Tuesday, December 28, 2010

mArgashira mAsam importance, మార్గశిర మాసం ప్రాముఖ్యత


చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.

కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది. సౌరమానం ప్రకారం ఈనెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యుడు ధనూరాశిలో ఉండగా విష్ణువును మేల్కొలిపే ధనుర్మాస వ్రతం చేయాలని ఆయా గ్రంథాలు చెబుతున్నాయి.

మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.

మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అనీ అంటారు. ఆ రోజున విష్ణ్వాలయాల్లో ఉత్తరద్వారంనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు. ఈ ఏకాదశి గీతాజయంతి. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం, భారతీయ ఆధ్యాత్మ వాఞ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని, సఫలైకాదశి అని వ్యవహరిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తజయంతిని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమనాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్‌వ్రతం ఆచరించడం పరిపాటి. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తజనావళికి హర్షం మార్గశీర్షం.




  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: