Monday, October 26, 2009

సత్యసాయిబాబా జయంతి , Satyasai Baba Birthday
సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.


సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.

సత్యసాయి వంశవృక్షం
హైదరాబాద్‌: కోట్లాదిమంది భక్తులకు ఆరాధ్యుడు... తన బోధనలతో ప్రపంచంలోని భక్తులందరినీ కట్టిపడేసే శ్రీ భగవాన్‌ సత్యసాయి బాబా పూర్వీకులు ఎవరు... వారి వంశం వివరాలు ఏంటి కొంత ఆసక్తి కలిగించే అంశం.
సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబర్‌ 23న కార్తీక సోమవారం రోజు బాబా జన్మించారు. పెద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాలుగో సంతానం బాబా. అనంతపురం జిల్లాలో నేటి పుట్టపర్తిగా పిలవబడుతున్న ఒకనాటి గొల్లపల్లి బాబా స్వగ్రామం. బాబా పూర్వీకులు... వారి కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే...
సత్యసాయి ముత్తాత శేషంరాజు, పెద్దలక్ష్మమ్మ. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.
కుమార్తె వెంకటసుబ్బమ్మ, ఆమె భర్త మీసరగండ సుబ్బరాజు
రెండో సంతానం కొండమ రాజు, ఆయన భార్య లక్ష్మమ్మ
మూడవ సంతానం సుబ్బరాజు, ఆయన భార్య నారాయణమ్మ
కొండమరాజు వంశంలోనే సత్యనారాయణ రాజు(సత్యసాయిబాబా) జన్మించారు. కొండమరాజు, లక్ష్మమ్మ దంపతులకు పెద వెంకమరాజు, చిన వెంకమరాజు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెదవెంకమరాజుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈయన నాలుగో సంతనామే సత్యసాయి.
తొలి సంతానం శేషంరాజు ఆయన భార్య సుశీలమ్మ
రెండో సంతానం వెంకమ్మ ఆమె భర్త మీసరగండ సుబ్బరాజు
మూడో సంతానం పార్వతమ్మ ఆమె భర్త పేరు అక్కిరాజు గోవిందరాజు
నాలుగో సంతానమే మనం ఇప్పుడు సత్యసాయిగా పిలుచుకుంటున్న సత్యనారాయణరాజు
అయిదో సంతానం జానకిరామయ్య ఆయన భార్య మీనాక్షమ్మ
* సత్యసాయి అన్న శేషంరాజు, సుశీలమ్మ దంపతులకు అయిదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శేషంరాజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. తాను ఏ పాఠశాలలో పనిచేస్తే... అక్కడకు సత్యసాయిని

తీసుకెళ్లి చదివించేవారు. ఈ కారణంగానే పుట్టపర్తి, కడప జిల్లా కమలాపురం, బుక్కపట్నం, ఉరవకొండ పాఠశాలల్లో సత్యసాయి చదవాల్సి వచ్చింది.
* సత్యసాయి సోదరి వెంకమ్మ, సుబ్బరాజు దంపతులకు ఏకైక కుమారుడు శంకర్రాజు
* సత్యసాయి రెండో సోదరి పార్వతమ్మ, గోవిందరాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె చిట్టెమ్మ ఉన్నారు. సాయిబాబా జన్మదిన వేడుక ప్రారంభం సూచికగా వేణుగోపాలస్వామి రథోత్సవం చిట్టెమ్మ

కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ప్రారంభం అవుతుంది.
* సత్యసాయి సోదరుడు జానకిరామయ్య జానకిరామయ్య, మీనాక్షమ్మ దంపతులకు కుమారుడు ఆర్‌జే రత్నాకర్‌, కుమార్తెలు శైలజ, వనజ ఉన్నారు. వీరిలో రత్నాకర్‌ ప్రస్తుతం సత్యసాయి ట్రస్టు సభ్యుడిగా కొనసాగుతున్నారు.
సత్యసాయిబాబా అస్తమయంతో బాబా వంశంలోని ఆయన తరం ముగిసింది.

సత్యసాయి అస్తమయం
పుట్టపర్తి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం సత్యసాయిబాబా నిర్యాణం చెందారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక బోధనలతో అలుపెరగని సేవ చేసిన సత్యసాయి బాబా ఇకలేరు. 24-04-2011 ఉదయం 7.40 గంటలకు బాబా నిర్యాణం చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికం వైపు నడిపించిన బాబా తిరిగి రారన్న వార్త విని భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా మానవాళికి శాంతిసందేశమిచ్చిన బాబా మార్చి 28న శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా 28వ రోజున తుదిశ్వాస విడిచారు. బాబా అస్తమయ వార్త విని పుట్టపర్తి అంతటా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది.

27-04-2011 న సత్యసాయి అంత్యక్రియలు
పుట్టపర్తి: సత్యసాయి బాబా భౌతికకాయానికి బుధవారం ఉదయం సాయికుల్వంత్‌ హాల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.

బాబా మానవాళికి అందించిన సేవలు
పుట్టపర్తి: 'నా జీవితమే నా సందేశం' అని ప్రవచించిన సత్యసాయి మానవాళికి ఫలాపేక్ష లేకుండా అనితర సేవలు అందించారు. బాబా సేవల పరంపర ఒకసారి చూస్తే...
* 1945లో ప్రశాంత నిలయం నిర్మాణం. 1950లో ప్రారంభం.
* 1954లో పుట్టపర్తిలో చిన్న ఆస్పత్రి నిర్మాణంతో సత్యసాయి సేవలు ప్రారంభమయ్యాయి.
* 1970లో వైట్‌ ఫీల్డులో మహిళలు, పిల్లలకు సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు.
* 1981లో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌(సత్యసాయి విశ్వవిద్యాలయం).
* రాయలసీమ ప్రజల తాగునీటి అవసరాలకు 1995 మార్చిలో మంచినీటి ప్రాజెక్టును తలపెట్టారు. ఈ పథకం ద్వారా రాయలసీమలోని 750 గ్రామాలకు తాగునీరు అందించారు.
* 2004 నుంచీ చెన్నై ప్రజల దాహార్తినీ సత్యసాయిట్రస్టు తీరుస్తోంది. సత్యసాయి గంగా కెనాల్‌ పథకంపై బాబాను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కొనియాడారు.
* మెదక్‌ జిల్లాలోని 179 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 141 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* ఉచిత వైద్యం కోసం 2001లో బెంగళూరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని సత్యసాయి ప్రారంభించారు.
* 2009లో ఒడిశా వరద బాధితులకు సత్యసాయి ట్రస్టు 699 ఇళ్లను నిర్మించి ఇచ్చింది.
* ఆస్ట్రేలియా, మెక్సికో, బ్రిటన్‌ సహా 33 దేశాల్లో ఉచిత విద్యాసేవలు అందిస్తున్నారు.
* 166 దేశాల్లో ఉచిత విద్య, వైద్య, ఇతర సేవలను సత్యసాయి ట్రస్టు అందిస్తోంది.
* మొబైల్‌ డిస్పెన్సరీలతో దేశంలోని మురికివాడల్లో సత్యసాయి ట్రస్టు వైద్యసేవలు అందిస్తోంది.
* సత్యసాయి సేవలను గుర్తిస్తూ 1999 నవంబర్‌ 23న తపాలాబిళ్ల విడుదల

  • source _ Eenadu telugu daily

మరిన్ని వివరాలకోసం వికీపీడియా ని చూడండి -> Satyasai Baba Birthday Celebrations

No comments: