మరిన్ని వివరాల కోసము -> లక్ష్మీదేవి
మహాలక్ష్మి సిరిసంపదలకు అధిదేవత. జీవన సౌభాగ్యానికి దివ్యప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్యపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞరూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతిరూపం ఒక దివ్యసంకేతం. ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది.
మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసితపద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గరూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం.
మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. అందువల్లనే దాన్ని కరెన్సీ అన్నారు. కరెంటు (ప్రవాహమని ఒక అర్థం) అనే ఆంగ్లపదం నుంచి ఈ కరెన్సీ పదం వచ్చింది. ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణీ.
జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థకామమోక్షాలు. జననమరణాల చక్రంనుంచి మనిషిని విముక్తంచేసి ఆమె మహాసత్యంవైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు- కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక.
లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. మహాలక్ష్మి చెంతనే ఒక తెల్లగుడ్లగూబ కనిపిస్తుంది. దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక సంకేతార్థం తెలివిహీనత. సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని చంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయంసమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్నచోట, ఆలోచనలు, సంవేదనలు, సామరస్య సౌందర్యమాధుర్యాలతో విలసిల్లేచోట- జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రామణీయకతతో శోభిల్లినప్పడు శ్రీమహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు. ఆమె అడుగుపెట్టినచోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగిప్రవహిస్తాయి. శ్రీమహాలక్ష్మి సిరిసంపదలతోపాటు జీవితాన్ని భగవదానందప్రదీప్తం చేస్తుంది. సంతోషంలేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతిమనోహరకళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయమంత్రగీతమై రవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్యశిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది.
అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృస్టిలో శ్రీమహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించడమే కాదు... వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృతరసప్లావితంచేసే దేవత!
- ==========================================================
No comments:
Post a Comment
Your comment is helpful in improvement of this Blog.