Saturday, November 27, 2010

దీపారాధన , Deepaaraadhana , Light worship



దీపారాధన - ఆనందాలకు ఆహ్వానాలు
'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. దీపావళిలో ఎన్నో జ్యోతిర్లింగాలు!

లక్ష్మీదేవిని దీపజ్యోతిగా, జ్యోతిని లక్ష్మీమూర్తిగా భావించిన ఉపాసనాశాస్త్రం మనకు ఉంది. లక్ష్మి శ్రీ- అనే మాటకు 'కాంతి, శోభ' అని అర్థాలు. అందుకే దీపకళికను లక్ష్మీరూపంగా భావించడం, దీపరాత్రిని లక్ష్మీపూజకు ప్రధానంగా వ్యవహరిస్తారు. అందునా- ఆనందం, ఐశ్వర్యం- అనే భావనకు ఒక దేవతారూపాన్నిస్తే- అదే 'లక్ష్మీదేవి'. ఆ దివ్యభావనను అనుసంధానించడమే దీపోపాసనలోని పరమార్థం. ఐశ్వర్యం, ఆనందం మెండుగా ఉన్నప్పుడు ముఖం 'వెలిగి'పోతుంది. ఈ వెలుగును కొలుచుకోవడమే దీపావళి శోభ. ధనలక్ష్మీ ఆరాధనతో దీపలక్ష్మిని పూజించడం ఈ పండుగనాటి ప్రత్యేకం.

నరక చతుర్దశితో మొదలుపెట్టి క్రమంగా దీప మహోత్సవం కార్తీక పూర్ణిమ వరకు కొనసాగుతుంది. నరకబాధల్ని పోగొట్టే పర్వం- 'నరక చతుర్దశి'. ఈ పేరు కృష్ణావతారానికి ముందు నుంచి ఉన్నదే. నరులను వేదనకు గురిచేసే దురవస్థను 'నరకం'- అంటారు. ఆ దురవస్థను పారదోలే పర్వదినాలు నరక చతుర్దశి, దీపావళి. ఈ రెండు పర్వదినాల్లో ప్రాతఃకాలం అభ్యంగస్నానం చేయాలి- అని శాస్త్ర నిర్దేశం. జలంలో గంగ, తైలంలో లక్ష్మీ- సన్నిహితులై ఈ రెండురోజుల్లో ఉంటారనీ; కనుక తైలాభ్యంగం, ఉష్ణజల స్నానం గంగా పవిత్రతనీ, లక్ష్మీకృపనీ ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాల మాట.

శ్రీకృష్ణపరమాత్మ నరకాసుర సంహారం చేసిన తరవాత, ఈ 'నరక చతుర్దశి' మరొక నామసార్థక్యాన్ని పొందింది. ఇంకొక ప్రశస్తి జత అయింది. కానీ దానికి పూర్వమే 'నరక చతుర్దశి' నామం ఉందని గ్రహించాలి.

దీపావళినాడు 'యమతర్పణం' వంటి విధులనూ చెప్పారు. జ్యోతిర్విజ్ఞానం ప్రకారంగా అమావాస్యకు పితృదేవతలు అధిపతులు. విశేషించి ఆశ్వయుజ అమావాస్య వారికి ప్రీతి. 'ఈ పితృదేవతలు 31 గణాలుగా ఉంటాయి. మన పూర్వీకులను భక్తితో ఆరాధిస్తే ఈ పితృ దేవతలు సంతోషించి- పూర్వీకులు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా వారిని ఆనందపరచడమే కాక, తనవారిని తలచుకున్న ఆరాధికుల కృతజ్ఞతాభావానికి సంతోషించి దీవెనలందిస్తారు'- అని పురాణ విజ్ఞానం.

తాత ముత్తాతలు నరకం వంటి దుర్గతులకు పోకుండా, జ్యోతిర్మయమైన ఆనంద లోకాలకు చేరాలి- అనే భావంతో దీపాలు, ఉల్కజ్వాలలు వెలిగించి చూపించడం వంటివి ఈ రోజున చేస్తుంటారు. ఒకవైపు పూర్వతరాలను తలచుకోవడం, మరొకవైపు ఐశ్వర్యాధి దేవతను పూజించడం, ఇంకోవైపు వేడుకల్లో తేలియాడటం- ఈ కాంతిపర్వంలోని కళలు. 'ఆ లక్ష్మీ నివాసం' పేరుతో దివ్వెలు వెలిగించడమేకాక, డప్పులు కొట్టి చప్పుళ్లు చేయడం ప్రాచీనకాలంలోని ఆచారం. ఆ చప్పుళ్ళే బాణసంచాధ్వనులుగా, కాంతిలీలలుగా క్రమంగా ఆవిష్కృతయ్యాయి.

విజయోత్సవాల్ని బాణసంచాతో జరుపుకోవడం- ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో భాగం. అంటే ఇది మానవుల్లోని వినోద స్వభావమన్నది స్పష్టం. పారలౌకిక భావనలను అలా ఉంచి, దుఃఖానికి ప్రతీకలైన నరకమార్గాలను, అలక్ష్మిని పరిహరించి, సుఖస్వరూపమైన దివ్యత్వాన్ని సంతరింపజేసుకోవడమే ఈ దీపపర్వంలోని విశిష్టత.

- సామవేదం షణ్ముఖశర్మ
  • ===================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.