Sunday, December 5, 2010

ప్రాణహిత పుష్కరాలు , Pranahita river pushkaraalu


డిసెంబరు 6 నుంచి 17 వరకు పన్నెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. పుష్కరాల కోసం కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా తుమ్డిహేటి, వేమనపల్లి, అర్జునగుట్ట వద్ద ఏర్పాట్లు చేసింది.

పుష్కరము అంటే ?

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు),మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు.పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి.నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం.తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
నది------------------------ రాశి
గంగా నది------------------ మేష రాశి
రేవా నది (నర్మద)------------ వృషభ రాశి
సరస్వతీ నది---------------- మిథున రాశి
యమునా నది-------------- కర్కాట రాశి
గోదావరి-------------------- సింహ రాశి
కృష్ణా నది------------------ కన్యా రాశి
కావేరీ నది------------------ తులా రాశి
భీమా నది------------------ వృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నది------ ధనుర్ రాశి
తుంగభద్ర నది---------------- మకర రాశి
సింధు నది----------------- కుంభ రాశి
ప్రాణహిత నది--------------- మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

ప్రాణహిత పుష్కరాలు
ప్రణీతావరదావైన్యా గౌతమీచ సరస్వతీ
నద్యః పంచ వహంత్యత్ర ప్రయాగా త్కోటిశోధికం

ప్రాణహితానది, వైన్య, వరద, సరస్వతీ నదులు గోదావరిలో సంగమించే క్షేత్రంలో స్నానమాచరిస్తే... త్రివేణి సంగమ క్షేత్రమైన అలహాబాదు (ప్రయాగ)లో స్నానం చేసిన దానికంటే కోటిరెట్లు అధికమైన ఫలం లభిస్తుందని స్కంధపురాణంలోని కాళేశ్వర ఖండం చెబుతోంది. అంతటి ప్రత్యేకత గల క్షేత్రం మన కరీంనగర్‌జిల్లాలోని కాళేశ్వరం.

పవిత్ర జీవనదీమతల్లిగా గుర్తింపు పొంది అధిక భాగం తెలుగు నేలలో ప్రవహిస్తున్న గోదావరి నదికి ప్రధాన ఉపనది ప్రాణహిత (ప్రణీత) నది. సహ్యాద్రి పర్వత శ్రేణులు ప్రాణహిత జన్మస్థలం. మహారాష్ట్రలోని అహెరి వద్ద పెన్‌గంగా నది వేయిన్‌ గంగాతో కలుస్తుంది. మరోవైపు వేయిన్‌ గంగా, వరదా నదీ ప్రవాహంతో కలిసి ప్రాణహిత నదిగా రూపుదిద్దుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల గుండా 130 కి.మీ.లు ప్రవహంచి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో సంగమిస్తుంది. ఎగువన నిర్మిస్తున్న ఆనకట్టలతో వర్షాకాలంలోనూ గోదావరమ్మ ఎండిపోతోంది. ఈ తల్లిని జీవనదిగా నిలిపేందుకు.. కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమించే ప్రాణహిత గోదారమ్మకు అండదండనిచ్చి ఎన్నటికీ ఎండిపోకుండా జలసిరులు పొంగిస్తూ తన పేరును సార్థకం చేసుకుంటోంది.

కాళేశ్వరంలో క్రితంసారి 1999 జనవరి 12 నుంచి 23 వరకు ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. అలాగే 1991-92, 2003లో గోదావరి పుష్కరాలు, 2001లో సరస్వతి పుష్కరాలు జరిగాయి. ఈ క్షేత్రంలో పుష్కర స్నానమాచరించి ముక్తీశ్వరుణ్ని దర్శించుకుంటే వోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

పుష్కర ప్రాశస్త్యం
పురాణ గాథల ప్రకారం... పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం ఘోర తపమాచరించాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అందుకు పుష్కరుడు... జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమవుతున్నాయనీ నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుందనీ ఆలోచించి 'దేవా... నా శరీర స్పర్శచే సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడట. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాపవిముక్తులవుతారు' అని వరమిచ్చాడట. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు (బృహస్పతి) తనకూ పుష్కరత్వం ప్రసాదించమని బ్రహ్మను గురించి తపమాచరించగా అందుకు పుష్కరుడు అంగీకరించలేదు. పుష్కర, బృహస్పతులిద్దరికీ నచ్చజెప్పిన బ్రహ్మ వారిద్దరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాడట. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగానూ చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగానూ వ్యవహరించి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగ పుష్కరాలు నిర్వహిస్తారు. అలాగే వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మద, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీనది పుష్కరాలు... ఇదే కోవలో మీనరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేవే ప్రాణహిత పుష్కరాలు. ఆ సమయంలో బ్రహ్మాదిదేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు కాబట్టి ఆయా నదుల్లో స్నానాలాచరించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ... అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ భక్తుల విశ్వాసం.

కాళేశ్వర క్షేత్రం
కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో జిల్లా కేంద్రానికి 140 కి.మీ.ల దూరంలో ఉంది కాళేశ్వర క్షేత్రం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ(అంతర్వాహిని) నదులు కలిసే ప్రాంతం కావడంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి కెక్కింది. త్రివేణి సంగమంలో కలిసే పెన్‌గంగ, వరదా నదులను కలిపి పంచగంగ అంటారు. కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలుగా శివుడు ఇక్కడ ఒకే పానవట్టంపై కొలువుండటం విశేషం. ఇందులో ముక్తీశ్వరుని లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉండి.. వాటిలో ఎన్ని నీళ్లు పోసినా కనిపించకుండా పోవడం ఇక్కడి మరో ప్రత్యేకత. ప్రధాన దేవాలయానికి ఆగ్నేయ భాగంలో యమకోణం ఉంది. ఈ యమకోణం ముందు తలవంచి పడమర నుంచి తూర్పునకూ దక్షిణం నుంచి ఉత్తరం వైపూ దూరి బయటకు వస్తే పాపాలన్నీ పరిహారమవుతాయని భక్తుల నమ్మకం.

source : Eenadu sunday magazine
  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao

1 comment:

Dr.Seshagirirao - MBBS. said...

Hello బాగున్నారా? you are good జ్ఞానము