తన సంకీర్తనలతో శ్రీనివాసునికి పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణజన్ముడు తాళ్ళపాక అన్నమయ్య. తెలుగువారికి, తెలుగు జాతికి అచ్చ తెలుగులో పాట పాడుకునే యోగ్యత కల్పించినవాడు అన్నమయ్య. సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన 'నందకాంశ'తో జన్మించాడనే ఘనతను కలిగిన ఆ శ్రీహరి దాసుడు 32,000 అద్భుత సంకీర్తనలను తేట తెలుగులో, ప్రౌఢ సంస్కృతంలో రచించాడు. అవతారాలు ఎన్నైనా భగవంతుడొక్కడే అన్న నానుడికి నిదర్శనంగా- తాను ఏ దైవాన్ని కీర్తించినా, ఆ దైవంలో సప్తగిరుల్లో కొలువైన వేంకటేశ్వరునే దర్శించాడు. తాను సృజించిన వసివాడని సంకీర్తనా కుసుమాలకు ఎన్నటికీ తరగని 'వేంకట' పదమకరందాన్ని అలమిన భక్త శిఖామణి ఆయన. తిరుమలగిరుల్లో శిలయైనా, కోనేటి అలయైనా అన్నమయ్య పదాల్లో ఒదిగి మనోజ్ఞమైన భక్తి భావాలకు ప్రతీకలుగా నిలిచాయి.
అన్నమయ్య సంకీర్తనలు అధ్యాత్మ, శృంగార సంకీర్తనలనే రెండు విభాగాలుగా లభించాయి. అన్నమయ్య రాసిన ప్రతి సంకీర్తన ఆపాత మధురమే కాదు. ఆలోచనామృతం కూడా! ఎంతో విశదంగా చదువుకున్న పండితులకూ అర్థంకాని వేదాల సారాన్నీ, పురాణాల ప్రాశస్త్యాన్నీ అచ్చ తెలుగు భాషలో తెలుగువారికి అందించిన గొప్పదనం పదకవితా పితామహునికే చెల్లింది.
అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా లోక నీతిని, జీవన నీతినీ ఉద్బోధించాడు. దాదాపు ఆరు శతాబ్దాలకు పూర్వమే సమాజంలోని కట్టుబాట్లను, కులమత భేదాలను నిరసించాడు.
జోలపాటలతో, లాలిపాటలతో సేద తీర్చాడు. వసంతం పాటలతో ప్రకృతి సౌందర్యాన్నీ, పల్లెపట్టుల సౌభాగ్యాన్నీ మన కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు. కోలాటం పాటలు, సువ్వి పాటలు, జాజర గీతాలతో- అలసిన జానపదుల సేద తీర్చాడు.
అన్నమయ్య రాసిన 'చందమామ రావో జాబిల్లి రావో', 'జో అచ్చుతానంద జోజో ముకుంద' పాటలు పసిపిల్లలకు పాడి వినిపించని తల్లి తెలుగునాట ఉంటుందా! సరళమైన శైలిలో పల్లెపదాలతో అధిక సంకీర్తనల రచన చేయటంతోనే అన్నమయ్య సంకీర్తనలు పండిత, పామర జనరంజకమయ్యాయి. ఎంతోమంది భాగవతోత్తముల కోవలోనే అన్నమయ్య తన సంకీర్తనల గానాన్ని 'వేంకటపతి' ఘనతతోనే నింపాడు. అమ్మవారి, అయ్యవారి అమలిన శృంగారాన్ని సంకీర్తనా శిల్పాలుగా మలచాడు. తనపై సంకీర్తనలు చెప్పమని కోరిన పెనుగొండ సంస్థానాధీశుడు సాళువ నరసింగరాయల అభ్యర్థనను తోసిపుచ్చటమే కాక, 'ఆ హరిని కీర్తించిన నాలుక సామాన్యులను కీర్తించుటయా! ఇది జరగని పని' అంటూ ఆ ప్రభువు కొలువునే వదులుకున్నాడు. అన్నమయ్య ప్రతి సంకీర్తనా ఒక అమృత గుళిక! ఏడు కొండల్లో కోనేటి రాయనికి అందించిన కర్పూర కళిక. ఆయన సంకీర్తనల్లో 13000 సంకీర్తనలు దాదాపుగా మనకు లభ్యమయ్యాయి. మిగిలినవి దొరకకపోవడం మన తెలుగు జాతి దురదృష్టం! అయినా, అన్నమయ్య చెప్పినట్లు- ఒద్దికై భక్తజనుల్ని రక్షించడానికి ఒక్క సంకీర్తనే చాలు!
అలతి పదాలతో అనంతమైన భక్తిభావాన్ని రంగరించిన అన్నమయ్య సాక్షాత్తు 'అప్పని వరప్రసాది!'
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
పూర్తి వివరాలకోసము ... వికీపిడియాను చూడండి ..-> అన్నమయ్య
- =============================================
No comments:
Post a Comment