Thursday, October 8, 2009

వసంతపంచమి , Vasantha Panchami






వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది .
  • శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని హేమాద్రి తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.

వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

  • సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
  • కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
  • వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
  • రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌
జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతికను ఆలపిస్తుంది. ఆ వసంత రుతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.

  • సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈరోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.

శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.
  • రచయిత /డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

  • రుధ్రుని భృకుటి నుండి అనగా కనుబొమలనుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి . తారిణి , తరళ , తార , త్రిరూపా , ధరణీరూపా , స్తవరూపా , మహాసాధ్వీ, సర్వసజ్జనపాలికా , రమణీయా , మహామాయ , తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్దలక్ష్మి , బ్రహ్మాణి , భద్రకాళి , ఆనందా ... అనేవి తంత్రశాస్త్రాల ఆధారం గా ఇవి ఈ దేవతా దివ్యనామాలు .
  • చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్జిల్లాలోని బాసర లో ప్రతి ఏటా జరుపుతారు .. వేకువజామున నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని వూరేగిస్తారు.

ఈ పంచమిని చిన్నారుల అక్షరాభ్యాసానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలలనుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా భారీగా భక్తులు తరలిరావటంతో బాసర కిటకిటలాడుతోంది. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారు . క్యూలైన్లు ఏర్పాటుచేసి పెద్దవారికి నీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు . అన్నదానం, వైద్యసౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారు .

Collected / Dr.Seshagirirao-MBBS (Srikakulam)

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.