Tuesday, December 22, 2009

పూజ , Pooja

పూజ అంతే ఏమిటి?

భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా లేదా `అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి... ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు.

దేముడిని నమ్మి రోజూ పూజలూ, ప్రార్థనలూ చేస్తూ ఉండే వారు ఆస్తికులు. దేముడు లేడని నమ్మి ఎటువంటి పూజలూ, ప్రార్థనలూ చేయని వారు నాస్తికులు. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ఇరు వర్గాల వారూ భగవంతుని కృపకు పాతృలవుతున్నారని.
ఆస్తికత అయినా, నాస్తికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే. రెండు మన శక్తిని పెంచేవే.నిజమైన నాస్తికత్వం ఆస్తికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుకు ఒప్పు? అని ప్రశ్నించుకుంటూ, తనలోని తప్పులను గర్వంలేకుండా ఒప్పుకుని, వాటిని సవరించుకుంటూ చేసే తర్కం సరైనది. అటువంటి తర్కం వల్లనే అనుకుంటా నేను ఆస్తికుడిగా మారాను.


అసలు భగవంతుడు ఎవరు? అతనికృపకు పాతృలము ఎలా అవుతాము?

అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు నాకు మన మతము, ఇందు పొందు పరచబడిన క్రమబద్ధమైన విధానాలూ ఒక మార్గంలా మాత్రమే అనిపిస్తాయి. అలాగే ఇతర మతాల మార్గాలు కూడా.
మనదేహమే దేవాలయము. అందు ఉండు జీవుడు సనాతనమైనటువంటి భగవంతుడే. నాలో ఉండు అఙానమును తొలగించి నీవే నేనను భావనతో నిన్ను పూజించెదను. అంటూ మహన్యాస పారాయణంలో భక్తుడు స్తుతిస్తాడు . అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.

పూజలు చాలామంది చేస్తున్నారు. కానీ ఎందుకోసం చేస్తున్నారు?, వారాశించిన ఫలితాలు వారికి లభిస్తున్నాయా?

మరి భక్తులు( యజమానులు ) ఆశించిన ఫలితాలు రానప్పుడు, వారికి శుభం చేకూర్చలేనప్పుడూ ఆ పుజలూ, పురోహితులూ వ్యర్ధమే కదా!?
ఒక వేళ లోపాలేమైనా ఉన్నాయా?
ఉంటే ఆ లోపం ఎవరి దగ్గర ఉందీ...?
చేసే భక్తుల వద్దా...?
చేయించే బ్రాహ్మల వద్దా...?
లేదా ఆ భగవంతుడి వద్దా...?

పూజలు చాలామంది చేస్తూనే ఉంటారు. అయితే ఎంతమందికి కోరిన కోరికలు తీరాయి? ఎంతమందికి ఆత్మ సంతృప్తి లభిస్తోంది? అలా ఫలితం కనిపించని వారికోసమే ఈ వ్యాసం.

కోరికలు కోరడం తప్పా కాదా అనేది ఇప్పుడు చర్చించటం లేదు. ఒకవేళ ఏదైనా కోరి పూజలు చేస్తుంటే అవి తీరుతున్నాయా అని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. కొంతమంది చెప్తారూ.. దేముడికి పూజ చేస్తూ కోరికలు తీరుతున్నాయా? లేదా? అని ఆలోచించడం తగదని. మళ్లీ అలాంటి గొప్పవారే చెప్తారు "కామి గాని వాడు మోక్ష గామి కాలేడని". ఇవన్నీ వింటూ కూర్చుంటే ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడతారు. నేను చెప్పేది ఏమిటంటే కోరుకోండి మీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. మీ కోరికలో ఎంత మంచి ఉంటే అంత తొందరగా నెరవేరతాయి. పరోపకారంతో కూడిన నిస్వార్ధమైన వి చాలా ఉత్తమమైనవి. మీ మంచి కోరేవి మధ్యస్థం. పక్కన వాడికి చెడు కోరేవి అథమం. ఈ అథమ కోరికలు కోరితే అవి నెరవేరక పోగా మీ వినాశనానికే దారితీస్తాయి. ఉత్తమ, మధ్యస్థ కోరికల గురించి మాత్రమే నేను చెప్తున్నాను.

పూజ చేసే ఏ కొద్ది మందికో ఫలితం లభిస్తోంది. దానికి కారణాలు అనేకం. అందులో మీ తప్పులు సరిదిద్దు కోండి ముందర. మిగతావి ఎలా వాటంతట అవే ఎలా తొలగి పోతాయో చూడండి.

పూజ చెయ్యాలంటే మొదట కావలసింది "శ్రద్ధ". పూజను నేడు చాలా మంది భయంతోనో, తప్పదు కనకనో చేస్తున్నారు. మీకు ప్రాణ సంకటం వచ్చినప్పుడో, ఇక ఎవ్వరి వల్లా మీకొచ్చిన కష్టం తొలగే మార్గం లేదు అనిపించినప్పుడో భగవంతుడు కావలసి వస్తున్నాడు. అప్పుడైనా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధి లేదు. ఇలాంటి వారికి కూడా నాసలహాలు( పూజ విషయంలో) పని చెయ్యవు.

పూజ చెయ్యాలంటే మీకు ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత "శ్రద్ధ". అది మీకు ఇప్పటికే ఉన్నా, లేదా ఇక ముందు కల్పించుకుంటాము అన్నా నేను మీకు చెప్పేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, మీరు కోరుకునేది ఏదైనా తప్పక మీకు ఫలితం లభిస్తుంది. అందుకు మీరే నిదర్శనం. మీరే ఏదో ఒక రోజు నేను చెప్పినది నిజమే నంటూ సభా ముఖంగా చెప్తారు.

సుచిగా స్నానం చేసి, శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి, శుభ్రంగా ఉన్న స్థలంలో దేముని విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహాన్ని కడిగి బొట్టుపెట్టి పూజకు ఉపక్రమించాలి. ఇంత వరకూ అందరూ చేసేదే. కానీ విచిత్రం అసలైన పూజ మాత్రం చాలా మంది విధి విధానంగా చెయ్యలేక పోతున్నారు. ఇది అందరి ఇళ్లల్లో జరిగే సాధారణ తంతు .

పూజను "మనసా వాచా కర్మణా" ఆచరించాలి. అప్పుడే అది సంపూర్ణమైన పూజ అవుతుంది. మీరు కర్మని(పని) మాత్రం ఆచరించి నేను పూజ చేశాను అని చెప్పడం ఎంతవరకూ న్యాయం. పూజ చేస్తే మనసుకు ఒక అద్వితీయమైన, ఆనందకరమైన, సున్నితమైన భావన కలగాలి. అది కలగలేదు అంటే అక్కడ మీమనసు లేదు అని అర్ధం.

మనసారా అంటే మనం పూజ చేసేటప్పుడు ఏమి చేస్తున్నామో తెలుసుకుని దాన్ని చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి.
ఉదా: "పుష్పం సమర్పయామి" అన్నప్పుడు "పుష్పాన్ని సమర్పిస్తున్నాను స్వామీ స్వీకరించు" అని మనసులో ప్రార్ధించాలి. ఆ వేశే పుష్పం సాక్షాత్తూ భగవంతుడి పాదాల వద్ద పడుతోంది అని భావించాలి. దాన్ని ఆ భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తున్నట్లు భావించాలి.

వాచా అంటే వాక్కు ద్వారా కూడా ఆ స్వామిని సేవించాలి. అంటే పూజ చేస్తున్నంత సేపూ భగవత్ నామస్మరణ చేయాలి.

కర్మణా అంటే కర్మ ద్వారా సేవించాలి. భగవంతునికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించడమే కర్మ(పని). ఏ సమయానికి ఏది చేయాలో కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు పెద్దలని గురువులని పురోహితులనీ అడిగి తెలుసుకుని చేయండి

పూజా గది:

చాలామంది తాము అందంగా కట్టుకుంటున్న పొదరిళ్లలో లివింగ్ రూమ్ మొదలుకుని పడకగది, వంటగది, చివరకు స్నానాల గది విషయంలో అత్యంత శ్రద్ధ కనబర్చి... అవి ఎక్కడ, ఎటువైపు, ఎలా ఉండాలో ఆలోచిస్తారు. అయితే ఒక్క పూజగది గురించి మాత్రం అంత ఎక్కువగా ఆలోచించరు.

కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తే, ఇంకొంతమంది కిచెన్ రూములో ఓ పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు. మరికొంతమంది హాల్‌లోనే ఓ అల్మరాను కేటాయిస్తారు. ఇకపోతే, చాలామంది ఇళ్లల్లో అసలు పూజగది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అలాంటి వారు పూజామందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది.

వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది కాబట్టి, అలా చేయకపోవడం మంచిది. లివింగ్‌ రూమ్‌‌లో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో పూజమందిరాన్ని ఏర్పాటు చేసున్నట్లయితే.. ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేయాలి.

పాలరాతితో తయారయిన పూజామందిరాలు చూసేందుకు ఎంతో బాగుంటాయి. వాటి వల్ల గదికే కొత్త అందం వస్తుంది. ఫైబర్‌తో తయారయిన పూజామందిరాలు కూడా బాగానే ఉంటాయి. వీటి ఖరీదు కూడా కొంచెం తక్కువే. పూజ గదిలో ఇటాలియన్‌ వైట్‌ మార్బుల్స్ లేదా సిరామిక్‌ టైల్స్ వేసినట్లయితే చాలా బాగుంటాయి.

పూజ గదిలో... ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్‌ఫామ్‌లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. ఇక, గోడలకు వినాయకుడు, రాధాకృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు. టెర్రకోట, బ్రాస్‌ దీపాలను పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు. గదిలో ఓమూలగా దీపాల స్టాండ్‌ను అమర్చినట్లయితే.. పూజగది చాలా అందంగా ఉంటుంది.

====================================================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: