప్తూవస్తూఉన్నారు . ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం.. అలాంటి మన పండుగలలో దసరా ఒకటి.. మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రులు విభిన్న రీతుల్లో జరుగుతాయి. చివరి రోజైన దసరా మరింత సంబరంగా జరుగుతుంది.. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత.
స్థితికారకుడైన శ్రీ మహా విష్ణువు దేవతల దుస్థితిని చూసి కోపించాడు. అతని ముఖం నుండి క్రోధం వెలువడి, కొద్ది సేపట్లో మహోజ్వలంగా వెలగసాగింది. ఆ మహాద్భుత శక్తిని చూచి, బ్రహ్మ రుద్రులు తల్లడిల్లి పోయారు. శృతిలయ శక్తులు జ్వాలారూపంలో వెలువడ్డాయి. తమ అంతశ్శక్తి తేజోరూపంలో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు. కాని కోపతప్తులుగా వున్నారు. త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశ్శక్తి, అగ్ని పర్వతంలా విజృంభించి, సమస్త విశ్వాన్ని ఆక్రమించింది. ఆ చిచ్చక్తి మాతృరూపం దాల్చింది. మహామాత తేజఃపుంజాలు లోకమంతటినీ కాంతిమంతం కనిపించాయి. దేవతలు ముగ్దులై లోకమాత నవలోకించి 'హే జగజ్జననీ' అంటూ కేలుమోడ్చారు. వాత్సల్యపూర్ణమైన ఆమె ప్రసన్నవదనం నిరాశా నిస్ప్రృహలను పటాపంచలు చేసింది.
త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా, త్రిగుణాత్మికగా స్తుతింపబడింది. పరమేశ్వరుని శుద్ద మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి, ఆ తల్లి శుద్ద మంగళ స్వరూపిణీ అయ్యింది. ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి. విశ్వస్థితి కారకములగు ఆ హస్తములు శిష్టరక్షణకు ప్రతీకలు. పూర్ణచంద్ర స్వరూపముగల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన భౌద్దిక, ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుచున్నాయి. ఆమె పాదద్వయం బ్రహ్మ స్పష్టశక్తి సంకేతం అనంత చలనము సూచించు జీవచైతన్యం. ఆమె త్రిలోచన; సూర్యచంద్రాగ్నులు ఆమె త్రినేత్రాలు; ఒక కన్ను విశ్వ జీవనాధారం. మరొకటి విశ్వసౌందర్య పత్రిక. ఆమె కనుబొమలు ఉదయ సంధ్య సంకేతాలు. త్రిశక్త్యాత్మికా, విశ్వస్వరూపిణీ, జగజ్జననీ ఆమెయే. చండీ, దుర్గా, కాళీ, మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి ఆమెయే. ఆమెయే బాల,లలితా, రాజరాజేశ్వరీ, త్రిపుర సుందరి.
మహాశివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్మించి ఆమెకిచ్చాడు. త్రిశూలం దైహిక, మానసిక, ప్రాపంచిక ప్రవృత్తులను అణిచి, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించు కేతం. విష్ణువు తన ధర్మచక్రం నుండి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. జగత్తు యొక్క అనిర్భాధిత చలనానికి ప్రతీక చక్రం. ప్రజాపతి అక్షరమాలనిచ్చాడు. శ్రీ మాత అకారాది క్షకారాంత వైఖరీ వాగ్స్వరూపిణీ అయింది. జగచ్చక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు. సముద్రుడు కమలహారాన్ని, కుబేరుడు పానపాత్రను అర్పించాడు. ఆ కానుకలన్నింటినీ స్వీకరించిన లోకమాత నవ్వింది. ఆ నవ్వు దానవ సమూహాన్ని కంపితం చేసింది. ఆమె దరహాస వదన దర్శనంతో దేవతా సమూహం ఆనందోత్సాహంతో నృత్యం చేస్తూ -
విశ్వమాతా జగద్దాత్రీ విశాలాక్షీ, విరాగిణీ
ప్రగల్భా, పరమోదారా పరమోదా మనోమయా ...............................అంటూ ప్రస్తుతింపసాగింది.
ఈ రీతిగా అవతరించిన దేవి--జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమునే ఒక్కో రోజు ఒక్కొక్క రూపము (అవతారము) లో మహిషాసునితో యుద్ధము చేసిందా శక్తిస్వరూపిణి .
సేకరణ : డా. వండాన శేషగిరిరావు (శ్రీకాకుళం).
- =========================
No comments:
Post a Comment