వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలొ వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారం పై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగం లొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగం లొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరు తో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పుల్యస్తుడు శ్రోత నారదుడు.
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు.
ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.
ఆ కథ ఏమిటంటే...? పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.
అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.
బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెబుతున్నాయి.
అట్టి మహిమాన్వితమైన వామనుడు పుట్టిన రోజున శ్రీ మహావిష్ణువును నిష్టతో ప్రార్థించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా.. ఆరోజున వైష్ణవ దేవాలయాలను సందర్శించుకునేవారికి సకల సంపదలతో పాటు పుణ్యఫలము సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
- ===============================
Visit my website : Dr.Seshagirirao.com
No comments:
Post a Comment