Monday, November 22, 2010

కార్తీకపౌర్ణమి , Kaarteeka paurnami





పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి, విశదీకరిస్తాయి, నిలువరింపజేస్తాయి. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.

ఈ తరం యువత పండుగలు, పర్వదినాలు, ఒక వేడుక జరుపుకోవడానికే పరిమితం జేస్తున్నారు . పండుగల ద్వారా మన పురాణ ఇతిహాసాలు,మనకు అందించే సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలని ప్రతి పర్వదినానికి తగిన రీతిగా వాటి విశిష్టతను గురించి ప్రజలకు ,విద్యార్ధులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేయుచున్నారు .
కార్తీకమాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒకదాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీకయజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే కార్తీకపౌర్ణమి ప్రాశస్త్యం.


పౌర్ణమి... ప్రతి నెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది వెుత్తమ్మీదా జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్నుకుట్టేలా గుడిప్రాంగణాలూ జలాశయాలూ కార్తీకదీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.

కార్తీకపౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటిదొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు. పెళ్లికాని అమ్మాయిలు కార్తీకదీపాలను నదుల్లో వదిలి రాత్రికి తులసికోటలో ఉసిరికొమ్మ(కాయలతో)పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.

ముఖ్యంగా కార్తీకపౌర్ణమి రోజున ముత్త్తెదువులు రెండురకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. ఈ నోము కోసం కార్తీకపౌర్ణమినాడు చలిమిడి చేసి వెుదటి సంవత్సరం ఐదుగురు ముత్త్తెదువులకు ఆపై సంవత్సరం పదిమందికి మూడో ఏడాది పదిహేనుమందికీ చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికాదీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆ పై సంవత్సరం 360 దీపాలు శివాలయంలిో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీకపౌర్ణమినాడు నమకచమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితాసహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.

దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధన వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించేవాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అలాగే ఈరోజున... కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీకపురాణం చెబుతోంది.
పురాణ ప్రశస్తి...

కార్తీకపౌర్ణమినే త్రిపురిపూర్ణిమ అనీ దేవ దీపావళి అని కూడా వ్యవహరించడం కద్దు. ఆ కథావిశేషమేంటంటే... పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో మూడుపురాలను నిర్మించుకుని సర్వసుఖాలూ అనుభవించేవాడట. బలగర్వంతో దేవతలందరినీ హింసించేవాడట. అప్పుడు శివుడు త్రిపురాసురునితో మూడురోజుల పాటు యుద్ధం చేసి అతణ్ని సంహరించాడట. అసురవధ జరిగిన ఆనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండగ జరుపుకున్నారట. అందుకే దీన్ని 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఇంకా విష్ణుమూర్తి మత్య్సావతారంలో పుట్టినదీ ఈరోజే. వృందాదేవి తులసివెుక్కగా అవతరించిందీ, కార్తికేయుడు పుట్టిందీ, దత్తాత్రేయుడి జన్మదినమూ రాధాకృష్ణులకెంతో ఇష్టమైనదీ... ఈ రోజే. అలనాడు ద్వాపరయుగంలో రాసలీలా మహోత్సవంలో గోపికాస్త్రీలను ఆ నల్లనయ్య అనుగ్రహించింది ఈ రోజేనని నమ్మిక. క్షీరసాగరమథనంలో వెలువడిన హాలాహలాన్ని తన గళాన దాచుకున్న శివుడి చుట్టూ పార్వతీదేవి ప్రదక్షిణ చేసిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈరోజున శివాలయాల్లో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎండుగడ్డిని తాడుగా పేని తోరణంగా కట్టి దాన్ని వెలిగించి భగభగ మండే ఆ తోరణం చుట్టూ పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు తిప్పుతారు. దీనికే 'జ్వాలా తోరణోత్సవం' అని పేరు.

ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీకపౌర్ణమినాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తారు. గుడిప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహాపుణ్యక్షేత్రం వారణాసిలో గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమినాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అంటారు స్థానికులు. ఆరోజు పుష్కర్‌తోపాటు గంగానదిలో స్నానంచేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం.

source : Eenadu Sunday magazine
  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: