Tuesday, October 27, 2009

మీలాదె నబి , milade nabi

-


మీలాదె నబి--మీలాదున్నబి
మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన్ వస్తుంది.

మౌలిద్ అనునది సాధారణం గ జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియా లో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

మీలాదున్నబి / డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (@ఈనాడు అంతర్యామి ) ->

పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరు మానవ జీవితానికి సార్థకత, సంపూర్ణత సమకూర్చడానికి నిండు ప్రయత్నం చేయాలి. ధర్మనిష్ఠతో ప్రవర్తించాలి. ఇది దైవానికి అమితమైన ఇష్టం- వంటి పరమసత్యాల్ని మహాప్రవక్త మహమ్మద్‌(స) లోకానికి అందజేశారు. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఆదేశాల్ని ఆయన క్రియాత్మకంగా ఆచరించి చూపారు. ప్రవక్త(స) జీవితం దివ్య ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానమై వెలసింది.

అరబ్‌ దేశంలో పాశవిక భావాలు ఆనాడు రెక్కలు విప్పుకొన్నాయి. అజ్ఞానాంధకారంలో అరబ్‌ దేశీయులు కొట్టుమిట్టాడుతున్నారు. ధర్మజ్ఞులు, శాంతిప్రియులు మౌనాన్ని ఎన్నుకొన్నారు. సంకుచిత తమోభావనలు సమత్వపు ప్రభల్ని అస్తమింపజేశాయి.

మహాప్రవక్త(స) ప్రయత్నం ఫలితంగా నాడు వివేకదీపిక ప్రజాహృదయాల్లో వెలిగింది. ఆయన మహిత భాషణలు అందరినీ ప్రభావితం చేశాయి. శత్రువులు సైతం ఆయన మంచి మనస్సుకు శిరస్సువంచారు. ఒకే దైవం, దాన ధర్మం, పరులక్షేమం, చెడు నుంచి విమోచనం సార్వజనీన అంశాలుగా ప్రవక్త(స) రూపుదిద్దిన విధానం పవిత్రజ్ఞాన వర్షాన్ని కురిపింపజేసింది. అరబ్‌ దేశంలో అలముకొన్న అజ్ఞాన తమస్సును నశింపచేయడంలో ప్రవక్త(స) ఎదుర్కొన్న కడగండ్లు పృథ్వీతలాన్ని విస్మయం చెందేలా చేశాయి. అనాథగా ప్రవక్త(స) జీవితాన్ని ఆరంభించారు. మహోన్నత వ్యక్తిగా అపూర్వ లోకోపకారిగా ఎదిగి చరిత్రలో నిలిచారు. అరబ్‌ ద్వీపకల్పం సర్వం ఆయన వశమైంది. ముత్యాల గద్దియను అధిరోహించగల శక్తిసంపన్నుడైన సమ్రాట్టు అయ్యీ ఆడంబరాల్ని త్యజించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికారు. పూరిగుడిసెలో జీవితం గడిపారు. ఆయన ఆహారం ఖర్జూర పండ్లు, మేకపాలు. ఈతచాపలేక జనపనార పట్ట మాత్రమే ఆయనకు శయ్య. ధరించే వస్త్రాలకు అతుకులెన్నో.

మహమ్మద్‌ ప్రవక్త(స) రబీ ఉల్‌ అవ్వల్‌ మాసం పన్నెండో తేదీ (క్రీ.శ. 571 ఏప్రిల్‌ 20) మక్కాలో జన్మించారు. మీలాద్‌ అంటే జన్మదినం. నబి అంటే ప్రవక్త. మీలాద్‌-ఉన్‌-నబి అంటే ప్రవక్త జన్మదినం. సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో ముస్లిములు మీలాదున్నబి జరుపుకొంటారు. ప్రవక్త జన్మించకముందే తండ్రి గతించడం, ఆరేళ్లకు తల్లి మరణించడం విషాద ఉదంతాలుగా మిగిలాయి. తాత అబ్దుల్‌ ముత్తలిబ్‌ ఆయనకు 'మహమ్మద్‌' అని నామకరణం చేసి పెంచసాగాడు. ఆయనా రెండేళ్ళలో తుదిశ్వాస విడిచాడు. ఆ బాలుడు అనాథగా మిగిలిపోయాడు. ఎదురైన ఆటంకాలు ఛేదించుకొని మానవశ్రేయం కోసం ప్రవక్త(స) జీవితం గడిపారు. మానవులంతా సమానమన్నారు. కేవలం పుట్టుక వల్ల, కులం వల్ల, కుటుంబం వల్ల, ధనం, అధికారం వల్ల ఎవ్వరికీ ఏ ఘనతా దక్కదన్నారు. వజ్రశక్తి నింపుకొన్న ప్రవక్త(స) ప్రచారం తీరు స్వార్థపరులై పెత్తనం చేస్తున్న పెద్దల మనుగడకు గట్టి ప్రతిబంధకమైంది. ప్రవక్త (స)కు శత్రువులేర్పడ్డారు. యస్‌రబ్‌ పట్టణానికి ప్రవక్త(స) వలస వెళ్లారు. అది క్రీ.శ. 622వ సంవత్సరం. ఇదే ఇస్లాముకు శకారంభ సంవత్సరం. ఈ వలసను 'హిజ్‌రత్‌' అని, శకాన్ని 'హిజ్రీ' అని అంటారు. యస్‌రబ్‌ పట్టణం మదీనాగా మారింది. మక్కాలోని శత్రువులు క్రూరులు. ప్రవక్త(స)ను, ఇస్లామ్‌ను మట్టుపెట్టే ప్రయత్నంలో ఆయనపై దాడిచేశారు. యుద్ధాలు జరిగాయి. ప్రవక్త(స) ఆశను వదల్లేదు. నిరాశకు లొంగలేదు. విజయం ప్రవక్త(స) వశమైంది.

గృహస్థుగా ఉండి సంసార జీవితం గడుపుతూ లోకానికి దివ్య సందేశ ప్రబోధం చేసిన మహమ్మద్‌ ప్రవక్త శత్రువుల గుండె లోతుల్లోని ద్వేషాన్ని, దుష్టత్వాన్ని నిర్మూలించగలిగిన మహోన్నత వ్యక్తి. ఆయన మతోన్మాదాన్ని గడప తొక్కనీయలేదు. ఇతర మతాలయెడల సద్భావం, సహనం, గౌరవం చూపాలని ఖురాన్‌ ప్రబోధాల్లో ఉంది. ప్రవక్త(స) వచనాల్లోనూ విస్పష్టంగా ఉంది. ప్రజల శాంతియుత జీవన విధానాన్ని భగ్నపరచే అమానుష హింసకుల క్రూర చర్యల్ని అడ్డుకోవడానికి మాత్రమే ధర్మబలంతో ప్రవక్త(స) యుద్ధభూమికి నడిచారు. పరులక్షేమం, సహజీవనం, శాంతి పరిరక్షణం - అంశాల్ని తిరస్కరించిన వారి రాక్షసత్వాన్ని ఎదిరించారు. ప్రేమ సౌభ్రాత్రాల్ని పోషించారు. ఆయన హృదయంలో సామ్రాజ్య పిపాస లేదు. మత విస్తరణ అంతకన్నా లేదు. కేవలం శాంతి సౌఖ్యాల పరిరక్షణ మాత్రం ఆయన మనస్సును అల్లుకొంది.

సాటి మనుషులు చెడుదోవన నడుస్తుంటే వారిని ప్రతి ఒక్కరూ సన్మార్గాన పయనించేలా చేయడం ప్రధాన బాధ్యతగా భావించాలి.

సంఘంలోని వ్యక్తులు పరస్పరం సహాయం చేసుకొనేవారిగా విశాల దృక్పథంతో జీవించాలి. కనీసం పరులకు హాని తలపెట్టనివారిగా మనగలిగినా మానవతకు అంతకన్నా మించిన భూషణం ఏముంది! అజ్ఞానాంధకారాల మంచుతెరలు తొలగి నిఖిలలోకం నిండుహర్షం వహించాలని మీలాదున్నబి ఆశయం.


పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి - > మేలాడే - ఉన్-నబి


  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: