Thursday, October 15, 2009

బ్రహ్మ విష్ణు మహేశ్వరు లలో ఎవరిని పూజించాలి?, Whom to worship Brahma Vishnu Eswara?






హిందూ మతం లో ...
బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల లో ఎవరిని పూజించాలి ?

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని పూజించాలి? ఎవరిని గురించి తపస్సు చేస్తే కోరుకున్నవి నెరవేరతాయి? అనే సందేహం పూర్వం ఓసారి అగస్త్య మహామునికే వచ్చింది. అప్పుడాయన సందేహం ఎలా నివృత్తి అయింది అని చెప్పే కథా సందర్భం ఇది. మహారాజుకు అగస్త్యుడు తన స్వానుభవాన్ని వివరించాడు.

పూర్వం సర్వలోక జ్ఞానప్రాప్తికి అగస్త్యుడు ఎవరిని ఆరాధించాలా అని ఆలోచించి తనకు తెలిసినంతలో సనాతనుడు, యజ్ఞమూర్తి అయిన విష్ణువును ఆరాధించటం ప్రారంభించాడు. అలా ఆ యజ్ఞమూర్తిని చాలాకాలం పాటు ఆరాధిస్తుండగా ఓ రోజున యజ్ఞమూర్తి ప్రత్యక్షం కాలేదు. కానీ దేవేంద్రుడితో సహా దేవతలంతా అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చారు. తాను యజ్ఞమూర్తిని ఆరాధిస్తుంటే ఆయన ప్రత్యక్షం కాక ఈ దేవతలంతా వచ్చారేమిటబ్బా.. అని అగస్త్యుడు ఆలోచిస్తుండగానే ముక్కంటి నీలలోహితుడు అయిన శివుడు అక్కడికి వచ్చి నిలుచున్నాడు.

ఆయనను చూడగానే దేవతలు, రుషులు అంతా కలిసి ఆ రుద్రమూర్తికి నమస్సులర్పించారు. ఇంతలో మహాయోగి, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడు అయిన బ్రహ్మ ఓ విమానంలో అక్కడకు వచ్చాడు. అలా దేవతలంతా అక్కడకు వచ్చారు కానీ అగస్త్యుడు అనుకొన్నట్లు విష్ణువు మాత్రం రాలేదు. ఇదేమిటి నేననుకొన్నట్లుగాక ఈ దేవతలంతా వచ్చారేమిటి? అని ఆ ముని అనుకొంటూ ఇంతమంది దేవతల్లో అసలు పూజనీయుడెవరు? అనే సందేహం కలిగి రుద్రుడు వైపున తిరిగి అదే విషయాన్ని గురించి అడిగాడు. అప్పుడు రుద్రుడు ఇలా చెప్పటం ప్రారంభించారు.

ఓ మునీ.. లోకాలన్నీ సర్వయజ్ఞాలతో యజిస్తున్నది ఎవరినో, ఎవరి వల్ల ఈ జగత్తంతా దేవతలతో సహా పుడుతోందో.. అలాగే ఈ జగత్తంతా ఎప్పుడూ ఎవరిలో నిలిచి ఉంటుందో, ఎవరిలో విలీనమవుతోందో ఆ పరదైవమే సత్యరూపమైన నారాయణుడు. ఎవరు ఎంతమంది దేవతలను గురించి ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని నమస్కారాలు పెట్టినా అవన్నీ ఆ నారాయణుడికే చెందుతాయి. ఆ దేవదేవుడే లోకపాలనా సౌలభ్యం కోసం మూడు రూపాలుగా సృష్టించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవే ఆ రూపాలు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణం చేత జీవికి ముక్తి కలుగుతుంది. ఆ సత్వం నారాయణాత్మకం. యజ్ఞరూపుడైన నారాయణుడే ఆ భగవానుడు.

ఈయన నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా లోకవాసుల చేత పూజలందుకొంటుంటాడు. కృతయుగం లోని వారు సూక్ష్మ రూపంలో ఉండే నారాయణుడిని ఉపాసిస్తారు. త్రేతాయుగం లోని ప్రజలు యజ్ఞరూపంలో ఉన్న నారాయణుడిని అర్చిస్తారు. ద్వాపరంలో పాంచరాత్ర సిద్ధాంతాన్ని అనుసరించే వారు ఆయనను ఉపాసిస్తారు. కలియుగంలో అనేక రూపాలలో ఆ జనార్ధనుడు పూజలందుకొంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ జనార్ధనుడి కంటే పరదైవం ఇంకొకటి లేదు. విష్ణువే స్వయంగా బ్రహ్మ. బ్రహ్మే స్వయంగా రుద్రుడు.. అని బ్రహ్మ విష్ణు రుద్రులకు ఏ భేదాన్ని పాటించకుండా అందరూ ఆరాధించాలి. ఆ ముగ్గురిలో భేదాన్ని భావించిన వాడు పాపకారి, దుష్టాత్ముడు అవుతాడు.

ఇలా రుద్రుడు అగస్త్యమునికి దైవతత్వాన్ని గురించి వివరించి చెప్పారు. అగస్త్యముని అసలు విషయాన్ని అప్పటికి గ్రహించాడు. తాను అనవసరంగా బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు అని అనుకొంటూ ఎదురొచ్చిన దేవతలను తక్కువ చేసి చూసినందుకు చింతించాడు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్ధతిని బట్టి వారు ఆయా దేవతలను అర్చించవచ్చు. అంతేకానీ ఈ కనిపిస్తున్న దేవుడు మా దేవుడు కాదు.. అంటూ మన భేదాన్ని సృష్టించటం, ఎదుటి మతాన్ని, ఆ దేవతలను తక్కువ చేసి చూడటం సమంజసం కాదని ఆ మునికి బాగా అర్థమైంది.


ఆ కాలంలో సనాతనమతం తప్ప వేరే ఏమీలేనందున ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా మనం ఈ కథను విభిన్నమతాలకు అన్వయించుకోవచ్చు.

courtesy _

సురేష్ బాబు.
కదిరి పట్టణం,అనంతపురం జిల్లా.

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.