జగన్మాత రూప విశేషాల్లో ఆకుకూరలు, కాయలు, పండ్లులాంటివి చేత పట్టుకుని ఉన్న ఓ రూపం కనిపిస్తుంటుంది. అనేక పక్షులతో కరుణారస వీక్షణాలతో మరో రూపం కనిపిస్తుంటుంది. పరాశక్తి అనగానే దనుజ సంహారం కోసం అనేకానేక బాహువులలో అనేకానేక అస్త్ర శస్త్రాలను కలిగి ఉండాలి కదా? ఈ రూపాలేమిటి ఇంత సౌమ్యంగా ఉన్నాయి... వీటి విశేషాలేమిటి అని తెలుసుకోవాలంటే దేవీ భాగవతం ఏడో స్కంధం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడాల్సిందే.
పూర్వం హిరాణ్యక్షుడి వంశంలో రురుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. ఆ రురుడికి మహాదుష్టుడైన దుర్గముడు అనే పుత్రుడుండేవాడు. దుర్గముడికి లేచింది మొదలు దేవతలను, మునులను, రుషులను,
సత్పురుషులను ఎలా సంహరించాలన్నదే ఆలోచన. సాధ్యమైనంతవరకూ తన బలంతో దేవతలందరినీ కష్టాల పాలు చేస్తూనే ఉండేవాడు. అయినా వాడికి తృప్తి కలగలేదు. ఒకేసారి దేవతలను, మనులను
అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. వెంటనే కపట బుద్ధితో బ్రహ్మదేవుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు తనకు నాలుగు వేదాలు కావాలని అన్నాడు. భక్తులకు వరాలనివ్వటమే తప్ప ఇంకేమీ ఆలోచించని, సత్యమార్గాన్నే అనుసరించే బ్రహ్మ నాలుగు వేదాలను అప్పగించి అంతర్థానమయ్యాడు. ఆ మరుక్షణం నుంచే ఆ రాక్షసుడి దురాగతాలకు అంతులేకుండా పోయింది. వేదాలన్నీ వాడి సొంతం కావటంతో వేద పండితులకు వేదాలు గుర్తురాకుండా పోయాయి. దాంతో వారంతా మూర్ఖులయ్యారు. స్నాన సంధ్యాదులు, నిత్య హోమాలు, శ్రాద్ధజపాలు, యజ్ఞయాగాలు జరిపేవారే కరవయ్యారు. ఎవరకీ వేదాలలోని ఒక్క మంత్రమూ గుర్తుకు రాకుండా పోయింది. దాంతో సర్వత్రా అనర్థం ప్రాప్తించింది. యజ్ఞాలు జరగకపోవటంతో హవిర్భాగాలు అందక దేవతలు క్షీణించి పోసాగారు. దాంతో దుర్గముడు స్వర్గం మీదకు దండెత్తాడు. దేవతలంతా చెల్లా చెదరయ్యారు. భూమండలంలో జననష్టం, జంతునష్టం ఎక్కువైంది. బావులు, చెరువులు, నదులు అన్నీ ఇంకిపోయి అనావృష్టి అధికమైంది. ఇక అలాంటి సమయంలో ఎలాగో ఒక్క ఆలోచన మెరుపులాగా తట్టిన కొందరు దేవతలు, పండితులు హిమగిరికి వెళ్ళి అక్కడ పరాంబికను ఆర్తితో కీర్తించారు. అలా వారంతా కీర్తించగానే భువనేశ్వరి అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడామెకు అనేకానేక కన్నులయ్యాయి. ముందుగా ఆ తల్లి వారందరికీ భక్ష్య భోజ్యాలను ఇచ్చింది. ఆమె చేతుల్లో కూరగాయలు, తియ్యని ఫలాలు ఉన్నాయి. వాటిని అందరికీ పంచి పెట్టింది. ఆమె చేతుల్లోనే పశువుల మేత ఉంది. దాన్ని పశువులకు ఇమ్మని వారికిచ్చింది. ఆ తల్లి కరుణారస వీక్షణాలు సోకి అంతటా పచ్చదనం వెల్లివిరిసింది. నదులు, బావులు, చెరువులు అన్నీ నిండాయి. అలా తన బిడ్డలను శాంతపరిచింది. శాకములను చేతిలో ధరించి అవతరించినందుకు ఆనాడు ఆమెను శాకంభరి అని దేవతలు స్తుతించారు. అధిక సంఖ్యలో కన్నులున్నందుకు శతాక్షి అని ప్రస్తుతించారు. శాకంభరి అవతరించిందని దుర్గమూసురుడు తెలుసుకుని ఆ శతాక్షి మీదకు వేయి అక్షౌహిణుల సేనలతో దండెత్తాడు. ముందుగా ఆ శివాదేవీ తన బిడ్డల చుట్టూ రక్షగా తన తేజోమయ చక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత దేవీ ఆ రాక్షసుడితో పోరుకు సిద్ధమైంది. ఆ సమయంలోనే ఆమె ముఖం నుంచి కాళిక, తారిణి, బాల త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవీ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్ర బాహుక అనే అనేకానేక తీవ్ర శక్తులు ఉద్భవించాయి. ఆ శక్తులన్నీ రణరంగంలో రాక్షససేనకు ఎదుర్కొన్నాయి. మృదంగ, శంఖ, వీణాధ్వనులు మిన్నుముట్టాయి.
దుర్గమాసురుడు ఆ శక్తులతో పదిరోజుల పాటు భీకరంగా యుద్ధం చేశాడు. పదకొండో రోజున రక్తమాల్యాంబరాలను ధరించి రక్తగంధాన్ని పూసుకొని పెద్ద సంరంభంతో యుద్ధానికొచ్చి వీరోచితంగా పోరాడాడు. చివరకు ఆ పరాశక్తి చేతుల్లో హతమయ్యాడు. దాంతో లోకాలన్నీ ఆనందించాయి.
- డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
- ===========================================
No comments:
Post a Comment