బోధించటం అంటే ఆత్మజ్ఞానాన్ని మాటల్లో పదిలంగా అందించటం. అలాంటి బోధను చెవులతో మాత్రమే వినకూడదు. మనసు, బుద్ధి, ఆత్మతో కలిపి వినాలి. అంటే- ఇంద్రియాలను ఏకీకృతం చేసి, ప్రతి వాక్కును పొల్లుపోకుండా అందుకోవాలి. మనసును భిక్షాపాత్ర చేసుకోవాలి. బుద్ధితో ఆ పాత్రను పదిలంగా పుచ్చుకోవాలి.
బోధ కేవలం జ్ఞానులే చేయగలుగుతారు.
జ్ఞానం అంటే భగవంతుడి హృదయకోశంలో ఉన్న ప్రేమామృతం. దానికి అక్షర రూపం కల్పిస్తే జ్ఞానం అవుతుంది. 'అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు... అందరిలోను నేనే ఉన్నాను' అనేది పరమాత్మ ప్రపంచానికి ఇచ్చే జ్ఞానబోధ. దీన్ని మహర్షులు అందుకోగలిగారు. మరెందరో మహాత్ములూ అందిపుచ్చుకోగలిగారు. వారే ప్రపంచానికి ప్రేమను బోధిస్తున్నారు. దానికి అనేక రూపాలు కల్పిస్తున్నారు. పంచదారతో ఎన్నెన్నో మధుర భక్ష్యాలు చేస్తారు. అన్నింట్లో ఉండే మూలపదార్థం తియ్యదనమే కదా? అలాగే, బోధలన్నింటి మూలపదార్థం ప్రేమ ఒక్కటే.
ఆహరహం చెదరని ప్రేమను భక్తి అంటారు. భక్తిలో సంపూర్ణత్వం సాధిస్తే అది పరమ భక్తి అవుతుంది. పరమ భక్తుల హృదయ కమలంలో అంతర్యామి ఆనంద పారవశ్యంతో సేద తీరుతుంటాడు. ఆంజనేయుడు తన రాముణ్ని హృదయ కమలంలో అనుక్షణం వీక్షిస్తూనే ఉంటాడు. ప్రహ్లాదుని మలి అవతారంగా కీర్తించే రాఘవేంద్రస్వామి హృదయమూ శ్రీరాముని దివ్యధామమే. అలాగే త్యాగయ్య, అన్నమయ్యలు... వీరంతా పరమభక్తులు.
కొందరిని కారణజన్ములుగా చెబుతారు. అటువంటివారు తమ జన్మంతాపరమాత్మ సృష్టికి సేవ చేస్తూనే గడుపుతారు. గురునానక్, గౌతమ బుద్ధుడు, జీసస్, మహ్మద్- ఇలా ఈ కోవకు చెందిన ఎందరో ఈ ప్రపంచంలోకి వచ్చి, తమ బోధలనే అమూల్య ఆస్తులను ఆస్తికులకు అందించి నిష్క్రమించారు. మనిషిని మనీషిగా మార్చడమే జ్ఞానబోధ లక్ష్యం. దురదృష్టవశాత్తు మనకు బోధలపేరుతో బాధలు పెట్టే కుహనా గురువులు ఎక్కువయ్యారు. వీరిని నమ్ముకున్నవారికి మిగిలేది పశ్చాత్తాపమే.
బుద్ధుడు తన సత్యాన్వేషణలో అనేక వృక్షాల నీడలో సేదతీరాడు. బోధివృక్షం నీడలోనే ఆయనకు జ్ఞానోదయమైంది. అంతర్యామిలోకి పరమాత్మ అనంతజ్ఞానం ప్రవహించింది. ఆయనలోని అశాంతి అంతరించి, శాశ్వతమైన శాంతి వికసించింది.
అదే బోధివృక్షం నీడలో కూర్చుంటే మనమూ అలాగే బుద్ధులం కాగలమా? అసంభవం. ఎందుకంటే, సిద్ధార్థుడు బాల్యంనుంచే ఆధ్యాత్మిక జిజ్ఞాసువు. సత్యదర్శనం కోసం అశాంతిగా అడవులు, చెట్లు పుట్టలు పట్టుకు తిరిగాడు. ప్రాపంచిక భావనలన్నింటినీ వదిలించుకున్నాడు. శరీరభ్రాంతి నుంచీ బయటపడ్డాడు. అంతర్యామి దర్శనం కోసం ఆరాటపడ్డాడు. అలసిసొలసినా, శరీర బాధలు వేధించినా తన లక్ష్యం మీద గురి తప్పనీయలేదు. భగవంతుడు ఆ క్షణం కోసమే నిరీక్షించి, వెంటనే బుద్ధుణ్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణమే మహోదయం.
బోధివృక్షం నీడలో సిద్ధార్థుడు బుద్ధుడు కావటం కాదు. బుద్ధుడు అక్కడ జ్ఞానమూర్తి అయినందువల్లనే అది బోధివృక్షమైంది. అసలు బోధివృక్షం బుద్ధుడే. ఈ రహస్యం గ్రహించలేక ఎందరో బోధివృక్షాన్ని పూజిస్తూ, బుద్ధుడి బోధలు విస్మరిస్తున్నారు.
ఎవరు కేవలం బోధలతో సరిపెట్టక, తాము ఆ బోధలను ఆచరిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారో- వారే బోధివృక్షాలని మనం గ్రహించాలి.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్@ ఈనాడు దినపత్రిక.
- ======================
No comments:
Post a Comment
Your comment is helpful in improvement of this Blog.