Tuesday, October 19, 2010

ఆశ్వయుజ మాసం , Aswayuja Month

7. ఆశ్వయుజ మాస వైభవం

అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ నెలలో వైశిష్ట్యం.

ఆశ్వయుజం శరత్కాలంలో వస్తుంది. ఇది వర్షాలు తగ్గి ప్రకృతి కాంత కొత్త శోభను సంతరించుకునే కాలం. పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. 'ఆకాశ లక్ష్మి చుక్కలనే ముత్యాల దండల్ని ఆకాశగంగలో కడగడానికి సిద్ధం చేసిన కుంకుడు కాయ నురుగు తెప్పల్లా తెల్లగా ఉన్నాయి శరత్కాల మేఘాలు' అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదలో. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు దక్షిణాభిముఖుడవుతాడు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మనఃకారకుడు.

శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజ పాడ్యమినుంచి తొమ్మిది రోజులపాటు దేవిని పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలను తొమ్మిదిరోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. దేశంలో ఉత్తరాదిన రామలీలా ఉత్సవాలు చేస్తారు. మహాలయా పితృపక్షం ముగియగానే దేవతారాధన జరపడం అనేది, ఆ పితృదేవతలను తమకు ప్రసాదించిన ఆదిపరాశక్తిని కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో త్రిమాతారూపంగా పూజించడం. అది ఒక యోగం. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి. ఆ పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సమస్త సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో కలశస్థాపన చేస్తారు. ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజించి పదో రోజున ఉద్వాసన చెబుతారు. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమినాడు వాగ్దేవి సరస్వతీపూజ. వేదమాతృకగా, జ్ఞానభూమికగా, సమస్త విద్యావాహికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం.

ఒక సంప్రదాయం ప్రకారం నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని 'శైలపుత్రి'గా పూజిస్తారు. రెండోరోజు తపోనిష్ఠతో పరమేశ్వరుని మెప్పించిన 'బ్రహ్మచారిణి'ని సేవిస్తారు. మూడో రోజు 'చంద్రఘంటాదేవి'. నాలుగోరోజు కూష్మాండదేవి. అయిదోరోజు 'స్కందమాత' అని, ఆరో రోజు 'కాత్యాయని' వ్యవహరిస్తారు. ఏడోరోజు దేవిని 'కాళరాత్రిదేవి'గా అర్చిస్తారు. ఎనిమిదో రోజు 'మహాగౌరి' అయితే, తొమ్మిదోరోజు 'సిద్ధిధాత్రి'గా కొలుస్తారు. దేవీ నవరాత్రుల్లో 'కుమారిపూజ' చేసే ఆచారమూ ఉంది.

పదోరోజు 'విజయదశమి'. దాన్ని విజయానికి సంకేతంగా భావిస్తారు. విజయదశమినాడు శ్రీరాముడు రావణుని సంహరించాడని విశ్వాసం. అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవవీరులను ఓడించాడని మహాభారతం విరాటపర్వ ఉదంతం. విజయదశమినాటి శమీపూజ ప్రసిద్ధమే.

ఆశ్వయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు. బహుళ తదియ అట్లతదియ. స్త్రీల పండుగ. ఆశ్వయుజ బహుళత్రయోదశి 'ధనశ్రయోదశి'. లక్ష్మీపూజ చేస్తారు. చతుర్దశినాడు సత్యకృష్ణులు నరకాసురుని వధించిన దినంగా 'నరక చతుర్దశి'గా భావిస్తారు. అమావాస్యనాడు 'దీపావళి'. నరకాసురవధ కాకుండా బలిచక్రవర్తి గౌరవార్థం దీపావళి జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్కుని పట్టాభిషేకం జరిగిందనే ఒక గాథ ప్రచారంలో ఉంది. సూర్యుడు దీపావళినాడు తులారాశిని పొందుతాడని, ఆ రోజు లోకులు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనం చేయాలని 'ధర్మసింధు' చెబుతోంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
  • ========================================
Visit My Website - > Dr.Seshagiriraohttp://dr.seshagirirao.tripod.com

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.