Monday, October 26, 2009

రంజాన్ , Ramzan  • రంజాన్

'రంజాన్ లేదా రమదాన్ (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్ లోని ఒక ‌నెల పేరు. నెలల క్రమంలో తొమ్మిదవది.

పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '

రమజాన్‌ పర్వదినం /- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

'వసంతమైనా శిలలపైన పూదోట పెరగదు. మెత్తటి మన్ను అయితే మనస్సును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశవైపు ఎవరి గుండె వెళ్తున్నా, దాన్ని మళ్లించి మెత్తటి మన్నుగా మార్చడం పవిత్ర కర్తవ్యం'- అంటారు పెద్దలు. ఏడాదికోసారి నెల రోజులు అలాంటి ఉదాత్త భావాల్ని నేర్పిస్తుంది రమజాన్‌ మాసం. గడచిన నెల రోజులు కచ్చితంగా నిర్ణీతవేళకు సహరీ కోసం తెల్లవారుజామునే ముస్లిమ్‌ సోదరులు నిద్రలేచారు. తినడానికి, తాగడానికి ఏ సడలింపు లేకుండా నిర్ణీత సమయాన్ని పాటించారు. పగలంతా ధర్మయుతంగా చేయవలసిన పనులు చేశారు. సాయంత్రం అందరూ ఒకేవేళకు ఇఫ్తార్‌ చేశారు. సైనికుల్లా నియమ నిబంధనలకు కట్టుబడ్డారు. ఈ విధంగా ఉండటం వల్ల రమజాన్‌ మాసం వాతావరణమంతా పుణ్యకార్యం, దైవభీతి అనే సుగుణాలతో నిండిపోయింది. నెలరోజులు గడచిన అనంతరం 'షవ్వాల్‌' మాసపు నెలవంక దర్శనం జరిగిన వెంటనే పండుగ జరుపుకొంటారు. దీన్నే ఈదుల్‌ ఫితర్‌ అని, రమజాన్‌ అని అంటారు. రమజాన్‌ మాసంలోని సమస్త ఆరాధనలతో దానాలతో పండుగ ముడివడి ఉంది. ఈ కారణంగా ఈ పర్వదినం షవ్వాల్‌ మాసపు మొదటి తేదీన జరిగినా, 'రమజాన్‌' అనే ప్రసిద్ధికెక్కింది.

వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ద సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్‌. దుష్టచింతనల్ని, దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్‌ ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. 'సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న' (ఖుర్‌ఆన్‌ 49:13)

ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్‌ విస్పష్టం చేసింది. నెలరోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈరోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సుగంధం, పన్నీరు పూసుకొని 'తక్బీర్‌' పఠిస్తూ ఈద్‌గాహ్‌ (పండుగ నమాజ్‌ చేసే స్థలం) చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. 'ఇహ్‌దినస్సిరాతల్‌ ముస్తఖీమ్‌' (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువమందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్‌ ముబారక్‌ (ఈద్‌ శుభాకాంక్షలు) తెలియజేసుకొంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకొంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌ మిలాప్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భాసిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్థ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయంకోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వరుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్థకత, సంపూర్ణత. అది డబ్బు గడించడంవల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడంవల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం, పర్వదినాల సారాంశం.

------------------------------------------------------------

పూర్తీ వివరాలకు - > రంజాన్

No comments: