Friday, April 2, 2010

ఆంజనేయుడు (హనుమంతుడు) ,Anjanaeyudu(Hanumanthudu)
అంజన పుట్టుక (హనుమంతుడి తల్లి)

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.

ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది: అంజన -- అహల్య, గౌతమ ముని కుమార్తె.
వృక్షవ్రజస్సు (కుంజరుడు) అనే గొప్ప వానర రాజు ఉండేవాడు . ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ సూర్యుడు , ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహిస్తారు. స్త్రీగా మారిన వ్రుక్షవ్రజస్సు ... హహల్య గా గౌతమ మునిని వివాహమాడెను . కొంతకాలానికి గౌతమ ముని వలన అంజన (శాపగ్రస్తురాలైన ''పుంజికస్థలి " అనే అప్సరస ) , సూర్యునివలన వాలి , ఇంద్రునివలన సుగ్రీవులు జన్మిస్తారు. . ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.

కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి,సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.


పూర్తీ వివరాలకోసం వికిపెడియా చూడండి -> ఆంజనేయ స్వామి

హనుమంతుడు పెళ్త్లెన బ్రహ్మచారి

    వైశాఖమాస కృష్ణపక్ష దశమి(2013 జూన్‌ 03)... హనుమజ్జయంతి. ఆ రోజున ఆంజనేయుణ్ణి విశేషంగా పూజిస్తాం. అంతవరకూ బాగానే ఉంది. చాలా దేవాలయాల్లో ఈ రోజున హనుమంతుడి కల్యాణం చేస్తారు. ఇక్కడే ఎన్నో సందేహాలు. హనుమంతుడికి పెళ్లయిందా... ఆయన భార్య ఎవరు... ఇవి చాలామందికి తెలియవు. వీటి గురించి చెబుతున్నారు హనుమదుపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబరశాస్త్రి.హనుమంతుడి వివాహం గురించి రామాయణంలో ప్రత్యక్షంగా చెప్పలేదు కదా అనే సందేహం చాలామందికి వస్తుంది. 'సీతాయా శ్చరితం మహత్‌' అన్నారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని. అంటే అది సీత కథ. సీతకు అభేద్యమైన రాముడి కథ. అందువల్ల అందులో హనుమంతుడి చరిత్ర అంతా ఉండాల్సిన అవసరం లేదు. మరి, హనుమంతుడి గురించి తెలుసుకోవాలంటే... 'పరాశర సంహిత' చదవాలి. పరాశర మహర్షి... బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుడి మనవడు. వేల ఏళ్లు తపస్సు చేసి హనుమంతుడి దర్శనం పొందాడు. హనుమచ్చరిత్రను 'పరాశర సంహిత' పేరుతో రచించాడు. ఇందులో హనుమ జీవిత విశేషాలతోపాటూ అనేక మంత్రరహస్యాలూ ఉన్నాయి.

సూర్యపుత్రి సువర్చలాదేవి
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి. ఆమెను సూర్యుడికిచ్చి వివాహం చేశారు. సూర్యుని తీక్షణమైన కిరణాలను తట్టుకోలేకపోయిన ఆమె ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అప్పుడు విశ్వకర్మ సూర్యుడి తేజస్సును కొంత తగ్గించాడు. సూర్యుడి నుంచి వేరైన ఆ కిరణాల నుంచి ఒక కన్య పుట్టింది. సూర్యుడి వర్చస్సు నుంచి పుట్టింది కాబట్టి సువర్చల అనే పేరు వచ్చింది. అందాలరాశి అయిన సువర్చలను చూసి దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి... ఈ కన్యకు భర్త ఎవరు అని అడిగారట. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు ఈమెకు భర్త అని చెప్పాడట విధాత.

పెళ్త్లెనా బ్రహ్మచారే
కొన్నాళ్లకు ఆంజనేయుడు వేదాధ్యయనం కోసం సూర్యుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు సూర్యుడు... 'నేను ఈశ్వరాజ్ఞతో నిరంతరం భ్రమిస్తూ ఉంటాను. కాబట్టి నీకు విద్యలు చెప్పలేను' అంటాడు. ఆ మాటలకు హనుమంతుడికి కోపం వచ్చి సూర్యుడి మార్గానికి అడ్డంగా నిలుస్తాడు. అప్పుడు సూర్యుడు... 'ఆంజనేయా, నీవే ఉపాయం చెప్పు' అంటాడు. హనుమ... సూర్యుడివైపు తిరిగి సూర్య భ్రమణానికి అనుగుణంగా తానూ తిరగడం మొదలుపెడతాడు. అలా సూర్యుడి దగ్గర సకల విద్యలూ అభ్యసించాడు. హనుమంతుడి బుద్ధినీ బల పరాక్రమాలనూ గ్రహించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను హనుమకిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. దానికి హనుమంతుడు... నేను బ్రహ్మచర్య నిష్ఠతోనే ఉండాలనుకుంటున్నానని చెబుతాడు. అప్పుడు సూర్యుడు... సువర్చలను వివాహం చేసుకోవడంవల్ల నీ బ్రహ్మచర్యనిష్ఠకు ఎలాంటి భంగమూ కలగదు అని చెబుతాడు.
గాయత్రము, బ్రాహ్మము, ప్రాజాపత్యము, బృహన్‌... అని బ్రహ్మచర్యం నాలుగు రకాలు. వివాహం చేసుకుని బ్రహ్మచర్య నియమంలో ఉన్నవాళ్లను ప్రాజాపత్య బ్రహ్మచారి అంటారు. దేవతల్లో హనుమంతుడిలానే రుషుల్లో రుష్యశృంగుడు, చరిత్రలో రామకృష్ణ పరమహంస వంటివాళ్లంతా ఈ కోవకు చెందిన బ్రహ్మచారులే.

అలా జ్యేష్టశుద్ధ దశమినాడు సువర్చలా హనుమంతుల వివాహం జరిగింది. పెళ్ళైనా వాళ్లిద్దరూ బ్రహ్మచర్యాన్ని విడనాడలేదు.
సువర్చలాహనుమంతుడి ఆరాధన
సువర్చలాధిష్ఠిత వామభాగం
వీరాసనస్థం కపిబృందసేవ్యం
స్వపాదమూలం శరణంగతానాం
అభీష్టదం శ్రీహనుమంతమీశే
సువర్చలాదేవి ఎడమభాగంలోనూ, కపిసమూహమంతా కుడిభాగంలోనూ ఉండి... శరణువేడినవాళ్ల కోర్కెలన్నీ తీరుస్తాడట హనుమంతుడు.
'సూర్యపుత్రీచ విద్మహే
హనుమత్పత్నీచ ధీమహి
తన్న సువర్చలా ప్రచోదయాత్‌'
- ఇది సువర్చలా గాయత్రీ మంత్రం. దీన్ని జపిస్తే అన్ని కోరికలూ తీరతాయట. సువర్చలా అష్టోత్తరం కూడా ఉంది. అలాగే సువర్చలా సమేత హనుమంతుడి ద్వాదశాక్షర(12 అక్షరాల) మహామంత్రం పరాశర సంహితలో ఉంది. దీన్ని నిష్ఠగా జపిస్తే సకల సిద్ధులూ లభిస్తాయట.

హనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు. అందులో సుప్రసిద్ధమైనవి తొమ్మిది. వీటిలో సువర్చలాహనుమంతుడి అవతారం కూడా ఒకటి.

చైత్రమాసంలో పుష్యమీ నక్షత్రం ఉన్నరోజున; వైశాఖంలో ఆశ్లేషా నక్షత్రం రోజున, కృష్ణపక్ష దశమినాడు; జ్యేష్టమాసంలో మఖా నక్షత్రం రోజున, శుద్ధ విదియ, దశమిరోజుల్లో; ఆషాఢంలో రోహిణీ నక్షత్రంనాడు; శ్రావణంలో పౌర్ణమినాడు; భాద్రపదంలో అశ్వినీ నక్షత్రం ఉన్న రోజున; ఆశ్వయుజమాసంలో మృగశిరానక్షత్రం నాడు; కార్తీకంలో శుక్లపక్ష ద్వాదశినాడు; మార్గశిరంలో శుద్ధత్రయోదశినాడు; పుష్యంలో ఉత్తరా నక్షత్రం ఉన్న రోజున; మాఘంలో ఆర్ద్రా నక్షత్రం రోజున; ఫాల్గుణంలో పునర్వసు నక్షత్రం ఉన్నరోజున సువర్చలాంజనేయస్వామికి తమలపాకులతోనూ సింధూరంతోనూ పూజలు చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందట.

మచిలీపట్నం పరాసపేటలో శ్రీసువర్చలాంజనేయస్వామి దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువయిన సమర్థ రామదాసు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. కృష్ణాజిల్లా ఉయ్యూరులోని ఆలయమూ సుప్రసిద్ధమైనదే. ఇవికాక మనరాష్ట్రంలో గుంటూరు, రాజమండ్రి, తెనాలి, ఇల్లెందు వంటి అనేక ప్రాంతాల్లో సువర్చలాంజనేయస్వామి దేవాలయాలున్నాయి

Source : హనుమదుపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబరశాస్త్రి.@ఈనాడు ఆదివారం అనుబందం(02జూన్‌ 2013)
  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: