Sunday, October 24, 2010

Ramleela , రామ్‌లీలా





రామ్‌లీలా దశకంఠుడి హతమే ... దస్‌-హరా

రామ్‌లీలా రామకథను ప్రదర్శించే సంగీత నాటకకరూపకం. శరన్నవరాత్రుల్లో ఉత్తరభారతమంతటా ఈ రూపకాన్ని ప్రదర్శిస్తారు. రామ్‌లీలాకు 16వ శతాబ్దపు అవధి భాషలో ఉన్న రామాయణం, రామచరిత మానస్‌ ఆధారం. రామకథ జనజీవన స్రవంతిలోకి నైతికవిలువల్ని అంతర్వాహినిగా ప్రవహింపచేస్తుంది.జగన్మాత యుగయుగాన వివిధ రూపాల్లో దుష్టుల్ని శిక్షించి,శిష్టుల్ని కాపాడింది.రామాయణంలో రాముడు దశకంఠుడిని అంతమొందించి సీతమ్మకు విముక్తి ప్రసాదిస్తాడు.అమ్మవారి ఆరాధనోత్సవాల్లో దుష్ట సంహార ఘట్టాన్ని సామాన్య ప్రజానీకానికి తెలియజేయడం ఎంతో ప్రాముఖ్యమున్న అంశం.దేశవిదేశాల్లో ప్రదర్శిస్తున్న రామ్‌లీలా గురించి ఓ కథనం...

దానవుడైన రావణుడిపై దేవదేవుడి అవతారమైన శ్రీరాముడి విజయం వేడుకలే దసరా అని ప్రతీతి.భారతీయ పవిత్ర కావ్యం రామాయణేతిహాసం... సత్యయుగంలో శ్రీరామావతారం శ్రీమహావిష్ణువు ఏడవ అవతారంగా పేర్కొన్నది. శ్రీరాముడు వేల సంవత్సరాల క్రితం అయోధ్యలో జన్మించాడట. ఈ అయోధ్య నేటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. పరమాత్మ అవతారమైన రాముడు పిత్రువాక్యపరిపాలనకు కట్టుబడి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు.ఇందులో ప్రధాన ఘట్టమే సీతాపహరణ. లక్ష్మణుడు, హనుమంతుడు, అశేష వానరసేనతో రాముడు దశకంఠుడితో యుద్ధం చేస్తాడు.
రావణుడిని ఓడించి సీతను రావణుడి చెరనుండి విడిపించాడు. కనుక దసరాను ‘దస్‌-హరా’ అని కూడా అంటారు. దస్‌-హరా అనగా... పదితలల రావణడి అంతంగా చెప్పుకోవచ్చు. రామకథను వివరించే రామ్‌లీలాను మహాముని తులసీదాస్‌ ప్రారంభించాడని భావిస్తారు. ఆయన రాసిన ‘రామచరితమానస్‌’ ఆధారంగానే ఈనాటికీ రామ్‌లీలాను ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి వేడుకల్లో భాగంగా రామ్‌లీలా ప్రదర్శిస్తారు. రాముడి జన్మదినమైన శ్రీరామనవమినాడు కూడా ప్రదర్శిస్తారు. రామచరితమానస్‌ కావ్య కర్త మహాముని తులసీదాసు శిష్యుల్లో ఒకడైన మేఘ భగత్‌ క్రీ.శ1625లో రామ్‌లీలా ప్రదర్శనలు న్విహించాడని భావించడానికి చారిత్రక ఆధారాలున్నాయి.

అంతకు పూర్వమే ఈ ప్రదర్శనలు జరిగాయనడానిి కూడా ఆధారాలు లేకపోలేదు. క్రీ.శ. 1200- 1500మధ్య మొదటిసారి రామ్‌లీలా ప్రదర్శించినట్టు కొందరు విద్వాంసులు భావిస్తున్నారు. మొగలాయి చక్రవర్తి అక్బర్‌ రామ్‌లీలా ప్రదర్శన తిలకించినట్లు కొందరంటారు. 16వ శతాబ్దంలో మహాముని చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర‘‘ చైతన్య చరితామృతం’’ రాసిన కృష్ణదాస్‌ కవిరాజ్‌ పూరీలో నిర్వహించిన నాటకంలో తను హనుమంతుడి పాత్ర పోషిస్తూ తన్మయత్వంలో ఓలలాడినట్లు ప్రస్తావించాడు. కనుక రామచరిత మానస్‌కు పూర్వమే రామాయణం నాటకాలు వేసేవారని రుజువవుతోంది.

సంస్కృతంలో ఉన్న వాల్మీకీ రామాయణానికి భిన్నంగా విశాల జనబాహుళ్యం మాట్లాడే వాడుకభాషైన ‘‘అవధి’’లో రాసిన తులిసీదాసు రామాయణం వచ్చిన తరువాతే ఉత్తరభారతంలో రామ్‌లీలా బహుళ ప్రచారంలోకి వచ్చిందని నిర్ధారించవచ్చు. అసలు రామ్‌లీలా ప్రదర్శనే ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. వివిధరకాల మతపమైన ఆచారాలు నిర్వహించేట్లు ప్రేరేపిస్తుంది. వేషభాషలు, ఆభరణాలు, మాస్కులు, తలపాగాలు మేకప్‌ అలంకరణల దృష్ట్యా రామలీలా సుసంపన్నమైన నాటక కళ కూడా.మంత్రవాద్యాలతో సంభాషణలశైలిలో ఈ ప్రదర్శన అట్టహాసంగా నిర్వహిస్తారు. స్థానిక జానపద గీతాలను పోలినవి రామ్‌లీలాలో ఉపయోగిస్తారు. రామ్‌లీలాలో పనిచేసే వృత్తిపరమైన బృందాన్ని ‘మండలి’ అని పిలుస్తారు.

ఉత్తర భారతంలో రావణుడిపై పరమాత్ముడైన శ్రీరామచంద్రుడి విజయోత్సవంగా చాలామంది ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు. రావణుడిని రాముడు సంహరించే ఘట్టాన్ని జానపద నాటక రూపంలో ‘రామ్‌ లీలా’ ప్రదర్శిస్తారు. పరమాత్మ స్వరూపుడైన శ్రీరాముడు దశకంఠుడైన రావణాసురుడిని సంహరించడం ఒక క్రీడ, ఒక లీలే కదా! ప్రధానంగా భారతీయ సంప్రదాయబద్ధమైన, జానపద ఫక్కీలో ఉన్న పౌరాణిక నాటకం ఆరుబయట రాత్రి వేళ ప్రదర్శిస్తారు. దాదాపు నవరాత్రుల పొడుగునా ఉత్తర భారతీయులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. రామ్‌లీలా ప్రదర్శించే ప్రాంతాన్ని బారస్‌ అంటారు.
ఔత్సహికులైన నటులకు ఈ నాటకం ద్వారా తమ ప్రతిభాపాటవాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. దృశ్యాలు మారేప్పుడో, నాటకంలో ఉత్కంఠభరిత మలుపులొచ్చినపుడో తెరవెనుకనుంచి గాయకుడొకడు పాటలు పాడతాడు. నాటకంలో మధ్యమధ్యలో వచ్చే ఈ కథనాలు, గీతాలు సాధారణంగా గోస్వామి తులసీదాసు రామాయణం పై ఆధారమైనవి. అవధీ భాషలో ఉంటాయి. కానీ తరచూ ప్రేక్షకుల స్పందనను బట్టి భాష శైలి మారుతుంటాయి. సంగీతవాయిద్యాలకు అనుగుణంగా నాటకం సాగుతుంది.ఆరుబయట పండుగ వాతావరణం వుంటుంది. ఎలాంటి కట్టుదిట్టాలూ వుండవు. నాటకం నడుస్తుండగా ప్రేక్షకులు వ్యాఖ్యానాలు చేస్తూ ఈలలేస్తూ ఆనందోత్సాహాల్లో ఓలలాడుతారు.

పరమాత్మ రాముడు రావణుడిని సంహరించే ఘట్టాన్ని స్థానిక నటీనటులు ఎంతో రమణీయంగా ప్రదర్శిస్తారు. తరచూ ప్రేక్షకులు ఏ వర్గాలకు చెందిన వారో నటులూ వారిలో వారే అయివుంటారు.దశకంఠుడైన రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు ల పెద్దపెద్ద దిష్టిబొమ్మలను ఆరుబయట వుంచుతారు. వీటికి దూరంగా కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అదే రావణరాజ్యం లం... నేటి శ్రీలంక.రాముడు సీతను కాపాడే క్రమంలో ముఖ్య ఘట్టాలను రామాయణంలో వివరించినట్లు ప్రదర్శిస్తారు.చిన్న పిల్లలు వానర సైనికులుగా రామచంద్రుడిగా వానరసేనాధిపతి హనుమగా వేషాలు ధరిస్తారు.దిషిబొమ్మలను వాటివాటి స్థానాల్లో వుంచిన తరువాత స్థానిక నటీనటులు రాముడిగా సీతగా లక్ష్మణుడిగా వేషాల్లో వస్తారు. రాముడి వేషంలో వున్న నటుడు రావణుడి నాభిని గురిచూచి అగ్నిబాణం వేస్తాడు. ఆ నిప్పు క్రమంగా ఇతర బొమ్మలకు కూడా అంటుకుంటుంది.

దిష్టిబొమ్మలను పేలుడు పదర్థాలతో కుక్కుతారు. చెవులుతూట్లుపడేలా దిష్టిబొమ్మలు పేలుతుండడం చూచి ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడతారు. విజయోత్సాహాలతో ఉర్రూతలూగుతారు. ఆ తరువాత శ్రీరాముడు సీతాదేవిని రక్షించి తన రథంపై తీసుకుపోయే దృశ్యం వచ్చేసరికి కరతాళధ్వనులు మిన్నంటుతాయి. దిష్టిబొమ్మలు దగ్ధమవుతూ అక్కడ గుమిగూడిన వారు తమలో ఉన్న చెడును సంహరించుకోవాలన్న సందేశాన్నిస్తాయి. సుగుణాలను సదాచారాన్ని అమలు చేయాలని ప్రబోధిస్తాయి.చెడుకు రూపమైన రావణుడి సంహారం ఎప్పుడూ మన మనసుల్లో మెదులుతుండాలన్నదే ఇక్కడ ప్రధాన సందేశం. శక్తి, సామ్రాజ్యం రాక్షసత్వాన్ని రక్షించలేకపోయాయి.

తినుబండారాలు, బొమ్మలు ఎన్నో రకాల వినోదాలతో ఈ సందర్భంలో తిరునాళ్ళు జరుగుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. పల్లెప్రజలు దూర ప్రాంతాలకు సుదీర్ఘ ప్రయాణాలు చేసి మరీ రామ్‌లీలా తిలకిస్తారు. ఇతివృత్తం హిందూ సాంప్రదాయానికి సంబంధించి నదైనప్పటికీ... హిందూయేతరులను కూడా ఆకట్టుకుంటుంది. ప్రజలనుంచి సేకరించిన నిధులతో ఈ నాటకం ప్రదర్శిస్తారు.రామ్‌లీలా సంఘాలు వెలుస్తాయి. హిందువులున్న అన్ని దేశాల్లో రామ్‌లీలా ప్రదర్శిస్తారు.ఉత్తర మధ్య భారతంలోనే కాక ఇండియా బయట భారత ఉపఖండంలోని నేపాల్‌, పాకిస్తాన్‌, ఫిజి, మారిషస్‌, దక్షిణాఫ్రికా, గయానా, సూరినామ్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, గ్రేట్‌ బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రామ్‌లీలా ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ప్రపంచమంతటా వివిధ రీతుల్లో ప్రదర్శితమైనందువల్ల రామ్‌లీలా విశ్వ ఖ్యాతినార్జించుకుంది. భారతీయ సంతతి నివసించే ఆఫ్రికా,అనేక ఆగ్నేయాసి యా దేశాల్లో విశేష ప్రజాదరణ పొందింది. 2005లో యునెస్కో మానవజాతి మౌఖిక వారసత్వ సంపదలో రామ్‌లీలా ఒక కళాఖండం అని ప్రకటించింది. ఆ తరువాత యునెస్కో కోసం భారత ప్రభుత్వం ఐ.జి.ఎన్‌.సి.ఎ (ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌) సంయుక్తంగా ‘‘రామ్‌లీలా-ది ట్రెడిషనల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ రామాయణ’’ రెండు గంటల నిడివి ఉన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాయి.‘‘రామ్‌నగర్‌ రామలీలా’’, అవధ్‌,బ్రజ్‌, మధుబని,అయోధ్య రామ్‌లీలా సంప్రదాయాలపై ఈ లఘుచిత్రా న్ని రూపొందించారు.

లక్నోకు 20 కిలోమీటర్ల దూరాన బక్షి కా తాలాబ్‌ వద్ద 1972 నుంచీ మరో వినూత్న పంథా రామ్‌లీలా ప్రదర్శిస్తున్నారు. ఈ కొత్త తరహా రామ్‌లీలాలో రాముడు,లక్ష్మణుడు,హనుమంతుడి వంటి ప్రముఖ పాత్రలు ముస్లిం యువకులు ధరిస్తున్నారు. మత కలహాలు చెలరేగే ప్రాంతంలో ఇదొక సామరస్య ధోరణిగా పేర్కొనచ్చు. నాలుగు రోజుల రామ్‌లీలా దసరా రోజున మొదలవుతుంది. లక్నో ఆకాశవాణి ఈ రూపకాన్ని ‘‘ఉస్‌ గావ్‌ఁ కి రామ్‌లీలా’’ రేడియో నాటకంగా తయారు చేసింది.2000 సంవత్సరంలో మత సామరస్య పురస్కారం గెలుచుకుంది.

రామ్‌లీలా ... విభిన్న ధోరణులు
రామ్‌లీలాను ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలిలో ప్రదర్శిస్త్నురున ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే రామ్‌నగర్‌లో వారణాసిలో వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. అయోధ్య, రామ్‌నగర్‌,వారణాసి,బృందావన్‌,అల్మోరా, సత్నా, మధుబని రామ్‌లీలా ప్రదర్శనలు ప్రామాణికమైనవని 2008 యునెస్కో నివేదిక ప్రకటిస్తోంది. కుమాఁవ్‌ శైలి రామ్‌లీలా ఉదయ్‌ శంకర్‌ రూపొందించాడు. సంగీత నాటక ధోరణిలో సాగే ఈ శైలిని మోహన్‌ ఉప్రేతి, బ్రిజేంద్ర లాల్‌ షా కొనసాగిస్తున్నారు.

చిత్రకూట్‌లో 5 రోజుల పాటు జరిగే రామ్‌లీలాది ఓ అరుదైన శైలి. ఇందులో రాముడు- భరతుల కలయిక ఇతివృత్తం ప్రధాన ఘట్టం . ఆగ్రాకు చెందిన రామ్‌ భరత్‌ రామ్‌లీలాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సంప్రదాయం. ఢిల్లీ నగరమంతటా ఎన్నో రామ్‌లీలా ప్రదర్శనలు నిర్వహిస్తారు. వీటిలో చరిత్రాత్మక ఎర్రకోట ఆరుబయట రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ప్రదర్శించేది పాతకాలం నాటిది. మొగలాయి చక్రవర్తి బహదుర్‌ షా జఫర్‌ ఈ రామ్‌లీలాను ప్రారంభించాడు. మొట్టమొదటిసారి లవ్‌-కుశ్‌ రామ్‌లీలా కమిటీ నిర్వహించిన రామ్‌లీలా వేడుకలను 100దేశాల్లో టెలీవిషన్‌ ద్వారా టెలీకాస్ట్‌ చేసింది.

  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: